సంక్రాంతి పందేలను బాబు కేసినోలుగా దుష్ప్రచారం చేస్తున్నాడు

– హైదరాబాద్ లో నైట్ లైఫ్ కల్చర్ ను తెచ్చింది తానేనని బాబు అసెంబ్లీలో చెప్పలేదా..?
– లేని కేసినో కల్చర్ ను రాష్ట్రానికి అంటగట్టాలన్నదే బాబు కుట్ర
– తన స్వార్థ రాజకీయం కోసం తిమ్మిని బమ్మిని చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
– ఉద్యోగ సంఘాల తోకలు కత్తిరిస్తానని ఆరోజు మాట్లాడిన బాబు.. ఈరోజు మొసలి కన్నీరు కారుస్తున్నాడు
– సీఎంను అగౌరవపరిచే మాటలు మాట్లాడటం ఉద్యోగ సంఘాలకు సరైన పద్ధతి కాదు
– ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్

గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
దుర్మార్గాలు చేయడంలో బాబు సిద్ధహస్తుడు
రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, దేశంలోనే తాను సీనియర్‌ రాజకీయ నాయకుడు అని చెబుతుంటారు కానీ, ఆ సీనియార్టీతో దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయాలని ఏరోజూ ఆలోచన చేయరు. తనకు ఉన్నటువంటి వక్రబుద్ధితో అనునిత్యం తాను అనుకున్నది సాధించుకోవడానికి, ఎలాగైనా ఇతరులపై బురద చల్లడానికి, ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరచడంలో ఆయన సిద్ధహస్తుడు. తన రాజకీయ ఎదుగుదల, పదవీ కాంక్ష కోసం సొంత మామ అయిన ఎన్టీఆర్‌లాంటి మహానాయకుడినే చంద్రబాబు వంచించాడు. ఎన్టీఆర్‌ చాలా ఇంటర్వ్యూలలో చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని చూడలేదంటూ చనిపోయేవరకూ చెబుతూ ఉండేవారు.

ఎన్టీఆర్‌గారిని గద్దె దించాలనే లక్ష్యంతో దుష్ట రాజకీయం మొదలుపెట్టి, అందుకు లక్ష్మీపార్వతిగారిని పావుగా వాడుకుని, ఆమెపై ప్రతిరోజు వ్యతిరేకంగా తన మీడియాలో వార్తలు వచ్చేలా చేసి, ఆ తర్వాత రామారావుగారి పదవికి ఎసరుపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలానే, రాష్ట్రంలో ఏం జరిగినా కడప జిల్లా ప్రజలు వైఎస్‌ కుటుంబానికి అండగా ఉంటారనే ఉద్దేశంతో, ఈ జిల్లా ప్రజలను కించపరిచే విధంగా కడప రౌడీలు, గుండాలు అని మాట్లాడటం చంద్రాబాబుకు అలవాటుగా మారింది. పులివెందులలో తన పార్టీ లేదనే ద్వేషంలో “పులివెందుల పంచాయితీ” అంటూ మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు.

ఇదే కడప జిల్లాలో, పులివెందులలో వేలల్లో అయినా తన పార్టీ సానుభూతిపరులు ఉన్నారనే విషయం కూడా ఆయన మర్చిపోతాడు. అందర్నీ ఒకే గాటిన కట్టేసి కడప జిల్లా ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడతాడు. తనకు నచ్చితే ఓ రకంగా… నచ్చకపోతే మరో రకంగా వ్యవహరిస్తాడు. ఇలాంటి వ్యక్తిత్వంలో చంద్రబాబు సిద్ధహస్తుడు.

చంద్రబాబు ఏదైనా కుట్ర పన్ని, దాన్ని ఎస్టాబ్లిష్‌ చేయాలనుకుంటే దానికి అనుగుణంగా బిల్డప్‌ చేసుకుంటా వస్తారు. ఒక సామెత కూడా ఉంది. ఒక మంచి కుక్కపై పిచ్చికుక్క అని ముద్ర వేయాలంటే… పిచ్చి కుక్క… పిచ్చి కుక్క అని గోబెల్స్ ప్రచారం చేయించి, చివరికి దాన్ని చంపించేలా ఏవిధంగా చేస్తారో అలాంటి ఆలోచన, మనస్తత్వం ఉన్నవ్యక్తి చంద్రబాబు.

