Suryaa.co.in

Editorial

అవినాష్-సీబీఐ.. ఆట ఆగిందా?

– అవినాష్ అరెస్టుపై సస్పెన్స్
– సీబీఐ దాగుడుమూతలు
– విధాతలు ఆదేశిస్తేనే అడుగులా?
– మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి
– సీబీఐను ఇంటరాగేట్ చేసినా చలనం ఏదీ?
– కోర్టు స్వేచ్ఛ ఇచ్చినా కదలని మొహమాటం
– సీబీఐ కాళ్లకు అడ్డుపడుతున్న శక్తులెవరు?
– సుప్రీంకోర్టు వైఖరి తెలిసినా ఇంకా శషభిషలేనా?
– బీజేపీ బద్నామ్ అవుతోందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కేసు విచారణ జరుగుతోంది. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియదు. మరుసటి రోజు నుంచి కోర్టుకు సెలవలు. ఆ ఒక్కరోజు గడిస్తే చాలు. అవినాషన్నకు నెలరోజుల ఊరట. మరి హైకోర్టు ‘అమాయకుడైన’ అవినాష్‌రెడ్డికి ఊరటనిస్తుందా? లేదా? పులివెందుల మర్డర్ ఆటను బీజేపీ ఇంకెన్నాళ్లు ఆడుతుంది? అలాగైతే మరి బీజేపీ బద్నామ్ కాదా? నాన్సెన్స్.. కోర్టు తీర్పు-సీబీఐ విచారణకు, నీతినిజాయతీకి నిలువెత్తు నిదర్శనమైన బీజేపీకి ఏ సంబంధం? ఆ రోజంతా అన్ని వర్గాల్లోనూ ఇదీ చర్చ.

సరిగ్గా అదే రోజు ఉదయం, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు ఒక ఆసక్తికరమైన గ్రాఫిక్ సందేశం విడుదల చేశారు. కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌షా-ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కలసి ఉన్న ఫొటో పక్కన ‘కనీసం ఈరోజైనా సీబీఐ అధికారులను అరెస్టు చేస్తారా? లేదా’ అన్నది కొలికపూడి సోషల్‌మీడియాలో పెట్టిన వ్యంగ్య సందేశం.

దానిని క్యాజువల్‌గా చదివేవారికి మాత్రం.. ‘ఈరోజైనా సీబీఐ అధికారులు అవినాష్‌ను అరెస్టు చేస్తారా’ అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా చదివితేనే, అందులోని సీరియస్ కామెడీ అర్ధమవుతుంది. సీబీఐ వైఖరి-కోర్టుల విచారణ-ఆలస్యమవుతున్న తీర్పులను.. ఒకే ఒక్క ఫొటోతో సమాజానికి సందేశమిచ్చిన వైనమది.

రోజూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి- టీవీ-5 చర్చల్లో దర్శనమిచ్చే డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు ఒకప్పుడు.. మహాసేన రాజేష్ మాదిరిగానే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా గళం విప్పిన వ్యక్తి. టీవీ చర్చల్లో వివిధ అంశాలపై విరుచుకుపడి కనిపించే కొలికపూడి.. ఇప్పుడున్న చాలామంది కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలకు శిక్షణ ఇచ్చిన మేధావి. చాలామంది ఆంధ్రులు ఏపీకి అన్యాయం జరుగుతున్నా.. మనకెందుకులే అని హైదరాబాద్‌లో స్థిరపడి, ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కానీ డాక్టర్ కొలికపూడి మాత్రం తన రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపనతో, తెగించి మరీ సర్కారును ఢీకొంటున్న మేధావి. అమరావతి కోసం పాదయాత్ర చేసిన పక్కా ఆంధ్రోడు!

