‘ముఖం’ చెల్లకనే ఎమ్మెల్యేల మార్పులా?

– గత ఎన్నికల్లో తనను చూసి ఓటేయమన్న జగన్
– ఇప్పుడు వారినే మారుస్తున్న వైనం
– అంటే తన ముఖం చెల్లడం లేదన్న సంకేతమా?
– ఇంటర్ డిస్డ్రిక్ట్, ఇంటర్ స్టేట్ బదిలీలేంటి?
– ఒక చోట పనికిరాని ఎమ్మెల్యే ఇంకో చోట పనిమంతుడెలా అవుతారు?
– 86 శాతం సంతృప్తకరస్థాయి ఉంటే మార్పులెందుకు?
– 175కి 175 సీట్లు వస్తే కొత్త ముఖాలెందుకు?
– ఎవరు ఎవరితో కలిస్తే భయమెందుకు?
– తన తప్పులకు ఎమ్మెల్యేలను బలిపశువులను చేస్తున్నారా?
– ఎమ్మెల్యేలు,మంత్రులు ఉత్సవ విగ్రహాలేకదా?
– జగన్ అపాయింట్‌మెంట్ ఎవరికి ఇచ్చారు?
– విజయసాయి, సజ్జల, వేమిరెడ్డి, సుబ్బారెడ్డి రాజకీయ అనుభవమెంత?
– ఆళ్ల, కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్లు వెళ్లిపోవడం వెనుక సంకేతాలే మిటి?
– టికెట్లు ఇస్తామన్నా వేమిరెడ్డి, శిద్దా, లావు ఎందుకు వద్దంటున్నారు?
– రెడ్లు కూడా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు?
– వైసీపీ తిరోగమనానికి జగనే బాధ్యులా?
– వైసీపీలో సర్వత్రా ఇదే చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆ నేత గత ఎన్నికల సమయంలో తన ముఖం చూసి ఓట్లేయమన్నారు. జనం ఆయన పిలుపును మన్నించి, అదే పనిచేసి 151 సీట్లు కట్టబెట్టారు. కానీ ఇప్పుడు వారినే మారుస్తున్నారు. మరికొందరిని ఐఏఎస్-ఐపిఎస్ అధికారుల మాదిరిగా, అంతర్ జిల్లా బదిలీలు చేస్తున్నారు. కర్నాటక నుంచి బీజేపీ మాజీ ఎంపీని తీసుకువచ్చారు. అంతర్ జిల్లాలు దాటి అంతర్ రాష్ట్ర బదిలీల వరకూ వెళుతున్నారు.

అంటే ప్రజల్లో తన ముఖం చెల్లడం లేదని గ్రహించారా? ఎంపి-ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్నా మాకొద్దంటూ , అందరూ తిరస్కరించడానికి కారణం ఆ నేత ముఖం చెల్లకనేనా? చివరాఖరకు రెడ్లు సైతం, తాడేపల్లి బంధనాలు తెంచుకుని పారిపోవడానికి కారణం తన ముఖం చెల్లకనేనా? ఇదీ ఇప్పుడు వైసీపీలో క నిపిస్తున్న దృశ్యాలు. వినిపిస్తున్న మాటలు!

అసలు అన్ని తప్పులూ తన వద్దే పెట్టుకుని, ఎమ్మెల్యే-ఎంపీలను బలిపశువులను చేయడం ఏమిటి? 175కి 175 సీట్లు వస్తాయనే ధీమా ఉన్న అధినేత, సిట్టింగులను ఎందుకు మారుస్తున్నట్లు? ఒకచోట చెల్లని రూపాయి, పక్క ఊర్లో పదిరూపాయల నోటెలా అవుతుంది? అదే ముఖం..అదే అప్రతిష్ఠ కదా? మరి ఈ లాజిక్కేమిటి?.. ఇదీ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, తమ అధినేత జగన్‌పై సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు. విచిత్రంగా ఇవేమీ తాడేపల్లి చెవులకు వినిపించవు. కళ్లకు కనిపించవు. అయినా సిట్టింగుల గోస మాత్రం ఇదే!

