Home » బాబు, పవన్ సమావేశం.. కొత్త చరిత్ర కు శ్రీకారం!

బాబు, పవన్ సమావేశం.. కొత్త చరిత్ర కు శ్రీకారం!

గత మూడున్నర, నాలుగేళ్లగా ఒక ఒరవడి లో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో … మొన్న ఆదివారం ఓ ముఖ్య పరిణామం చోటు చేసుకున్నది. ప్రతిపక్ష నేతలు ఇద్దరు కలుసుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో తాము ఎక్కడ ఉన్నామో చర్చించుకున్నారు. ఇదేమీ భూమి బద్దలయ్యేంత విశేషం కాదు. రెండూ ప్రతిపక్ష పార్టీలే అయినప్పుడు, కలిసి మాట్టాడుకోవడంలో వింత… విడ్డురం ఏముంటుంది. అయితే, రొటీన్ రాజకీయ పరిణామం లాటి సమావేశం పై అధికార వైసీపీ అతిగా స్పందించిందా అనే సందేహం పలువురు పరిశీలకులకు కలుగుతోంది. సమావేశం వార్త కంటే కూడా, వైసీపీ మంత్రుల స్పందనల వార్తలే రాష్ట్ర వ్యాప్తంగా పెను రాజకీయ సంచలనంగా మారిపోయాయి.

గత ఎన్నికల్లో… అత్యంత ప్రతికూల రాజకీయ పరిస్థితుల మధ్య.. దాదాపు 40 శాతం ఓట్లు సాధించిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆరు శాతం పైబడి ఓట్లు తెచ్చుకోగలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న ఆదివారం ఒక స్పెసిఫిక్ ఎజెండా తో కలుసుకున్నారు. మూడు గంటలపాటు పరస్పరం చర్చించుకున్నారు. ఎప్పుడో చేయవలసిన పని ఇప్పటి కైనా చేశారని రెండు పార్టీల నేతలూ అంటున్నారు . నిజానికి ఎన్నికలు ఇప్పుడు ఏమీ లేవని, షెడ్యూల్ ప్రకారం 2024 లోనే జరుగుతాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు కూడా . అయినప్పటికీ , వాళ్ళు కలుసుకున్నారు . ఎన్నికలలో అధికార పక్షము- ప్రధాన ప్రతి పక్షమూ అనేవి సీట్లు సర్దుబాటు చేసుకోలేవు కదా! అధికార పక్షానికి ఎదురొడ్డి రాజకీయ పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీలే ఆ పని చేయాలి. ఇప్పుడు టీడీపీ, జనసేన అదే చేశాయి. ఇందులో వింత గానీ, బుగ్గలు నొక్కుకునేంత రాజకీయ విశేషం గానీ ఏమీ లేవు. 2014 లో జనసేన – అసలు పోటీయే చేయలేదు. టీడీపీ ని గెలిపించమని మాత్రం పవన్ కళ్యాణ్ 2019 లో టీడీపీ తో కలిసి పోటీచేయలేదు. ఇప్పుడు, ఈసారి ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పోటీ చేయాలనే వ్యూహం లో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తో ముఖాముఖీ మూడు గంటల పాటు సమావేశమయ్యారు. ఇదే కొత్త చరిత్ర కు శ్రీకారం.

గత 2019 ఎన్నికల్లో వీరు ఇరువురూ విడివిడిగా పోటీ చేశారు. వైసీపీ కి 151 సీట్లు రావడానికి…. వీరిరువురూ విడివిడిగా గా పోటీ చేయడం కూడా ఒక ముఖ్య కారణం అనడం లో సందేహం లేదు. కనీసం 45 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు అయిదు వేల ఓట్ల లోపు తేడాతో ఓడి పోయారు. అంటే… వైసీపీ భారీ విజయానికి పవన్ కళ్యాణ్ కూడా పరోక్షంగా సహకరించారు. ఆ విషయం, ఆయనకు – ఎన్నికలు అయ్యాక తెలిసి ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన విడిగా పోటీ చేయాలి అని వైసీపీ నాయకులు ఆశించారు. అందుకే, దమ్ముంటే 175 స్థానాల్లోనూ పోటీ చేయాలి అంటూ వైసీపీ నేతలు మూకుమ్మడి గా మాటలతో ఆయన పై దాడి చేశారు. గిల్లారు. గిచ్చారు.రక్కారు. రచ్చ రచ్చ చేశారు. చంద్రబాబు తో ఆయనకు రకరకాల ‘అక్రమ’ సంబంధాలు అంటగట్టారు. వైసీపీ లోని కాపు మంత్రులు, తమ తమ మంత్రిత్వ శాఖల పై కంటే… పవన్ కళ్యాణ్ కు ‘రాజకీయ రంకు’ అంట గట్టడం పైనే ఎక్కువ దృష్టి పెట్టారా అనిపించే విధంగా చెలరేగిపోయారు.