అటు ఎంపీ రఘురామరాజు కూడా తనకు ఆంధ్రాలో అడుగుపెట్టే అవకాశం లేకపోయినా, హ స్తినలో కూర్చుని ప్రతిరోజూ రచ్చబండ పెట్టి, పాలకులను చాకిరేవు పెడుతున్నారు. ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకే అంశంపై, వైసీపీ లక్ష్యంగా అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ తీరుపై, వారిద్దరూ సంధిస్తున్న అస్త్రాలు.. ఆసక్తికరం-ఆలోచనాత్మకంగా కనిపిస్తున్నాయి.

‘కొలికపూడి కామెంట్స్’ పేరుతో, సోషల్‌మీడియాలో విడుదల చేసే గ్రాఫిక్ కామెంట్స్ సూటిగా ఉంటాయి. వివరణలు-ఉపోద్ఘాతాలు అవసరం లేకుండానే, ఒకే ఒక్క ఫొటోతో అరటిపండు వలచినట్లు, ఆ సందేశం విషయమంతా సులభంగా అర్ధమవుతుంది. ఇప్పుడు ఏపీకి సంబంధించి ప్రత్యక్ష పోరాటాలు చేస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ-జనసేన-వామపక్షాలు-కాంగ్రెస్ కంటే… జగనన్నపై జమిలిగా మాటల యుద్ధం చేస్తున్న ఎంపి రఘురామకృష్ణంరాజు- కొలికపూడి శ్రీనివాసరావుకే సోషల్‌మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ.

కాకపోతే రఘురామరాజు పోలీసు బాధితుడు. డాక్టర్ కొలికపూడి ఇంకా పోలీసు బాధితుడు కాదు. ఆయనను ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియదు. అదొక్కటే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్. ఒకొరిది కామెడీ అయితే, మరొకరిది సీరియస్ కామెడీ. కానీ ఇద్దరి చెప్పే మాటల్లో బోలెడంత సరుకు, సరంజామా ఉంటుంది. మెడపై తల ఉన్న ఎవరికైనా వారి మాటలు వీజీగా అర్ధమయిపోతాయి. ఒక్కటి మాత్రం నిజం.

అలాంటి వారు కూడా గళం విప్పకపోతే వ్యవస్థ మరీ నియంతృత్వమవుతుందన్నది మేధావుల ఉవాచ. స్వయంప్రకటిత మేధావులు. సెమీ మేధావులు, ఉద్యమకారులుగా చెప్పుకునే వారంతా అధికారానికి భయపడి నవరంధ్రాలూ మూసుకుంటే, ఒక రఘురామ-మరో కొలికిపూడి వంటి వారు లేకపోతే, పాలకులను ప్రశ్నించే గొంతులే శాశ్వతంగా చచ్చుబడిపోతాయన్నది మేధావుల మనోగతం.

కడప ఎంపి, సీఎం జగన్ సోదరుడైన అవినాష్‌రెడ్డి అరెస్టు వ్యవహారం.. తెలుగు టీవీ జీడిపాకం సీరియళ్లు కూడా సిగ్గుపడేలా సాగుతున్న తీరుపై , అటు రఘురామ-ఇటు కొలికపూడి సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలు, సోషల్‌మీడియాలో బాంబుల్లా పేలుతున్నాయి. ‘మర్యాదరామన్న’ల మాదిరి వారు సంధిస్తున్న సీరియస్ వ్యంగ్యాస్త్రాలు, ప్రజలను కడుపుబ్బ నవ్విస్తున్నా, సీబీఐలో మాత్రం చలనం లేదు. అరెస్టులో జరుగుతున్న ఆలస్యంపై, ప్రధానంగా డాక్టర్ కొలికిపూడి ఫొటోలతో సంధిస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. కోర్టులు, సీబీఐని పల్లెత్తు మాట అనకుండా.. వారిద్దరూ పేలుస్తున్న సెటైర్లలో అంతరార్ధం ఏమిటన్నది.. సామాన్యుడికి సైతం అర్ధమైనా, సీబీఐకి మాత్రం అర్ధం కాకపోవడమే విచిత్రం.

