యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ యువనేత- జానారెడ్డి తనయుడైన పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్‌రెడ్డి పరామర్శించారు. ఇటీవలే రోబోటిక్ టెక్నాలజీ ద్వారా సర్జరీ చేయించుకున్న కోమటిరెడ్డిని వారిద్దరూ యోగక్షేమాలు అడిగారు. ఆయన త్వరగా కోలుకుని, తిరిగి ప్రజాజీవితంలో బిజీ కావాలని ఆకాంక్షించారు. కోమటిరెడ్డి ఆరోగ్య స్థితిగతులను వారిద్దరూ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ మా జిల్లాకు చెందిన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి ప్రజాసేవలో బిజీగా ఉండాలని, మా జిల్లా వాసులంతా కోరుకుంటున్నారు. ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పడం సంతోషం. మాలాంటి యవనేతలకు ఆయన ఆదర్శం’ అని రఘువీర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.