Home » తండ్రీకొడుకుల ‘తప్పు’టడుగులు!

తండ్రీకొడుకుల ‘తప్పు’టడుగులు!

-వైసీపీ విజయానికి బాటలు వేసిన టీడీపీ
-బాబు-లోకేషుకి గుణపాఠం చెప్పిన పరిషత్తు ఫలితాలు
-మళ్లీ నవ్వులపాలయిన ‘పువ్వుపార్టీ’కి మనుగడ ఇక ప్రశ్నార్ధకమే
– ‘జనసేన’ ఆశలు సజీవం
– ఏపి పరిషత్తు ఫలితాలు నేర్పిన పాఠాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో వెల్లడయిన పరిషత్తు ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి ఏకపక్షం కావడం వింతేమీ కాదు. అది సంబరాలు చేసుకునేంత ‘ఊహించని’ అద్భుత ఫలితాలు కానేకావు. ప్రధాన ప్రతిపక్షమయిన టీడీపీ లాభనష్టాల కూడిక-తీసివేత సొమ్ముల గుంజాటనలో.. అస్త్రసన్యాసం చేసిన ‘ఆత్మహత్యపర్వం’లో, వైసీపీ మెరుపులకు అంత ప్రాధాన్యం లేదు. అయితే గెలుపు గెలుపే. ఏ విజయాన్నీ తక్కువ చేసి చూడకూడదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా పరారవడం టీటీడీ చేతకానితనం. ప్రధాన ప్రతిపక్ష నిర్ణయంతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు. పోటీకి దిగవద్దని వైసీపీ చెప్పలేదు. డబ్బులేక.. ఉన్నా తీయలేక.. తీసినా గెలిచిన వారంతా గోడ దూకరన్న గ్యారంటీ ఏముందన్న సందేహంతో, ‘తెలుగుదేశం తండ్రీకొడుకులే’ బరి నుంచి నిష్క్రమించారు. అది చంద్రబాబు-లోకేషు స్వయంకృతం. అన్నిచోట్లా నిలబడినందుకే వైసీపీ విజయం సాధించింది. జనం తక్కువైనప్పటికీ జనసేన, అసలు బొత్తిగా జనాలే లేని బీజేపీ కూడా అక్కడక్కడ పోటీ చేసిన తెగువ, తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రకు చెంపపెట్టు. సో.. పరీక్ష పాసయ్యావా లేదా అన్నదే ముఖ్యం తప్ప, కాపీ కొట్టి పాసయ్యావా? కష్టపడి చదివి పాసయ్యావా అన్నది ప్రధానం కాదు. పరిషత్తు ఫలితాలూ అలాంటివే. ఆరకంగా వైసీపీ అద్భుత విజయానికి బాటలు వేసింది టీడీపీనే.
పోరాడేవాడినే చరిత్ర గుర్తిస్తుంది. ఎదురొడ్డి నిలిచేవాడినే చరిత్ర మెచ్చుకుంటుంది. యుద్ధంలో పోరాడకుండా పలాయనం చిత్తగించేవారిని చరిత్ర గుర్తించదు. ఇందులో మొదటి మెచ్చుకోలు వైసీపీకయితే, రెండో విమర్శ టీడీపీకి దక్కుతుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్నో ఎదురుదెబ్బలు చవిచూసింది. ఫ్యాక్షన్ రాజకీయాలు పడగవిప్పిన ఆ కాలంలోనే, పాణ్యం ఉప ఎన్నికను ధైర్యంగా ఎదుర్కొన్న చరిత్ర టీడీపీది. అధికారంలో ఉన్న రోజుల్లో కూడా.. ఏ ఎన్నికల్లోనూ కడపలో ముందంజలో లేనప్పటికీ, ఆ ఫ్యాక్షన్ జిల్లాలో ఎన్నికలను టీడీపీ ఏనాడూ బహిష్కరించలేదు.