అసలు కోడిరక్తం చూస్తేనే భయపడే ‘అమాయకుడైన’.. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిపై అంతేసి నిందలు వేయడమే, దుర్మార్గమన్నది ఆయన అభిమానుల ఉవాచ. తనను టార్గెట్ చేసి సీబీఐ వేధిస్తోందన్న అవినాషన్న ఆరోపణలు, సీబీఐ పట్టించుకోకపోవడం మరీ దుర్మాగంన్నర. అంతా కలసి కుమ్మకై, అమాయకుడైన తనను ఇరికిస్తున్నారన్న అవినాషన్న ఆక్రోశం అర్ధం చేసుకోదగ్గదే. చివరాఖరకు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకూ తన వాదన వినకపోవడం అవినాషన్న అభిమానులకు ఆవేదన కలిగించేదే.

కానీ అంత ఆవేదన-ఆక్రోశం లోనూ.. అవినాషన్న సీబీఐ అధికారులనే ఇంటరాగేషన్ చేయటం గ్రేట్. అసలు విచారణ సీబీఐ చేస్తోందా? లేక అవినాషన్ననే సీబీఐని కోర్టులో ఇంటరాగేట్ చేస్తున్నారా అన్నది రఘురామకృష్ణంరాజు లాంటి వారి సందేహం. రఘురామరాజుకు గోదావరి వెటకారం కాస్తంత ఎక్కువైనప్పటికీ, మిగిలిన బుద్ధిజీవులదీ అదే సందేహం.

సరే.. ఇప్పుడు హైకోర్టు అవినాషన్నను సీబీఐ నుంచి రక్షించలేనని చెప్పేసింది. ‘‘సుప్రీంకోర్టు పెద్దాయన చెప్పిన తర్వాత కూడా, మాపై ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? కావాలంటే వెళ్లి సీజే బెంచ్‌కు వెళ్లమ’’ని సలహా ఇచ్చింది. అక్కడ కూడా వర్కవుట్ కాలేదు. మరి ఇప్పుడెలా? సీబీఐ ఏం చేయబోతోంది? నిన్న మొన్నటి వరకూ ‘నేను లేస్తే మనిషిని కానట్లు’ గర్జించిన సీబీఐ.. అవినాషన్నను అరెస్టు చే సి, తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుని, తనపై ఉన్న అనుమానాలకు శాశ్వతంగా తెరదించుతుందా? లేక ‘హస్తిన విధాతల ఆదేశాలు వచ్చేంత వరకూ’.. ఏ పరిమళ నత్వానీ రాయబారం ఫలించే వరకూ, ఈ ఆట ఇలాగే కొనసాగిస్తుందా? అన్నది సామాన్యుల సందేహం.

నిజానికి.. ఎంపి రఘురాముడు చెప్పినట్లు.. ఇప్పటి పరిస్థితుల్లో అవినాషన్నను అరెస్టు చేయడానికి ఉన్న ప్రతిబంధకాలే మీ లేదు. మీ పని మీరు చేసుకోవచ్చని.. స్వయంగా హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా, సీబీఐ శషభిషలకు పోకుండా, మామూలుగా అయితే తన పని తాను చేసుకుపోవాలి. కానీ సీబీఐ ఆ పని చేస్తుందా లేదా? అన్నదే పెపంచకంలో కనిపిస్తున్న సందేహం.

అసలు వివేకానందరెడ్డి హత్య కేసులో, సీబీఐ ఆడుగుతున్న ఆటనే ఓ విచిత్రం. వివేకానంద హత్య కేసును తనకు చిత్తం వచ్చినప్పుడు కేసు దర్యాప్తు చేసింది. తనకు చిరాకు వచ్చినప్పుడు కేసు ఆపేసేది. మళ్లీ మూడ్ వచ్చినప్పుడు మొదలుపెట్టేది. అవసరమైతే అవినాషన్నను అరెస్టు చేస్తాం అని సుప్రీంకోర్టు-హైకోర్టుకు సీబీఐ రెండుసార్లు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అవినాషన్న అరెస్టును ఆపలేమని స్పష్టంగా చెప్పింది.

