నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలతోను పలు షోలతో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాలు కూడా చేస్తున్నారు. అఖండ సినిమాతో హిట్ కొట్టిన బాలకృష్ణ మరోవైపు అన్‌స్టాపబుల్ అనే టాక్ షోతోను అదరగొట్టాడు.
ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆయన కనపడడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదుకావడం ఇప్పుడు చర్చనీయాంశంగామారింది. బాలకృష్ణ నిజంగానే కనబడడం లేదా? కనబడకుండా ఆయన ఎక్కడికి వెళ్లారు? ఆయన కనబడడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఎవరు ఫిర్యాదు చేశారు? అసలు బాలయ్య బాబు కు ఏమైంది? ఇలా ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఏపీలో కొత్త జిల్లాల విభజన సందర్భంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోను ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు స్థానిక వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.