కాంగ్రెస్ హయాంలో వందలాదిమంది కార్యకర్తలు హత్యకు గురయినప్పటికీ, ఏ ఎన్నికల్లోనూ అస్త్రసన్యాసం చేసిన చరిత్ర టీడీపీకి లేదు. మున్సిపాలిటీల నుంచి జడ్పీల వరకూ ఏ ఎన్నికలోనూ ఆ పార్టీ వెన్నుచూపింది లేదు. గత అసెంబ్లీ ఎన్నికల వరకూ టీడీపీ ఏ ఎన్నికనూ విడిచిపెట్టలేదు. అసలు చంద్రబాబుకు ఎన్నికలంటే మహా ఇష్టం. అప్పుడే ఆయన ప్రతిభ మరింత బయటపడుతుందన్న నానుడి, టీడీపీలో ఇప్పటికీ వినిపిస్తుంటుంది. ఆంధ్రా-తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా, భావోద్వేగం రగిలిన తెలంగాణలో జరిగిన అన్ని ఎన్నికలనూ టీడీపీ ధైర్యంగా ఎదుర్కొంది. అదంతా ఇక గత వైభవమే. అంటే.. చంద్రబాబు చేతిలో పగ్గాలుండి, స్వయంనిర్ణయాధికారం ఉన్నప్పటి మాట. మరిప్పుడు? తరం-కాలం మారింది. వారసుల చేతికి పగ్గాలొచ్చాయి. డబ్బులకు వెనుకాడకుండా పోరాడిన కాలం నుంచి.. పైసా పైసా లెక్కబెట్టే కొత్త తరం వచ్చింది. అన్నీ కార్పొరేట్ బంధాలు. కాబట్టి ఫలితాలు కూడా అందుకు అనుగుణంగానే ఉంటాయన్నది నిష్ఠుర సత్యం.
ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ బలం 28 కూడా దాటలేదు. అయినా అప్పుడు పీజేఆర్ గానీ, కాంగ్రెస్ గానీ ఎన్నికలను బహిష్కరించాలన్న నిర్ణయం తీసుకోలేదు. అధికారంలో ఉన్న టీడీపీకి భయపడి కాడికిందపడేయలేదు. ఎదురొడ్డి పోరాడి.. కొన్ని జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు సాధించింది. బాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ కూడా పోరాటపటిమ ప్రదర్శించారు. బాబు విపక్షనేతగా ఉన్నప్పుడయితే.. కాంగ్రెస్‌కు చెమటలుపట్టించే స్థాయిలో ఎన్నికలు ఎదుర్కొన్నారే తప్ప, ఇప్పటిలా అస్త్రసన్యాసం చేయలేదు. మరిప్పుడు అలాంటి తప్పుటడుగులు తండ్రీకొడుకులు ఎందుకు వేసినట్లు? క్యాడర్ ఉత్సాహాన్ని ఎందుకు గొంతునులిమినట్లు అన్నదే తెలుగుతమ్ముళ్లను వేధిస్తున్న ప్రశ్న.
మున్సిపల్-పరిషత్తు ఎన్నికల ముందు.. టీడీపీ అగ్రనేతలంతా అస్త్రసన్యాసం చేసి, పోటీ పెడితే అభ్యర్ధులకు ఎక్కడ డబ్బులివ్వాల్సి వస్తుందన్న భయంతో, ఎవరికీ అందకుండా పక్క రాష్ట్రాలకు పారిపోయారు. ఆ సమయంలో నారాయణలు, గంటా శ్రీనివాసరావులు, పత్తిపాటి పుల్లారావులు, దేవినేని ఉమాలు, అఖిలప్రియ వంటి పదవులనుభవించిన వారంతా భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. అప్పుడు పార్టీపై మమకారంతోనో, స్థానికంగా పట్టు సాధించాలన్న పట్టుదల ఉన్న గ్రామస్థాయి నేతలే స్థానిక ఎన్నికల బరిలో దిగారు. అదిగో… ఆ పట్టుదలతో బరిలోకి దిగిన వారిలో కొందరే, ఇప్పుడు గెలిచి నిలిచారు. కనీసం అక్కడక్కడ గట్టి పోటీనివ్వగలిగారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే సీన్.
అంటే.. పట్టుదలతో పోటీకి దిగిన వారినే విజయలక్ష్మి వరించింది. ఇది ఒకరకంగా తండ్రీకొడుకులు వేసిన తప్పుటడుగుల ఫలితం. గెలిచినా, ఓడినా పార్టీ మీ వెంట ఉంటుందన్న ధైర్యం-భరోసా తండ్రీకొడుకులు ఇచ్చి ఉంటే కథ మరోలా ఉండేది. లోకేషు ఓడిన మంగళగిరిలో పార్టీ దన్నుగా నిలవకపోయినా, పరిషత్తు ఫలితాలు పార్టీకి ప్రాణం పోశాయి. దానికి కారణం తండ్రీకొడుకుల ప్రతిభ కానేకాదు. స్థానిక నేతల తెగింపు! కర్నూలు జిల్లాలో పార్టీ దన్ను లేకున్నా 62 ఎంపీటీసీలు సాధించింది. కొందరు మంత్రులు, ఎంపీల ఇలాకాల్లో టీడీపీ జెండా ఎగరిందంటే అందుకు బాబు-లోకేష్ ఇమేజ్ కారణం కాదు. స్థానిక నేతల మొండితనం. తెగింపేనన్నది మెడపై తల ఉన్న ఎవరికయినా తెలుసు. అంటే సాధారణ గ్రామస్థాయి నేతలకున్న తెగింపు-మొండితనం తండ్రీకొడుకులకు ఉంటే, ఫలితాలు అద్భుతంగా కాకపోయినా, కనీసం పార్టీ పరువు నిబెట్టేవి. మొన్నటి మున్సిపల్ ఎన్నికలతోపాటు, తాజా పరిషత్తు ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సందేశమిదే.
కాకపోతే.. స్థానిక ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టినా, చివరాఖరకు గెలిచిన వారంతా వైసీపీలోకి వెళితే.. పెట్టిన పెట్టుబడి వృధా అవుతుందనే ముందుచూపున్న యువ నాయకత్వ ఆధ్వర్యంలోనే, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. ఇక పార్టీకి అవే చివరి ఎన్నికలన్నది టీడీపీ సీనియర్లలో ఇప్పుడు మొదలయిన అసలు ఆందోళన. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ వైసీపీ అణచివేత, హవా ఇలాగే కొనసాగడం సహజం. మరి అప్పుడు అసెంబ్లీ ఎన్నికలనూ ఇలాగే బహిష్కరిస్తారా? అన్నదే తమ్ముళ్ల సందేహం. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సివస్తుంది కదా మరి?!
చెప్పుకోదగ్గ క్యాడర్, అసలు పార్టీ నిర్మాణమే లేకపోయినా జనసేన చేసిన పోరాటం అద్భుతం. .. కొత్తగా పుట్టిన జనసేన పోరాటతత్వాన్ని చూసి.. దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ సిగ్గుతో తలదించుకోవాల్సిందే. 179 ఎంపీటీసీ, 2 జడ్పీటీసీలు గెల్చుకున్న జనసేన ధీరత్వం మెచ్చదగిందే. పవనకల్యాణం పెద్దగా పట్టించుకోకపోయినా, నయాపైసా నిధులివ్వకపోయినా, స్థానికంగా టీడీపీతో జట్టుకట్టిన జనసేన అభ్యర్ధులు గెలిచి నిలిచారు. రెండు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మిత్రపక్షమైన బీజేపీతో కాకుండా, జనసైనికులు టీడీపీతో కలసి పోరాడటమే ఆశ్చర్యం. తాజా ఫలితాలు జనసేన ఆశలను సజీవంగా ఉంచాయి.
ఇక జాతీయ పార్టీ అయిన బీజేపీ పోరాటం 28 ఎంపీటీసీ వద్దే నిలిచిపోయాయి. అది కూడా జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి పుణ్యమే తప్ప, ‘పువ్వుపార్టీ’ ప్రభావం కాదు. కేంద్రంలో అధికారంలో ఉండి, రాష్ట్రంలో అధికార భాగస్వామిగా పనిచేసిన బీజేపీ ఒక్క జడ్పీటీసీ కూడా గెలుచుకోలేకపోవడం సిగ్గుచేటు. చివరాఖరకు పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సొంత తూర్పు గోదావరి జిల్లాలో రెండంటే రెండే ఎంపీటీసీలు గెలవడం చూస్తే.. ఇక ఆ పార్టీ ఏపీలో ఆశలు వదులుకుని, నేతలంతా స్వరూపానంద ఆశ్రమంలో చేరడం మంచిదేమోననిపిస్తుంది. రాష్ట్రంలో వైసీపీకి శత్రుపక్షమో, మిత్రపక్షమో తెలియని దుస్థితి నుంచి బయటపడేంత వరకూ.. ఆంధ్రాలో ‘పువ్వుపార్టీ’ ఇలాంటి నవ్వులపాలయ్యే ఫలితాలు తప్పవు.

Leave a Reply