తెలంగాణ హైకోర్టు ఆయనకు ఇచ్చిన రక్షణ కవచాలను కూడా సుప్రీంకోర్టు నిర్మొహమాటంగా కొట్టేసింది. హైకోర్టు ఇచ్చిన వె సులుబాటును తీవ్ర పదజాలంతో ఆక్షేపించింది. అయినా సరే.. అరెస్టుపై సీబీఐ ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కపెడుతోంది? కోర్టులు చెప్పిన వెంటనే ఎందుకు తన కర్తవ్యం నెరవేర్చలేదు? రఘురామకృష్ణంరాజు చెప్పినట్లు.. అవినాషన్న అరెస్టుకు ఇప్పుడు ఉన్న ప్రతిబంధకమేమిటన్నది సామాన్యుడి సందేహం.

తనను విచారించిన సీబీఐ ఎస్పీపైనే కేసులు పెట్టించినా, సీబీఐ ఎందుకు స్పందించడం లేదు? నిందితుడి మాదిరి తననే ఇంటరాగేషన్ చేసిన అవినాషన్న అరెస్టుకు, కోర్టులు క్లియరెన్స్ ఇచ్చినా సీబీఐ ఎందుకు ముందడుగు వేయడం లేదు? పచ్చ మీడియా, డాక్టర్ సునీతతో కలసి సీబీఐ తనను వేధిస్తోందంటూ, స్వయంగా అవినాషన్న సందేశం ఇచ్చినా, సీబీఐ ఎందుకు తగిన సమాధానం చెప్పడం లేదన్నది మెడపై తల ఉన్న అందరికీ వచ్చే సందేహాలు.

కొలికపూడి శ్రీనివాసరావు అనే మేధావి…. గత కొద్దిరోజుల నుంచి అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారిస్తున్న తీరుపై, సోషల్‌మీడియా వేదికగా సంధిస్తున్న ప్రశ్నలు-సందేహాలు-వ్యాఖ్యలు పరిశీలిస్తే.. అసలు సీబీఐ వివేకా హత్య కేసు నిందితులను విచారిస్తోందా? లేక నిందితులే సీబీఐని విచారిస్తున్నారా? అన్న సందేహాలు బుద్ధిజీవులకు రావడం సహజం. ‘సీబీఐ అధికారులందరినీ అరెస్టు చేసి, వారంరోజులు అవినాష్‌రెడ్డి కస్టడీకి అప్పగించాలి. అప్పుడే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది‘ అంటూ, కొలికపూడి సోషల్‌మీడియా వేదికగా సంధించిన వ్యంగ్యాస్త్రం.. సీబీఐ దయనీయానికి అద్దం పట్టింది.

అయితే మేధావి అయిన కొలికిపూడి అయినా.. తెగించి పోరాడుతున్న రఘురామరాజయినా.. హస్తిన విధాతల నుంచి ఆదేశాలు రానంతవరకూ, సీబీఐ కాళ్లు కదలవన్నది గ్రహించకపోవడమే అమాయకత్వం. సీబీఐ కాంగ్రెస్ పంజరంలోని చిలక అని, గతంలో స్వయంగా జగన్ అండ్ ఫ్యామిలీనే ఆరోపించింది. ఇప్పుడు కేంద్రంలో అధికారం మారింది. కాంగ్రెస్ బదులు బీజేపీ వచ్చింది. అంతే తేడా. మరి ఆ ప్రకారంగా మిగిలినదంతా సేమ్ టు సేమ్ కదా?!

మరి ఇప్పుడు సీబీఐ ఆట కొన‘సాగుతుందా’? లేక ఆగుతుందా? అవినాషన్న అరెస్టుతో ఆట ఆపేస్తుందా? లేక మరో నెలరోజులు వ్యాపారదిగ్గజ ‘పరిమళాల’ ప్రభావ పుణ్యాన, ‘అమితానందం’ తో సాగదీస్తుందా? అసలు విధాతలు ఆడుతున్న ఈ ఆటలో అరటిపండు ఎవరు? ఆవకాయ ఎవరన్నది కాలమే తేల్చాలి.

LEAVE A RESPONSE