ఏపీలో జగన్ ఇమేజ్ పూర్తిగా డామేజీ అయిపోయిందా? తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సిట్టింగులను మారుస్తున్నారా? ఒక నియోజకవర్గంలో చెల్లని ముఖం, పక్క నియోజకవర్గంలో మాత్రం ఎలా చెల్లుతుంది? అక్కడా అదే ముఖం కదా?ఏమైనా మారుతుందా? లేకపోతే మాస్కులు పెట్టుకుని తిరుగుతారా? గత ఎన్నికల ముందు నన్ను చూసి ఓటేయమన్న జగనన్న.. ఇప్పుడు అదే మాట ఎందుకు చెప్పడం లేదు? అంటే ప్రజలకు ఆయన ‘ముఖం’ చూపించలేకపోతున్నారా? ఆయన ముఖం చెల్లడం లేదనేకదా అర్ధం?… ఇదీ ఇప్పుడు వైసీపీలో సిట్టింగుల నుంచి సీనియర్ల వరకూ సంధిస్తున్న ప్రశ్నలు. రేపటి ఎన్నికల్లో కూడా జనం, జగన్ ముఖం చూసే ఓటేస్తారని స్పష్టం చేస్తున్నారు.

గత నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ తీసుకున్న ప్రభుత్వ-పార్టీ నిర్ణయాలన్నీ ఆయన ఏకపక్షంగా తీసుకున్నవేనని వైసీపీ సిట్టింగులు గుర్తు చేస్తున్నారు. పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తల నియామకాలు, నామినేటెడ్ పదవులన్నీ తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నవేనని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల రూపకల్పన అంశాల్లోనూ ఎవరితోనూ చర్చించని జగన్… ఇప్పుడు వైఫల్యాలకు తమను ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

గత ఎన్నికల్లో నా ముఖం చూసి ఓటేయమన్న జగన్.. ఇప్పుడు కూడా తన ముఖం చూసి ఓటేయమని, ఎందుకు అడగటం లేదని నిలదీస్తున్నారు. ‘‘అప్పుడు జగన్ ముఖం చూసి మమ్మల్ని గెలిపించిన జనం, ఇప్పుడు కూడా గెలిపిస్తారు కదా? గెలిపించాలి కూడా. మరి మమ్మల్ని మారుస్తున్నారంటే ఆయన ముఖం జనంలో చెల్లడం లేదనేకదా అర్ధం? ఆయన వైఫల్యాలను మాపై రుద్దితే ఎలా? ఇక్కడ నియోజకవర్గాల్లో మమ్మల్ని డమ్మీలను చేసి, వాలంటీర్లతో పనిచేయించుకుంటున్నారు’’ అని గుంటూరు జిల్లాకు చెందిన, ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

‘‘ మాకు తాడేపల్లిలో అపాయింట్‌మెంట్ ఇవ్వరు. సీఎంఓ అధికారులకే అన్నీ చెప్పుకోవాలి. నాలుగైదుసార్లు గెలిచిన మేం.. వైసీపీ పెట్టిన తర్వాత వచ్చిన సమన్వయకర్తల ముందు, చేతులు కట్టుకుని నిలబడాలి. మేం చెప్పిన వారికి బిల్లులు ఇవ్వరు. సీఎంఓ చెప్పినా పనిజరిగే పరిస్థితి లేదు. ఇన్ని వైఫల్యాలు జగన్ దగ్గర పెట్టుకుని, మమ్మల్ని బలిపశువులను చేయడం ఏం రాజకీయం? అసలు పెద్దాయనకూ, ఈయనకూ ఏవిషయంలోనూ పోలికే లేదు’’ అని కోస్తాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

