Suryaa.co.in

Features

డాక్టర్జీ తీర్చిదిద్దిన శిల్పం బాలాసాహెబ్ దేవరస్!

1943లో పూణేలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శిక్షా వర్గ్ లో ఆ రోజు బౌధిక్ ఇవ్వబోతున్న ఒక కార్యకర్తను పరిచయం చేస్తూ ఆ నాటి సర్ సంఘచాలక్ గురూజీ గోల్వాల్కర్ ఇలా అన్నారు: “మీలో చాలామంది సంఘ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్‌ని చూసి ఉండరు. మీరు బాలాసాహెబ్ దేవరస్‌ను చూస్తే, మీకు డాక్టర్ హెడ్గేవార్ కనిపిస్తారు”.
నాగ్‌పూర్‌లోని ‘మోహితే బారా’లో డాక్టర్ హెడ్గేవార్ ప్రారంభించిన మొదటి ఆర్‌ఎస్‌ఎస్ శాఖలో చేరిన స్వయంసేవకుల మొదటి బృందంలో ఆయన కూడా ఉన్నాడు. ఆర్‌ఎస్‌ఎస్ ను 1925లో విజయదశమి సందర్భంగా స్థాపించినా మొదటి దైనందిన శాఖను కొన్ని నెలల తర్వాత 1926లో ప్రారంభించారు.
బాలాసాహెబ్‌ను స్వయంగా డాక్టర్జీ తీర్చిదిద్దారు. అందుకనే డాక్టర్ హెడ్గేవార్‌ను ఎన్నడూ చూడని లక్షలాది
Hedgewar-RSSమంది స్వయంసేవకులు బాలాసాహెబ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడి ప్రతిబింబాన్ని చూస్తుడేవారు. డాక్టర్జీ తీర్చిదిద్దిన శిల్పంగా ఆయనను భావిస్తుంటారు. గురూజీ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ కు తృతీయ సంఘచాలక్ గా 1973 నుండి 1993 వరకు పనిచేశారు.
బాలాసాహెబ్‌తో పాటు సంఘస్థాన్ కు వచ్చిన మొదటి జట్టు స్వయంసేవకులలో కేశవ్ రావ్ వకీల్, త్రయంబక్ జిలేదార్, అల్హాద్ అంబేకర్, బాపు దివాకర్, నరహరి పరాఖి, బాలి యెష్కున్య్యవార్, మాధవ్ రావ్ ములే, ఏకనాథ్ రానడే ఉన్నారు. 6వ తరగతి చదువుతున్న పదకొండేళ్ల బాలాసాహెబ్ వారందరికీ తిరుగులేని నాయకుడు. వాస్తవానికి ఆయనకన్నా రానడే ఒక సంవత్సరం, మూలే మూడు సంవత్సరాలు పెద్దవారు.
ఆ తరువాత బాలాసాహెబ్ తో పాటు రానడే, మూలే కూడా సర్ కార్యవాహలుగా సంఘ విస్తరణలో కీలక భూమిక వహించారు.దేవరస్ కుటుంబం గోదావరి ఒడ్డున ఆదిలాబాద్ (తెలంగాణ) జిల్లాలోని చెన్నూరు గ్రామానికి చెందినవారు. 200 ఏళ్ళ క్రితం నాగపూర్ కు వెళ్లిన కుటుంభంలో ఆయన జన్మించారు. డిసెంబరు 11, 1915న బాలాఘాట్ (మధ్యప్రదేశ్)లోని కరంజాలో కృష్ణారావు దేవరస్, పార్వతిబాయి దంపతులకు జన్మించారు.
1932 నుండి బాలాసాహెబ్ సంఘ్ లో ముఖ్యమైన పాత్ర పోషించడం ప్రారంభించారు. ఆర్‌ఎస్‌ఎస్ ‘ఘోష్’ (బ్యాండ్), సాంఘిక గీతాలను పఠించే సంప్రదాయాన్ని ప్రారంభించిన ఘనత ఆయనదే. 1937 విజయదశమి ఉత్సవంలో, నాగ్‌పూర్‌లో దాదాపు 2000 మంది స్వయంసేవకులు అటువంటి ఐదు బృంద గీతాలు ఆలపించారు.
దేశ వ్యాప్త విస్తరణ
Balasaheb-Deorasబాలాసాహెబ్ పదునైన సంస్థాగత, అసాధారణమైన ప్రేరణ నైపుణ్యాలు సంఘ్ విస్తరణకు విశేషంగా దోహదపడ్డాయి. 1940ల ప్రారంభంలో, పంజాబ్, కర్ణాటక, కేరళ, సింధ్, గుజరాత్, మధ్య భారతదేశం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కాశ్మీర్, నేపాల్‌లో కూడా ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకులు పని చేయడం ప్రారంభించడంలో ఆయన కార్యప్రణాళిక దాగిఉంది.
మాధవరావ్ ములే పంజాబ్‌కు, యాదవ్‌రావు జోషి కర్ణాటకకు, దత్తోపంత్ తెంగడి కేరళలో, రాజ్‌పాల్ పూరీ సింధ్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ని ప్రారంభించారు. మధుకరరావు భగవత్ గుజరాత్‌కు వెళ్లారు, భయ్యాజీ దానీ మధ్య భారతదేశంలో, ఎకనాథ్ రానడే, ప్రహ్లాదరావు అంబేకర్‌లు మహాకౌశల్‌లో, ముకుందరావ్ అంబేకర్ ఉత్కల్ లకు వెళ్లారు.
