– నేను రాజకీయాల్లో ఉన్నది కేవలం జగన్ ను తిట్టడానికి కాదు
– ఫేజ్ 2 అనేది పచ్చి అబద్ధం
– 41.15 మీటర్ల ఎత్తులో పోలవరం అంటే అది ప్రాజెక్ట్ కాదు
– పోలవరం ఇక బ్యారేజ్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గా మారే ప్రమాదం
– 85 వేల కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు ఎత్తు తగ్గించారు
– దాదాపు 22 వేల కోట్ల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ దెబ్బతీసింది
– ప్రాజెక్ట్ నిర్మాణం 45.7 మీటర్ల ఎత్తులో నిర్మించండి
– అనాడు మోడీ వచ్చి మట్టి కొట్టారు
– ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారు
– ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. బీజేపీ గత 10 ఏళ్లుగా మోసం చేస్తుంది. ప్రత్యేక హోదా ఏపీ కి అతి ముఖ్యమైనది. 2014 లో ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారు. దిల్లీని మించిన రాజధాని కట్టిస్తాం అన్నారు. పోలవరం మొత్తం కేంద్రమే కడుతుందని చెప్పారు. ఇచ్చిన హామీలు ఒక్కదానికి దిక్కులేదు. హోదా తో పాటు రాష్ట్రానికి పోలవరం అంతే ముఖ్యం.
పోలవరం ఆంధ్ర జీవనాడి. రైతులకు ఊపిరి. ఇవ్వాళ్టి వరకు ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. దీనికి భాధ్యత ఎవరు? పోలవరం వైఎస్ కల. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని అనుమతులు తీసుకు వచ్చి పనులు ప్రారంభించారు. 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు… 22 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యం. వైఎస్ పనులు ప్రారంభించినప్పుడు అంచనా వ్యయం 10,151 కోట్లు. ప్రాజెక్ట్ సామర్ధ్యం 194 tmc లు. ప్రాజెక్ట్ ఎత్తు 45.7 మీటర్లు. ఇలా కడితేనే అది పోలవరం ప్రాజెక్ట్.
ఇప్పుడు పోలవరం ఎత్తు 41 మీటర్లకు కుదించారు. ఇలా కడితే అది పోలవరం కాదు. పోలవరం జీవనాడి అవ్వదు. వైఎస్ హయంలో 33 శాతం పనులు అయ్యాయి. ఆ తర్వాత ఎవరు కూడా పోలవరం పనులను పట్టించుకోలేదు. 2014 లో కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్టు గా గుర్తించింది. 2019 లో అధికారంలో వచ్చిన బాబు కేవలం 17 శాతం పనులు చేశారు. ప్రాజెక్ట్ అంచనా ను అమాంతం పెంచారు. 50 వేల కోట్లకు పెంచేశారు.
జగన్ అధికారం లో వచ్చాకా పోలవరం పనులు 3 శాతం దాటలేదు. తండ్రి ఆశయాన్ని జగన్ ముందుకు తీసుకు వెళ్ళలేదు. రివర్స్ టెండర్ల పేరుతో ప్రాజెక్ట్ ను నాశనం చేశారు. మొత్తంగా 10 ఏళ్లలో 50 శాతం పనులు దాటలేదు. ఇప్పుడు బీజేపీ పోలవరం పై గేమ్ ఆడుతుంది. చంద్రబాబు మళ్ళీ బీజేపీ తో పొత్తు పెట్టుకొని పోలవరం ప్రాజెక్ట్ కి ద్రోహం చేస్తున్నారు. చంద్రబాబు పగలు పడిన గోతిలో రాత్రి పడ్డారు. అందరు కలిసి పోలవరం ప్రాజెక్ట్ స్వరూపం మార్చేశారు.