వైసీపీ స్థాపించిన తర్వాత వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారి ముందు.. 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న తాము, నిలబడాల్సి వస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. మీకు టికెట్ లేదని అలాంటివారితో చెప్పించుకుంటున్నందుకు, సిగ్గుగా ఉందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘వాళ్లకున్న రాజకీయ అనుభవం ఎంత? స్థానిక పరిస్థితులపై వాళ్లకేం అవగాహన ఉందని సిఫార్సు చేస్తున్నారు? మా పార్టీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఓపెన్‌గా చెప్పినట్లు, నెలా నెలా కలెక్షన్లు వసూలు చేసి ఇవ్వడమే వారికి ఉన్న ఏకైక అర్హత. ఇలాంటి వాళ్లు ఉన్న పార్టీలో ఇన్నాళ్లూ కొనసాగినందుకు మాకూ సిగ్గుగానే ఉంద’ని, రెడ్డి వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

అసలు 175కి 175 సీట్లు, 80 శాతానికిపైగా సంతృప్తకరస్థాయి, ఎస్సీ-ఎస్సీ-ఎస్టీ-మైనారిటీలంతా మనవైపే ఉన్నప్పుడు… 58 శాతం ఓటు బ్యాంకు ఉన్నప్పుడు.. మళ్లీ సీట్లు మార్చాడం ఎందుకన్న ప్రశ్నలు, ఇటీవలి కాలంలో పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎవరు ఎంతమంది కలిసినా సింహం సింగిల్‌గానే వస్తుంది అన్న భారీ డైలాగులు చెప్పే నాయకతత్వం.. టీడీపీ-జనసేన పొత్తుకు భయపడాల్సిన పనేమిటి? ఎవరు ఎవరితో కలిస్తే వచ్చే నష్టమేమిటి? జనసేన 175 సీట్లలో పోటీ చేస్తే మనకెందుకు? చేయకపోతే మన కెందుకు? అంటే మా నాయకత్వం టీడీపీ-జనసేనను చోసి భయపడుతోందన్న విషయం స్పష్టమవుతోంది కదా అని సిట్టింగులు చర్చించుకుంటున్న పరిస్థితి.

తాను నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, వైఎస్-చంద్రబాబుతో కలసి పనిచేసినా ఇలాంటి సీఎంను, ఇలాంటి పార్టీ అధ్యక్షుడిని ఎప్పుడూ చూడలేదని మరో సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

‘పెద్దాయన వద్ద వెంటనే అపాయింట్‌మెంట్ దొరికేది. ఆయన ఆప్యాయంగా మాట్లాడతారు. ‘వాట్ సార్ మీ జిల్లా ఎలా ఉంది’ అని అడిగేవారు. మా సమస్యలను అర్ధం చేసుకుని అధికారులకు ఆదేశాలిచ్చేవారు. చంద్రబాబు దగ్గర కూడా అపాయింట్‌మెంట్‌కు కష్టపడలేదు. ఆయన కూడా చెప్పినదంతా విని స్పందిస్తారు. కానీ మా సీఎం జగన్ మాత్రం ఇప్పటి వరకూ మాకు ఒక్కసారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. జగన్ గారిని ఒక్కసారి చూపించమని మాజీమంత్రి, దళిత నేత డొక్కా లాంటివారు ప్రాధేయపడుతున్నారంటే పార్టీలో ఎంత అవమానకర పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు’’ అని కాంగ్రెస్,టీడీపీలో పనిచేసిన ఓ వైసీపీ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలో తాము ఒక రకంగా బానిసలుగా.. అవమానకర పరిస్థిల మధ్య కొనసాగుతున్నామన్న వ్యాఖ్యలు, చాలామంది నుంచి వినిపించడం విశేషం. ‘మొన్నటివరకూ అంటే ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు టీడీపీ గాలి తోలుతోంది. పవన్ కూడా వాళ్లతోనే ఉన్నాడు. కొత్తగా మా పెద్దాయన బిడ్డ షర్మిల కూడా కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చింది. కాబట్టి ఇప్పుడు మాకు ప్రత్యామ్నాయ భయమేమీ లేదు. కాబట్టే జగన్‌ను గానీ, సీఎంఓను గానీ, సమన్వయకర్తలను గానీ లెక్కచేయడం లేద’ని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత అసలు గుట్టు విప్పారు.

Leave a Reply