లేని కేసినో కల్చర్ ను రాష్ట్రానికి అంటగట్టాలన్నదే బాబు కుట్ర
సంక్రాంతి పండుగ పూర్తై పదిరోజులు దాటిపోయినా.. రాష్ట్రంలోని మిగతా విషయాలను పక్కనపెట్టేసి… కేవలం ఒక ఇష్యూనే పట్టుకుని జూదం, కేసినో అని రోజూ రాద్ధాంతం చేయిస్తున్నాడు. చంద్రబాబు లా జూదంను, క్లబ్ లను జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఎంకరేజ్‌ చేయాలని కనీసం ఆలోచన కూడా చేయరు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లబ్సులను మూయించిన వ్యక్తి . నెంబర్‌ వన్‌ పోలీసింగ్‌ ఉండాలనే ఆలోచనతో ఎక్కడా, ఎవరినీ వదలొద్దు అంటూ.. వాటిని అన్నింటినీ మూయించి వేసింది సీఎం. రాష్ట్ర ప్రభుత్వం కేసినోలను జరిపిస్తోందంటూ పదేపదే బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఆ పేరును ప్రభుత్వానికి అంటగట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.

తన కన్వెన్షన్‌లో ఎలాంటి కేసినో జరగలేదని, జరిగిందని నిరూపణ చేస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని మంత్రి కొడాలి నాని ఛాలెంజ్‌ చేశారు. దాన్ని పక్కనపెట్టేసి ప్రతిరోజూ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ, గుడివాడకు వెళ్లి అల్లర్లు సృష్టించి, పదేపదే మాట్లాడటం ఎంతవరకూ శ్రేయస్కరం.

నైట్ లైఫ్ కల్చర్ తెచ్చింది తానే అని అసెంబ్లీ సాక్షిగా బాబు చెప్పాడు
ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు చూస్తే ఎవరిది ఎటువంటి మనస్తత్వమో అందరికీ అర్థం అవుతుంది. ‘నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ పరిచయం చేశాను. అంతకు ముందు నైల్‌లైఫ్‌ లేదు, దీనికోసం ఫ్లైట్‌ లు ఎక్కి ముంబయికి వెళ్లేవారు’ అని చంద్రబాబు మాట్లాడారు. ఇందుకు సంబంధించి వీడియోలు కూడా ఉన్నాయి.

నైట్‌ లైఫ్‌ అంటే ఏంటి? డిస్కోలు, బార్‌లు, పబ్‌లు, క్యాబరే డ్యాన్సులే కదా..? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా.. ‘తానే నైట్‌ లైఫ్‌ పెట్టానని, అవి ఉంటేనే పరిశ్రమలు వస్తాయని’ మాట్లాడి, ఈరోజు కేసినోలని, జూదాలను ఈ ప్రభుత్వంపై నిందలు వేయడానికి సిగ్గు ఎక్కడ లేదు చంద్రబాబూ…?

సంక్రాంతి కోడి పందేలను అడ్డుకుంటే బాబు మరో క్యాసెట్ వేసేవాడు
మన సంస్కృతి, సంప్రదాయంలో భాగంగా సంక్రాంతి పండుగకు మూడు రోజులపాటు, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కోడి పందేలు జరపడం ఆనవాయితీగా వస్తున్నటువంటిది. మీ హయాంలో కూడా ఇంతకంటే ఎక్కువగానే జరిగాయి, తక్కువ కాదు. వాటిని పట్టుకుని చంద్రబాబు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నాడు. సినిమాల్లో చూపించినట్టు…. సంక్రాంతి సంబరాలకు ప్రభుత్వం అనుమతిస్తే ఒక స్టేట్ మెంటు.. ఇవ్వకపోతే మరో స్టేట్ మెంట్ రెడీ చేసుకున్నాడు.

– జగన్‌ మోహన్‌ రెడ్డిగారు కోడి పందేలు జరగకుండా గట్టి చర్యలు చేపడితే.. బాబు ఇంకో క్యాసెట్‌ వేసి ఉండేవారు. ‘సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు, ప్రజలు పండుగకు కొంత ఆనందం కోరుకుంటుంటే దానికి కూడా ముఖ్యమంత్రి అడ్డుకట్ట వేస్తున్నారు, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం’ అంటూ ఇదే చంద్రబాబు తన మీడియాలో క్యాసెట్‌ ప్లే చేస్తారు.

రొటీన్‌గా ప్రక్రియ జరిగితే.. మళ్లీ ఇదే చంద్రబాబు ‘రాష్ట్రం జూదశాలగా మారిందంటూ’ ఇంకో క్యాసెట్‌ వేస్తారు. తన స్వార్థ రాజకీయాల కోసం అటు అయితే అటు, ఇటు అయితే ఇటు మాట్లాడ గలిగే వ్యక్తి చంద్రబాబు. టీడీపీ హయాంలో బెల్ట్‌ షాపులు పెట్టి ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తే, అలాంటి బెల్ట్‌ షాపులను మూయించిన ఘనత కూడా జగన్‌ మోహన్‌ రెడ్డిదే అన్నది మరిచిపోవద్దు. అంతకు ముందు ఎన్టీ రామారావు మద్యపాన నిషేదం అమలు చేస్తే దాన్ని ఎత్తేయించింది చంద్రబాబే. అలాంటి మీరు ఇవాళ నీతులు మాట్లాడటమా?

సంప్రదాయబద్ధంగా వచ్చే కోడిపందేలు, ఎద్దుల పందేలు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకోవడం ఆనవాయితీ. గుడివాడలో ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మంత్రి కొడాలి నాని ఆరోగ్యం బాగోలేక తాను గుడివాడలో లేనని ఆయన వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అయితే టీడీపీ వాళ్లు ఒకరోజు కే కన్వేషన్‌లో కేసినో జరిగిందని చెబుతారు, మళ్లీ రోడ్డు పక్కన జరిగిందని, ఆ తర్వాత గుడివాడ పట్టణంలో జరిగిందని మాట్లాడారు. ఏదైనా చిన్న విషయం జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపడం చంద్రబాబుకు అలవాటే. తన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి తన గురించి మాట్లాడుతున్నాడని, అతడిని వైయస్సార్‌ సీపీలో చులకన చేయాలన్నదే బాబు ప్రయత్నం.

ఏదైనా చేయాలంటే చంద్రబాబు నెల రోజులు ముందునుంచే ఆయన తన వందిమాగధులతో ప్లాన్‌ చేస్తారు. నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు పదేపదే చెప్పి, నిజాన్ని అబద్దం, అబద్ధాన్ని నిజం చేయగల సిద్ధహస్తుడు చంద్రబాబు. బాధ్యతగల ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో సమస్యలు గురించి ప్రభుత్వంతో కలిసి కేంద్రంతో పోరాడవచ్చు. అలా కాకుండా కేసినోలు అంటూ రాద్ధాంతం చేయడం ఎంతవరకూ సమంజసం.?

ఉద్యోగుల తోకలు కత్తిరిస్తారని నాడు బాబు అనలేదా…?
రాష్ట్రంలో అలజడులు సృష్టించడమే ధ్యేయంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులు మీ హయాంలో సమ్మె గురించి మాట్లాడితే.. ‘ఈ సంఘాలు అంతు తేల్చుతానని, తోకలు కత్తిరిస్తాను’ అంటూ మాట్లాడారు. ఇవాళ మాత్రం ఉద్యోగ సంఘాలు ఏకతాటిపై రండి, ప్రభుత్వాన్ని ఏదోరకంగా అస్థిరపరుద్దామని పిలుపునిస్తున్నాడు. ఇటువంటి రాజకీయాలు భావ్యమా అని అడుగుతున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులతో స్నేహపూరితంగానే వ్యవహరిస్తోంది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పీఆర్సీని ప్రకటించారు. అదే కరోనా లేని సమయంలో ఉద్యోగస్తులు అడగకుండానే ఉద్యోగుస్తులు కూడా ఈ ప్రభుత్వంలో భాగమే అని చెబుతూ, వారికి 27శాతం ఐఆర్‌ ప్రకటించి, రూ.18వేల కోట్లు భారం పడినా ఒక్క అడుగు వెనక్కి వేయని వ్యక్తి జగన్‌ మోహన్‌ రెడ్డి
ఐఆర్‌ అంత ఇచ్చారు కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయిదు డీఏలు ఇస్తే ఉద్యోగస్తులకు వెసులుబాటుగా ఉంటుందని కొత్త పీఆర్సీ ప్రకారం, పదివేల కోట్లు భారం పడుతున్నా అంగీకరించారు. మళ్ళీ వీళ్ళే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్నారు. ఏమీ చేయకపోతే, మరి ఇచ్చే రూ. 10వేల కోట్లు ఎక్కడకి పోతున్నాయి?.