అయితే, 2019 లో విడిగా పోటీ చేయడం వల్ల ; పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా… చెప్పలేనంత మంచి జరిగింది. ఆయనలో రాజకీయ పరిణతి బాగా పెరిగింది. రాజకీయాలు, వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా ఉంటాయో తెలిసి వచ్చింది. ఆవేశం కూడా బాగా తగ్గింది. వాస్తవిక దృక్పధానికి ఆయనలో చోటు లభించింది. 2019 లో దొర్లిన రాజకీయ తప్పిదం…. ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదనే ధృడ నిశ్చయానికి ఆయన రావడానికి 2019 అనుభవం తోడ్పడింది. రాజకీయాల్లో ‘ప్రాక్టికల్’ గా ఆలోచించ గలిగిన స్థిర చిత్తం, స్థిత ప్రజ్ఞత అలవడ్డాయి. అందుకే, మొన్న ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. ఇద్దరూ సుమారు మూడు గంటల సేపు.. మనసు విప్పి మాట్లాడుకున్నట్టు….. అనంతరం జరిగిన మీడియా సమావేశం సందర్భంగా వారి మొహాల్లో వ్యక్తమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను బట్టి చెప్పవచ్చు.

మీడియా సమావేశంలో తొట్రుపాటు లేదు. కంగారు లేదు. సీట్ల పంపక మాటలు లేవు. చాలా తాపీగా… కూల్ గా,కులాసాగా మాట్లాడారు. పొత్తుకు ఇంకా చాలా సమయం ఉంది అన్నారు. ఈ పరిణామం వైసీపీ కి సహజం గానే ‘ ఆందోళన’ కలిగించి ఉండాలి. లేకపోతే అంతమంది మంత్రులు పవన్ కళ్యాణ్ పై అంతేసి నోరు పారేసుకుని ఉండే వారు కాదు కదా! గత అసెంబ్లీ ఎన్నికల్లో… పోటీ చేసిన రెండు నియోజక వర్గాలలోనూ ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ను పట్టించుకోవలసిన అవసరం వైసీపీ కి నిజానికి లేదు. “ఆయన రాజకీయం ఏదో ఆయన చేసుకుంటాడు… మన రాజకీయం మనం చేసుకుందాం….” అని అనుకోవలసిన వైసీపీ నేతలు…. పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడుతున్నారు.

ఈ కలయిక పై, వైసీపీ మంత్రుల రియాక్షన్ తో, అనుకున్నంత బలంగా వైసీపీ లేదా అనే సంశయం జనం లోకి వెళ్ళిపోయిందని పరిశీలకులు అంటున్నారు. తమ బలం మీద కాకుండా… ప్రత్యర్థుల బలహీనతల మీద ఆధారపడి అధికారం లోకి రావాలనే వ్యూహం లో వైసీపీ ఉన్నదనే వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి.చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కలయిక వల్ల వైసీపీ కి కలిగే నష్టం కంటే….; వైసీపీ మంత్రుల ‘panic reaction ‘ వల్ల ఏర్పడే ‘పబ్లిక్ పెర్సెప్షన్’ – వైసీపీ కి ఎక్కువ నష్టం కలిగిస్తుందని అంటున్నారు. మొత్తం మీద ఆంధ్ర రాజకీయాలలో ఒక రకమైన అనిశ్చిత స్థితి దాదాపుగా ముగిసింది.
ప్రతిపక్షం లో ఈ రెండే పెద్ద పార్టీలు. 40 శాతం ఓట్లు తెచ్చుకున్న తెలుగు దేశం, 6 శాతం ఓట్లు తెచ్చుకున్న జనసేన.

గతం లో ఎన్నడూ లేని స్థాయిలో డబ్బు, మతం, కులం, ప్రాంతం, ప్రలోభాలు మొదలైన అంశాలు రాజ్యం ఏలిన గత ఎన్నికల్లోనే ఈ రెండు పార్టీలకు కలిపి 46 శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీ కు దగ్గర దగ్గర 50 శాతం ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థులు ఎవరు…. ఏమిటి అనే అంశాలతో సంబంధం లేకుండా ; ఈ సారి కూడా వైసీపీ 50 శాతం ఓట్లు సాధించగలదా అనే చర్చ జనం లో మొదలైంది. ఇక, రాష్ట్రం లో బీజేపీ పరిస్థితి ఏమిటన్నది తెలియడం లేదు. టీడీపీ అధినేత ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారనే సమాచారం బీజేపీ నేతలకు ఉన్నదో… లేదో తెలియదు. పవన్ కళ్యాణ్ కు – బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు కు మధ్య చెప్పలేనంత గ్యాప్ ఉంది. మీడియా ద్వారా మాట్టాడుకోవడమే తప్ప, ఎదురు బొదురుగా కూర్చుని మాట్టాడుకున్నది లేదు. ఫోన్ లో సైతం మాటలు ఉన్నట్టు లేవు. క్షేత్ర స్థాయిలో సైతం జనసేన శ్రేణులు…. బీజేపీ కి గడ్డి పరకంత విలువ ఇవ్వడం లేదు. అయినా ; తాము మిత్రపక్షాలమని ఇద్దరూ ‘రికార్డ్ ‘ కోసం మీడియా ముందు చెబుతూ ఉండడం వల్ల ; బీజేపీ కి బాబు – పవన్ సమావేశపు ముందస్తు సమాచారం ఉన్నదో… లేదో తెలియదు. ముందస్తు సమాచారం ఉన్నా న్యూసే. లేకపోయినా న్యూసే. ఇంత త్వరగా పవన్ కళ్యాణ్ ఈ స్టెప్ తీసుకుంటారని బీజేపీ నేతలు ఊహించి ఉండక పోవచ్చుననే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి, రాజకీయ వర్గాలలో.