బీహార్‌లో గజానన్ జోషి, ఆంధ్రప్రదేశ్‌లో నరహరాయ్ పర్ఖీ, రాజా దేశ్‌పాండే, యాద్వాద్కర్ సంఘ్ పనిని ముందుకు తీసుకెళ్లారు. వసంతరావ్ ఓక్ ఢిల్లీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన సోదరుడు భావురావ్ దేవరాస్ సంఘ్ వ్యాప్తి చేశారు. వారందరూ బాలాసాహెబ్ చూసుకునే నాగ్‌పూర్ శాఖ నుండి బయటకు వచ్చినవారే కావడం విశేషం.
1942 నుండి 1947 వరకు 1000 మందికి పైగా యువకులు సంఘ్ ప్రచారక్ లుగా దేశ వ్యాప్తంగా సంఘ్ విస్తరణకు వెళ్లారు. 1946-47లో ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణా శిబిరానికి దేశం నలుమూలల నుంచి నాలుగు వేల మంది స్వయంసేవకులు హాజరయ్యారు. ఇది ఇప్పటివరకు అత్యధిక సంఖ్య. దేశ విభజనకు ముందు ఢిల్లీ, పంజాబ్ లలో పర్యటించి రానున్న ప్రమాదాలను ఎదుర్కోవడం, హిందువులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి అంశాలపై స్వయంసేవక్ లకు మార్గదర్శనం చేశారు.
దేశ విభజనకు ముందే హెచ్చరిక
రాబోయే దేశ విభజనను దృష్టిలో ఉంచుకుని తీసుకోవలసిన చర్యల గురించి ప్రముఖ పౌరులను హెచ్చరించారు. అలాంటి ఒక సమావేశంలో దాదాపు 30 మంది ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారులు పాల్గొన్నారు. దేశవ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, వారు జాగ్రత్తగా ఉండాలని బాలాసాహెబ్ కోరారు.
ఫిబ్రవరి 4, 1948న మహాత్మా గాంధీ హత్యను సాకుగా తీసుకొకుని నాటి నెహ్రు ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ ను నిషేధించింది. ఆ సమయంలో జైలులో ఉంటూనే నిషేధంకు వ్యతిరేకంగా సత్యాగ్రహాలు జరపడానికి సంస్థను సిద్ధం చేయడంలో, నిషేధం ఎత్తివేతకు సంబంధించిని అన్ని చర్చలలో కీలక పాత్రను గురూజీ ఆయనకే అప్పచెప్పారు.
అనారోగ్యం కారణంగా 1950 నుండి 1960 వరకు, బాలాసాహెబ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌లో అధికారిక బాధ్యత లేదు. 1963లో భయ్యాజీ దానీ సర్ కార్యవాహగా ఉన్నప్పుడు బాలాసాహెబ్ సహా సర్ కార్యవాహగా నియమితులయ్యారు. భయ్యాజీ డానీ 1965 నాటికి చాలా అస్వస్థతకు గురవడంతో మార్చ్, 1965లో బాలాసాహెబ్ ను సర్ కార్యవాహగా నియమించారు.
1970లో, గురూజీ క్యాన్సర్ కు గురయ్యారు. గురూజీ, బాలాసాహెబ్ ఆర్‌ఎస్‌ఎస్ భవిష్యత్తు గమనాన్ని క్రమం తప్పకుండా చర్చించేవారు. ఈ చర్చల ఫలితంగా మూడు రోజుల పాటు కన్యాకుమారిలో చింతన్ బైఠక్ 1971 అక్టోబర్ 28 నుండి నవంబర్ 1 వరకు నిర్వహించారు. వివిధ క్షేత్రాలలో పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులతో పాటు సంఘ్ ముఖ్యమైన కార్యకర్తలు అందరు హాజరయ్యారు.
ఇంతలో, గురూజీకి ఆరోగ్య పరిస్థితి విషమించి, జూన్ 5, 1973న ఆయన పరమపదించారు. తన మరణంకు ముందు వ్రాసిన మూడు లేఖలలో ఒక దానిలో తన తర్వాత సర్ సంఘచాలక్ గా జ్యేష్ఠ కార్యకర్తలు అందరితో చర్చించి బాలాసాహెబ్ ను నియమిస్తున్నట్లు గురూజీ వ్రాసారు.
58 ఏళ్ళ వయస్సులోనే మధుమేహం కారణంగా సరైన ఆరోగ్యం లేని బాలాసాహెబ్ ఈ ఆదేశాన్ని స్వీకరించి, తర్వాత 21 ఏళ్లపాటు అవిశ్రామంగా సంఘ కార్యంలో మునిగిపోయారు. ఏనాడు తన ఆరోగ్యం గురించిన ప్రస్తావనకు తీసుకు రాలేదు. సర్ సంఘచాలక్ గా దేశమంతటా సుడిగాలి పర్యటనలు జరిపారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం, అయోధ్య ఉద్యమంలలో నిర్ణయాత్మక పాత్ర వహించారు. దేశంలో రాజకీయ రంగంలో పెను మార్పులకు కూడా దోహదపడ్డారు.

– నిజం టుడే సౌజన్యంతో

LEAVE A RESPONSE