తన స్వార్థం కోసం ఎవరినైనా బాబు బలి చేస్తాడు
ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఏరోజూ రాష్ట్ర శ్రేయస్సును కోరుకోరు. తన స్వార్థం కోసం ఎవరినైనా బలి చేయాలనుకునే వ్యక్తి. తనకు ఒక్కశాతం లబ్ధి చేకూరుతుందన్నా.. తన పబ్బం గడుపుకోవడానికి, పార్టీ ఇమేజ్‌ పెంచుకునేందుకు ఏమైనా చేస్తాడు. మా ప్రభుత్వం వచ్చాక ఏరోజు కూడా అధికారులను వాడుకోలేదు. ఎంతసేపు ప్రజలకు దగ్గరగా ఉండాలని, వారికి మేలు చేయాలనే ఆలోచనే చేశారు.

చంద్రబాబు ఎంతసేపు తన అజెండా కాకుండా, రాష్ట్ర భవిష్యత్‌ అజెండా, ప్రజల అజెండా గురించి కూడా ఆలోచన చేయాలి. తనకు సరిపోకపోతే తనవాళ్లతో ఎంతటి మాటలు అయినా మాట్లాడించడం చంద్రబాబు నైజం. బుద్ధా వెంకన్న మాటలు చూస్తే ముఖ్యమంత్రిగారి రక్తం చూస్తానని మాట్లాడటం సరైన పద్థతేనా? మంత్రిని చంపేస్తానని మాట్లాడతారా…? కుల మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే అంబటి రాంబాబును చంపేస్తే రూ.50 లక్షలు ఇస్తామని మాట్లాడతారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇలా బహిరంగంగా మాట్లాడటం తప్పు కాదా? మనుషులను చంపేస్తామని అనారోగ్యంగా మాట్లాడే మీరు అరాచకవాదులు కాదా? “మానవ బాంబు పెట్టి ముఖ్యమంత్రిని చంపేస్తామని ఒకరు, రూ.50 లక్షలు ఇచ్చి మనుషులను చంపుతామని ఒకాయన, బహిరంగంగానే మనుషులను నాశనం చేస్తామని మరొకరు..” మాట్లాడేవాళ్ళంతా బాబు వర్గీయులే ఉన్నారంటే వారి గురించి మాట్లాడరే, రాయరే? ఏదైనా చిన్న విషయం జరిగితే, మా పార్టీలో చిన్న వాళ్లు మాట్లాడితే దాన్ని వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం మొత్తానికి అంటగడుతూ పార్టీని అల్లరి చేయడానికి కంకణం కట్టుకుంటారే? మరి మీరు చేసిన తప్పులు ఎందుకు బహిరంగంగా మాట్లాడరు? ఒక బాధ్యత గల వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడవచ్చునా? మీ పార్టీవాళ్లు మాట్లాడిన మాటలు తప్పు అని ఎన్నడైనా ఖండించారా?

మా పార్టీలో ఎవరైనా తప్పు మాట్లాడితే దాన్ని తప్పు అని ఖండించేలా మాట్లాడే స్వేచ్ఛ మా నాయకుడు మాకిచ్చారు. సరిదిద్దుకుని మాట్లాడతాం. మీకు నాలుగు మీడియాలు ఉన్నాయని ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే ప్రయత్నం మానుకోవాలి. రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరిగే విధంగా మంచి పనులకు సహాకరించేలా ప్రతిపక్షాల మంచి బుద్ధి మార్చాలని కోరుకుంటున్నారు.

మతతత్వాన్ని రెచ్చగొట్టాలన్నదే బీజేపీ ఆలోచన
మరొకపక్క బీజేపీ… ప్రజలలో పలుకుబడి పెంచుకోవాలనే ఆలోచన ఉండదు కానీ, ఏదోరకంగా మతతత్వాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ఆలోచనలే చేస్తోంది. కేంద్రమంత్రిగా ఉన్న వ్యక్తి జైలుకి వచ్చి పరామర్శించడం తప్పు అనడటం లేదు. కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతేనా అని అడుగుతున్నాం. ఏ ప్రభుత్వానికి అయినా, ఒక వర్గం ఒకటి, మరో వర్గం ఒకటి అనే ఆలోచన ఉంటుందా? ప్రజలను కన్నబిడ్డలుగా చూడటమే ప్రభుత్వ బాధ్యత. మా ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తోంది. మీ ఇమేజ్‌ కోసం ఒక వర్గాన్ని రెచ్చగొట్టి వేరు చేయాలని, శాంతిభద్రతల సమస్యలను సృష్టించాలనుకోవడం మంచి పద్ధతి కాదు. మా ప్రభుత్వం ఏవర్గానికి వ్యతిరేకం కాదు.

