– చంద్రబాబుకు బిల్‌గేట్స్ కితాబు
– పాలనలో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌పై ప్రశంల వర్షం
– బాబుకు రాసిన లేఖలో మెచ్చుకున్న బిల్‌గేట్స్
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవను అభినందిస్తూ గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ లేఖ రాశారు. ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య ఇటీవల జరిగిన ఒప్పందం, సమావేశాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుపై బిల్‌గేట్స్ ప్రశంసలు కురిపించారు.
చంద్రబాబు తన బృందంతో ఢిల్లీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని బిల్ గేట్స్ అన్నారు. మంచి వాతావరణంలో సంప్రదింపులు జరపడం సంతోషంగా ఉందన్నారు. పేదలు-అట్టడుగు వర్గాల విద్య, ఆరోగ్యం సహా వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిపైనా గేట్స్ ఫౌండేషన్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆరోగ్య రంగాన్ని పటిష్ట పరచడం, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ అసిస్టెడ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్, మెడ్‌టెక్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడం, వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాల తయారీ, సాయిల్ హెల్త్ మోనిటరింగ్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి మైక్రోన్యూట్రీయంట్లు అందించే అంశాలపై ఇరువురం చర్చించామని బిల్‌గేట్స్ గుర్తు చేశారు.
‘పాలనలో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను బలోపేతం చేసేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు మీరు చూపిన ఆసక్తి, చిత్తశుద్ధి మీ విజన్‌కు నిదర్శనం. మీరు ఆశించే ఏఐ డ్రివెన్ డిసిషన్ మేకింగ్, రియల్ టైమ్ డేటా సిస్టమ్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ వంటివి మీ నాయకత్వ ప్రతిభను ప్రస్ఫుటం చేస్తున్నాయి. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో… ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు మీరు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్‌కే కాదు భారత్‌తో సహా, అల్పాదాయ దేశాలకు ఉపయోగపడుతుంది.
ఈసారి నా భారతదేశ పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే నాటికి… మీ నాయకత్వం- మన భాగస్వామ్యంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో అద్భుతమైన పురోగతి సాధించగలమని చెప్పగలను. గేట్స్ ఫౌండేషన్ -ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యం మున్ముందు కొనసాగాలని, కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర భవిష్యత్‌పై సానుకూల ప్రభావాన్ని చూపాలని ఆశిస్తున్నాను’ అని లేఖలో బిల్‌గేట్స్ ప్రస్తావించారు.