– జూపూడికి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య సలహా
రాజకీయ వ్యామోహంతో, పదవుల పాకులాట లో పడి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తే పుట్టగతులుండవు అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ప్రభుత్వ న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకరరావును హెచ్చరించారు.
సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ‘మాకు డబ్బులు మాత్రమే ముఖ్యం, అంబేద్కర్ పేరు ముఖ్యం కాదంటూ’ జూపూడి చేసిన వ్యాఖ్యలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు తీరని ద్రోహం చేసినట్లే అని, దళితుల ఆత్మగౌరవాన్ని అగౌరవపర్చటమే అని అభివర్ణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పేరును మార్చి, జగన్ వీదేశీ విద్యా కానుకగా సిఎం పేరు పెట్టుకోవడం పూర్తిగా ఆక్షేపనీయమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసే ఆలోచనలు జూపూడికి ఉంటే, ఆయన ఇంట్లో గుమస్తాగానో, వాలంటీర్ గానో చేరి సేవలు అందించవచ్చని సలహా ఇచ్చారు.
రాష్ట్రంలో దశాబ్దాలుగా అమలులో ఉన్న 27 రకాల సంక్షేమ పథకాలను పూర్తిగా నిలిపివేసి, చట్టబద్ధమైన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత, గిరిజనులకు తీరని అన్యాయం చేశారని చెప్పారు. దళితుల ఆర్థిక చేయూత కోసం ఇచ్చే బ్యాంకు లింకేజీ రుణాలు, కార్పోరేషన్ ద్వారా ఇచ్చే రుణ సహాయం, భూమి కొనుగోలు పథకం తుదకు కులాంతర వివాహాల ప్రోత్సాహలు కూడా లేకుండా చేశారన్నారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను, మాస్క్ పెట్టుకోనందు చీరాల కిరణ్ బాబు ను పోలీసులు కొట్టి చంపిన విషయం జూపూడికి గుర్తు లేదా? అంటూ ప్రశ్నించారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యంను నేనే చంపాను’అంటూ ప్రకటించిన ఎమ్మెల్సీ అనంతబాబు ముఖ్యమంత్రి వెంట బస్సుల్లో, సభల్లో ఊరేగుతున్న విషయాన్ని మరిచిపోయారా? అంటూ నిగ్గదీశారు. దళితుల చెవుల్లో పూలు పెట్టినా వినేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరని, కాలం చెల్లిన కాసులలో జూపూడి కూడా ఒకరని, ఇలాంటి వినాయకుల వలన దళితులకు ఎలాంటి ఉపయోగం కూడా లేదని తేల్చేశారు. వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు క్షమాపణలు చెప్పి, చేసిన తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.