ప్రభుత్వం చిత్తశుద్ధి ఏవిధంగా ఉందంటే… సంక్షేమ పథకాలు అన్ని శాచురేషన్‌ పద్ధతిలో ఇవ్వాలని కుల, మత, పార్టీ, జెండాలు చూడొద్దని మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పిన నాయకుడు ఆయన. మరి సంక్షేమ కార్యక్రమాలు అమలులో భాగంగా ఇప్పటికే లక్షా 20 వేల కోట్లకు పైగా డీబీటీ ద్వారా లబ్దిదారులకు నేరుగా అందుతున్నాయి. మరి ఎక్కడన్నా వివక్ష చూపిస్తుందా ఈ ప్రభుత్వం? ప్రజలందరినీ సమానంగా చూస్తోన్నది మా ప్రభుత్వం.

మీ పబ్బం గడుపుకోవడానికి ఉద్యోగులతో చిచ్చు పెట్టాలని, ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని మరికొందరు, ప్రభుత్వంపై బురదచల్లి ప్రజా వ్యతిరేకత రావాలనేలా మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌తో ఆలోచన చేస్తున్న ప్రతిపక్ష పార్టీ ఓవైపు ఉంటే… మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన హామీ విస్మరించిన బీజేపీ కులతత్వాన్ని ఎలా రెచ్చగొట్టాలి, తద్వారా తాము ఎలా లబ్ధి పొందాలని చూస్తోంది. ఇది ఎంతవరకూ సమంజసం…?

జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పాలసీ పరంగా కానీ, సంక్షేమ పరంగా కానీ ఏదైనా తప్పు చేస్తే నిరూపించాలని ఛాలెంజ్‌ విరుసుతున్నాం. ప్రజా శ్రేయస్సు కోసం అనునిత్యం తపన పడుతూ, కరోనా సమయంలో కూడా రూ.40వేల కోట్లు నష్టం వచ్చినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రజలకు ఇచ్చి మాట ప్రకారం సమయానికి అన్ని చేసుకుంటూ వస్తున్నందునే మీ అందరికీ ఈర్ష్యా, ద్వేషం.

రాష్ట్ర పరిస్థితులను ఉద్యోగస్తులు అర్థం చేసుకోవాలి
రాష్ట్ర పరిస్థితులను ఉద్యోగస్తులు కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఎన్ని కష్టాలలో ఉన్నాకూడా ఉద్యోగుల సంక్షేమం కోసం ఆలోచిస్తోంది. హెచ్‌ఆర్‌ఏ జనాభా ప్రాతిపదికగా వస్తోంది. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. కేంద్ర విధానాలనే అమలు చేస్తోంది. దానివల్ల ఉద్యోగస్తులకు కొంత నష్టం జరుగుతుందని అనేకమంది ఎగ్జాంపుల్స్‌ ఇచ్చారు. దానిపై ప్రభుత్వం కూడా స్పందించింది. చర్చలకు రావాలంటూ డోర్స్‌ ఓపెన్‌ చేశారు. చర్చలకు వెళితే ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కుట్రతో ఉద్యోగ సంఘాలలో ఎంటరైన కొంతమంది, ఉద్యోగ సంఘాల నాయకుల్ని ప్రభావితం చేసేవిధంగా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేవిధంగా ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ల ట్రాప్‌లో దయచేసి ఉద్యోగులు పడవద్దు.
లక్షా 30వేలు ఉద్యోగాలు ఒకే ఏడాది ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్స్‌, మున్సిపాలిటీ వర్కర్స్‌కు ఒకేసారి జీతం ఎంత పెంచారో అందరికీ తెలిసిన విషయమే. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ప్రకారం స్కేల్‌ను ఇవ్వాలని నిర్ణయించడం గొప్పవిషయం. దానికోసం దాదాపు రూ.450 కోట్లు భారం పడుతున్నా, దాన్ని కూడా అంగీకరించారు.