జగన్ ,బాబు ఇద్దరు బీజేపీ కి లొంగిపోయారు. ప్రాజెక్ట్ ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 నుంచి 41 మీటర్ల కు కుదించారు. 41 మీటర్ల ఎత్తులో మాత్రమే ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 అంటూ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫేజ్ 1 ప్రకారం 41 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఇది ప్రాజెక్ట్ కాదు. 41 మీటర్ల ఎత్తులో కడితే అది బ్యారేజ్ మాత్రమే. 41 మీటర్ల ఎత్తులో ప్రయోజనాలు ఏంటి అనేది మాత్రం చెప్పడం లేదు.
ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనేది క్లారిటీ లేదు. 41 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎన్ని ఎకరాలకు ఇస్తారు…వెంటనే శ్వేత పత్రం ఇవ్వండి. బీజేపీ ఉద్దేశ్యం పోలవరం 41.15 మీటర్ల ఎత్తునే. ఫేజ్ 2 నిర్మాణం అనేది అబద్ధం. మినిమం స్టోరేజ్ ఎత్తులోనే ఇక పోలవరం ప్రాజెక్ట్. 41.15 ఎత్తులో నిర్మాణం అని కేంద్రం పోలవరం వెబ్ సైట్ లో పెడితే…ఎంపీలు నోరు మూసుకొని కూర్చున్నారు. ప్రాజెక్టు బ్యారేజ్ గా…లిఫ్ట్ ఇరిగేషన్ గా మిగిలి పోయే ప్రమాదం ఉంది. ఇది రాష్ట్రంపై బీజేపీ చేస్తున్న కుట్ర.
ఈ కుట్రలో భాగం బాబు,జగన్,పవన్. 41 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరిగితే 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందదు. 41 మీటర్ల ఎత్తులో కూడా ప్రయోజనాలు తగ్గవు అనేది కూటమి చెప్తున్నది అబద్ధం. ఫేజ్ 1 లో ఎన్ని ఎకరాలు… ఫేజ్ 2 లో ఎన్ని ఎకరాలు.. కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. చాలా తెలివిగా ప్రజలను మోసం చేస్తున్నారు. పోలవరంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి అంటే 33 వేల కోట్లు కావాలి.
దాదాపు 96 వేల కుటుంబాలకు ఇంకా రీహాబిలిటేషన్ చేయాలి. 85 వేల కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ఇవ్వకుండా ఎత్తు తగ్గించడం కుట్ర. ఆర్ అండ్ ఆర్ ఎగ్గొట్టే విధంగా ఎత్తు తగ్గించారు. 80 వేల కుటుంబాలకు ప్యాకేజీ ఎగ్గొడుతున్నారు. కేవలం 20 వేల కుటుంబాలకు మాత్రమే ఇచ్చి మోసం చేశారు. మిగతా 80 వేల కుటుంబాలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ యధావిధిగా ఉండాలి. మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. 45.7 మీటర్ల ఎత్తు కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. జగన్ చేసిన తప్పును మీరు కరెక్ట్ చేయండి. 45 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే… అంచనా వ్యయం ఎలా తగ్గింది? 55 వేల కోట్ల నుంచి 30 వేల కోట్లకు ఎలా అంచనా వ్యయం తగ్గించారు ? ఆర్ అండ్ ఆర్ ను కుదించారు కాబట్టే అంచనా వ్యయం తగ్గింది..
నేను రాజకీయాల్లో ఉన్నది కేవలం జగన్ ను తిట్టడానికి కాదు. నేను ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని అంశాలు మాట్లాడాల్సి ఉంటుంది. కానీ జగన్ మీద తిట్టడానికి కోసమే అనే విధంగా కవరేజ్ ఇవ్వడం బాధాకరం. నన్ను అఫెక్ట్ చేసే స్థాయి ఎప్పుడో జగన్ సరిపోయాడు నా పిల్లలను మోసం చేసిన వాడిగా జగన్ రెడ్డి మిగిలాడు. మోడీ వస్తే మమ్మల్ని దగ్గరకు రాణిస్తారా ? అనుమతి ఇస్తే అడుగుతాం. అనాడు వచ్చి మట్టి కొట్టాడు. ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నాడు.