పవన్ కళ్యాణ్ ను ‘జూనియర్ పార్టనర్ ‘ గా బీజేపీ ఆంధ్ర నేతలు పరిగణిస్తూ రావడమే ఇందుకు కారణం. ఇప్పుడు, టీడీపీ – జనసేన కంబైన్ తో చేతులు కలపాలా వద్దా అనేది బీజేపీ తేల్చుకోవలసి ఉంటుంది. చేతులు కలిపితే, కొద్దిమంది బీజేపీ నేతలకు అసెంబ్లీ మొహం చూసే అవకాశమూ లభిస్తుంది. సొంతం గా ఎన్నికల్లో పోటీ చేసి, వైసీపీ వ్యతిరేక ఓటు లో ఒక శాతం చీల్చినా చీల్చ వచ్చు. లేదా – నేరుగా వైసీపీ తో పొత్తుపెట్టుకుని అసెంబ్లీ లోకి అడుగు పెట్టవచ్చు. వరుస కుదిరితే, లోకసభ లోనూ కుడికాలు పెట్టవచ్చు. వైసీపీ ఏమీ అంటరాని పార్టీ కాదు కదా! లేదా – టీడీపీ కూటమికి మద్ధతు పలక వచ్చు. టీడీపీ – జనసేన కంబైన్ కు సీపీఐ, జై భీమ్ పార్టీలు కలవడం అనేది సహజ పరిణామ క్రమం. ఆ రెండు పార్టీలు వైసీపీని తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే కదా! అందువల్ల, వైసీపీ వ్యతిరేక ఓటు ను చీలనివ్వను అంటూ పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పిన మాటకు కట్టుబడి, రాజకీయాలలో ఓ పెద్ద కుదుపు తీసుకొచ్చారు.
ఇప్పుడు, వైసీపీ కోర్టులోకి బాల్ వచ్చింది.

2019 లో వైసీపీ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోవడం వల్ల, భారీ విజయం సాధించిన వైసీపీ….; ఈ సారి ఎంతటి విజయం సాధించగలదు అనేది పరిశీలకులలో ఉత్సుకత ను రేకెత్తిస్తున్నది. బహుశా, అది దృష్టిలో పెట్టుకుని కావచ్చు ; “వాళ్లిద్దరూ ” కలిసినప్పటికీ, 175 స్థానాలకు 175 స్థానాలూ గెలుచుకుంటామని మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు . ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు ఎన్నికల మూడ్ లోకి ప్రవేశించేసింది. అధికార పక్షం, ” అమ్మా… ” అంటే, ప్రజలకు బూతు మాట లాగా వినపడుతుంది. ఇది సహజం. ఈ సీజన్ లో అధికారపక్షం వెళ్లి, ప్రతిపక్షం మీద పడినా…; ప్రతిపక్షం వెళ్లి అధికార పక్షం మీద పడినా… అధికారపక్షానికే నష్టం అనే విషయం వైసీపీ మంత్రులు గ్రహించాలి. నోళ్లకు కొంత విరామం ఇచ్చి, ఏమేమి చేస్తే, వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలలో సద్భావన వ్యక్తమవుతుందో…అవి చేయాలి. ఆంధ్ర రాజకీయాలలో…. మొన్న ఆదివారం వరకు ఒక లెక్క. సోమవారం నుంచి ఇంకో లెక్క అని జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ చేతులు కలపడం ద్వారా…. వైసీపీ అధినేత వై ఎస్ జగన్ నాయకత్వ పటిమకు సవాల్ విసిరారని పరిశీలకులు అంటున్నారు. చూద్దాం, ఏమి జరుగుతుందో!

(‘లాయర్’ పత్రిక సౌజన్యంతో )

భోగాది వేంకట రాయుడు
bhogadirayudu2152@gmail. com

Leave a Reply