సీఎంను అగౌరవపరిచే మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు
హెచ్‌ఆర్‌ఏ విషయాన్ని రాద్ధాంతం చేస్తూ.. ముఖ్యమంత్రిని అగౌరపరిచే విధంగా మీడియాలో మాట్లాడటం సరైన పద్థతి కాదు. కొన్ని టీవీల్లో చూపిస్తున్నారని ఇష్టానుసారం మాట్లాటం శ్రేయస్కరం కాదు. ఇది ప్రభుత్వ వ్యవస్థ. ఈ ప్రభుత్వం మీది, మనది. మనందరిదీ. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. టీచర్స్‌ అంటే ముఖ్యమంత్రి ఎంతో గౌరవిస్తారు. వారు కూడా సినిమా పాటలు పాడుతూ కించపరచడం సరైన పద్థతేనా? స్కూల్‌ టీచర్‌గా ఉన్న మిమ్మల్ని విద్యార్థి కించపరిచే విధంగా మాట్లాడితే మీకెంత అవమానకరంగా ఉంటుందో ఊహించండి.

రాష్ట్రానికి హెడ్‌ అయిన ముఖ్యమంత్రిని అలా మాట్లాడవచ్చా అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి ఎప్పుడైనా, మిమ్మల్ని కించపరిచేవిధంగానో, హేళనగానో మాట్లాడతారా? ఇన్ని కష్టాల్లో ఉన్నా… మీరు ఎన్ని విమర్శలు చేసినా.. ఎస్‌… ఉద్యోగుల వాదన మళ్లీ వినండి అంటూ ప్రభుత్వం తరఫున కమిటీ వేశారు. ప్రభుత్వంలో ఉన్న అందరమూ ఒకరిని ఒకరిని అర్థం చేసుకుని బాధ్యతగా వ్యవహరించాలి. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసుకోవచ్చని మాట్లాడకూడదు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు జీతాలు ఎందుకని అడుగుతున్నారు. మేముండేది కేవలం 25 0మంది మాత్రమే. మేము జీతాలు లేకుండా పనిచేస్తాం, ప్రజా సేవ చేస్తాం, దానికి మీరు కూడా ఒప్పుకుంటారా? ప్రజల డబ్బులు తీసుకుంటున్నప్పుడు ఎవరినీ కించపరచకుండా మన బాధ్యతను విస్మరించకుండా పని చేయాల్సి ఉంటుంది.

కుట్ర రాజకీయాలను నమ్ముకుంటే బాబుకు పుట్టగతులుండవ్
– మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి

ఇంగ్లీష్‌ మీడియం విషయానికి వస్తే ముఖ్యమంత్రి తన బిడ్డలతో పాటు ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఆంగ్లవిద్యను అమలు చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని కూడా ప్రతిపక్షాలురాద్ధాంతం చేశాయి. ప్రభుత్వాన్ని అస్థిర పరిచడానికి.. జగన్‌ విలువ తగ్గించేలా ఎప్పుడూ ఏదో కుట్రను తెరమీదకు తేవడం చంద్రబాబుకు అలవాటు అయిపోయింది. ఇక ఉద్యోగ సంఘాల గురించి గతంలో వ్యతిరేకించిన చంద్రబాబు, ఇప్పుడు అంతా ఒకటై ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని మాట్లాడటం చాలా బాధాకరం. తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఉద్యోగస్తులు కూడా ఆలోచన చేయాలి. ఉపాధ్యాయులు అంటే.. భావిభారత పౌరులను తీర్చిదిద్దేవారు. అలాంటి మీరు రాష్ట్రానికి పెద్దగా ఉన్న ముఖ్యమంత్రిని కించపరిచేలా పాటలు పాడటం దురదృష్టకరం. ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వారి న్యాయమైన కోరికలు తీర్చాలని ముఖ్యమంత్రి ఇప్పటికీ చెబుతున్నారు. ఇటువంటి రాజకీయాలు చేస్తే… చంద్రబాబు నాయుడుకు పుట్టగతులు ఉండవనే విషయం గ్రహిస్తే మంచిది. కుప్పం పరిస్థితి చూసైనా అర్థం చేసుకోవాలి. అక్కడే కాదు రానున్న రోజుల్లో రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఆయనకు ఎదురవుతుంది.

Leave a Reply