– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : రజకుల ఉన్నతే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్ పర్సన్ సావిత్రి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వాలతోనే రజకులకు మేలు జరుగుతోందన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబునాయుడు రజకుల ఉన్నతికి పలు పథకాలు అమలు చేశారన్నారు. 1994-2004, 2014-19 మధ్యకాలంలో రజకుల అన్ని విధాలా అభివృద్ధి చేసేలా పథకాలు అమలు చేశారన్నారు. స్వయం ఉపాధి కోసం ఆదరణ పథకం పేరుతో రజకులకు అవసరమైన పనిముట్లు, పాత్రలు అందజేశారన్నారు.
సొసైటీలు ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలు అందజేశారన్నారు. దోబిఘాట్ల నిర్మాణం చేపట్టామని, 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించామన్నారు. తరవాత వచ్చిన జగన్ అన్ని కులాల మాదిరిగానే రజకులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. టీడీపీ అమలు చేసిన పథకాలను నిలిపేసి, జగనన్న చేదోడు పేరుతో ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. మరోసారి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో, రజకులకు మంచిరోజులు వచ్చాయన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రజక కార్పొరేషన్ చైర్ పర్సన్ సావిత్రికి మంత్రి దిశానిర్దేశం చేశారు. తనకు చైర్ పర్సన్ గా అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబుకు, అందుకు సహకరించిన మంత్రి సవితకు సావిత్రి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని, ప్రభుత్వ పథకాలను అర్హులకే చేర్చేలా కృషి చేస్తానని సావిత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.