Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై బాబు సమీక్ష

– 2017 మెట్రో పాలసీ అధారంగా ఫండింగ్ మోడల్స్ పై చర్చ
– రెండు నగరాల్లో డబుల్ డెక్కర్ విధానంలో 25 కి.మీ మేర మెట్రో నిర్మాణం

అమరావతి: విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 66 కి.మీ మేర విజయవాడ మెట్రో, 76.90 కి.మీ మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డిపిఆర్ లు ఆమోదించారు. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.

మెట్రో ఎండి రామకృష్ణారెడ్డి ప్రజెంటేషన్ ద్వారా మెట్రో ప్రాజెక్టు స్థితిగతులను వివరించారు. 2017లో వచ్చిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం మన రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు ఫండింగ్ మోడల్స్ పై ముఖ్యమంత్రి చర్చించారు. 2017 వరకు 100 శాతం నిధులు కేంద్రం భరించే విధానం లేదు. అయితే 2017 పాలసీ ప్రకారం 100 శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్ కత్తాలో 16 కి.మీ మేర ప్రాజెక్టు చేపట్టారు. రూ.8,565 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు.

కేంద్ర పట్టణాభివృద్ది శాఖ, రైల్వే శాఖలు కోల్ కత్తా ప్రాజెక్టును చేపట్టాయి. ఇదే తరహాలో ఏపీలో కూడా మెట్రో పాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని సిఎం అన్నారు. ఆ చట్ట ప్రకారమయినా…లేకపోతే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్ర సాయం చేయాలన్నారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు

రెండు చోట్లా డబుల్ డెక్కర్
విశాఖ, విజయవాడలలో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నారు. హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ విధానంలో కింద రోడ్డు దానిపైన ఫ్లైవోవర్ ఆపైన మెట్రో వస్తుంది. విశాఖలో మొదటి స్టేజ్ లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కి.మీ, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కి.మీ డబుల్ డెక్కర్ మోడల్ లో మెట్రో నిర్మించనున్నారు.

అలాగే విజయవాడలో రామవరప్పాడురింగ్ నుంచి నిడమానూరు వరకు 4.7 కి.మీ డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు. ఇప్పటికే ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రంలోనూ ఈ తరహా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.

కేంద్రంతో త్వరతిగతిన సంప్రదింపులు పూర్తి చేసి మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 4 ఏళ్లలో రెండు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పనిచేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, బిసి జనార్థన్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE