బర్రెకు సున్నం పూస్తే ఆవు అవుతుందా?

– దివాళా తీసిన కంపెనీకి పేరు మార్చినట్లుగా బీఆర్ఎస్ తీరు
– కేసీఆర్ చెల్లని రూపాయి… ఆయన ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అయినట్లే
– టీఆర్ఎస్ పై గెలిచిన కేసీఆర్… సీఎంగా కొనసాగే అర్హతే కోల్పోయారు
– దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పై పోటీ చేయాలి
– మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతో ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతారు?
– హవ్వ…మూసీ నదిని ప్రక్షాళన చేయలేనోడు గంగానది గురించి మాట్లాడటమా?
– 5 ఏళ్లపాటు కేబినెట్ లో మహిళకు చోటు కల్పించలేనోడు లింగ వివక్షను రూపుమాపుతాడా?
– రాష్ట్రంలో 8 లక్షల 40 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారనడం పచ్చి అబద్దం
– దమ్ముంటే దళిత బంధుపై శ్వేత పత్రం విడుదల చేయాలి
– రైతు ఆత్మహత్యలో తెలంగాణను 4వ స్థానానికి చేర్చినోడు వ్యవసాయాన్ని ఉద్దరిస్తానడం పెద్ద జోక్
– తాగి పండటం… జనాన్ని కలవకపోవడం… సచివాలయానికి రాకపోవడమే తెలంగాణ మోడలా?
– కేసీఆర్ బీఆర్ఎస్ పేరిట కొత్త పార్టీ ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఫైర్..

‘‘బర్రెకు సున్నం పూస్తే ఆవు అవుతుందా? టీఆర్ఎస్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. బీఆర్ఎస్ గా మార్చినంత మాత్రాన జాతీయ పార్టీ అవుతుందా? బ్యాంకుల నుండి కోట్లు కొల్లగొట్టి దివాళా తీసిన కంపెనీలు కొత్త బోర్డు తగలించినట్లుగా ఉంది బీఆర్ఎస్ తీరు. తెలంగాణ ప్రజల ద్రుష్టిలో కేసీఆర్ ఇప్పుడు చెల్లని రూపాయి. ఆయన ఎన్ని డ్రామాలేసినా… బీఆర్ఎస్సే కాదు.. పీఆర్ఎస్ (ప్రపంచ రాజ్య సమితి) అని పేరు పెట్టుకున్నా ఆయన ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అయినట్లే’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను తూర్పారపడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, మాధవి, కోశాధికారి శాంతి కుమార్, రాష్ట్ర అధికారి ప్రతినిధి ఎన్వీ సుభాష్, మైనారిటీ మోర్చా అధ్యక్షులు అఫ్సర్ పాషా, రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు..

బీజేపీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తామని విజయ దశమి సందర్భంగా మరోసారి హామీ ఇస్తున్నా. కేసీఆర్ లెక్క హామీలిచ్చి మోసం చేసే పార్టీ బీజేపీ కాదు. కేసీఆర్ నిన్న టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పెడితే… మంత్రులకు, టీఆర్ఎస్ నేతలకే ఆ కొత్త పార్టీ సంగతి తెల్వట్లేదు. ఇయాళ ఒకాయనేమో బీఎస్పీ అంటున్నడు. ఇంకోకాయనేమో ఇంకో పేరు చెబుతున్నడు. అయినా ‘‘బర్రెకు సున్నం వేస్తే ఆవు అవుతుందా?’’ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా పేరు మార్చడం కూడా అట్లనే ఉంది. అప్పట్లో పాపులర్ ఫ్రంట్ అన్నడు.. పీఎఫ్ఐతో సంబంధాలేమైనా ఉన్నయోమో.. ఇప్పుడు కొత్త విమానం కొనుక్కుని జాతీయ పార్టీ పేరుతో దేశమంతా తిరుగుతడట. కేసీఆర్, కేఏపాల్ వంటి వాళ్లు మాత్రమే కొత్త విమానాలు కొనుక్కుని తిరిగేటోళ్లు.

బీఆర్ఎస్ జెండా, ఎజెండా లేని పార్టీ. టీఆర్ఎస్ స్థాపించినప్పుడున్న వ్యవస్థాపకుల్లో ఇప్పుడెంత మంది ఉన్నరు? ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీ పెట్టిండో కేసీఆర్ సమాధానం చెప్పాలి? తెలంగాణలో కేసీఆర్ అవినీతి, అక్రమాల బండారం బయటపడుతుంటే చర్చను దారి మళ్లించేందుకు, కొడుకును సీఎంగా చేసేందుకు, బిడ్డకు కేంద్రంలో ఏదో ఒక పని కల్పించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పెట్టిండు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను చీత్కరిస్తున్నరు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో కొత్త పార్టీ పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటున్నడు. ఈ సంగతి తెలిసే బీఆర్ఎస్ పేరుతో కొత్త డ్రామాలాడుతున్నడు.

తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మి ఓట్లేస్తే ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్ కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. తక్షణమే రాజీనామా చేసి బీఆర్ఎస్ పై పోటీ చేసి ప్రజాతీర్పుకు సిద్ధపడాలి. నేనడుగుతున్నా… మునుగోడులో టీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి?

ఏ తెలంగాణ అస్తిత్వం కోసం నువ్వు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టానని చెప్పినవో ఆ తెలంగాణ అస్థిత్వం పేరుతో 8 ఏండ్ల పాటు తెలంగాణను దోచుకుతిన్నవ్. రాష్ట్రాన్ని అప్పులు పాల్జేసినవ్. నీ కుటుంబాన్ని మాత్రం దేశంలోనే నెంబర్ వన్ రాజకీయ సంపన్న కుటుంబంగా మార్చుకున్నవ్. నీ భాగోతం అర్ధమై ప్రజలు నీ పార్టీనీ చీత్కరిస్తున్నరు. ఇగ తెలంగాణల నీ పప్పులుడకవని తెలిసి… దేశమ్మీద పడి దోచుకోవాలనుకుంటున్నవ్.

ఇన్నాళ్లూ తెలంగాణ నుండి వెళుతున్న సొమ్ములో కేంద్రం తిరిగి 45 పైసలే ఇస్తుందని చెప్పినవ్ కదా… జాతీయ పార్టీగా ఇప్పుడు తెలంగాణ నుండి వెళుతున్న సొమ్ములో తిరిగి ఎంతిస్తవో చెప్పే దమ్ముందా? దేశం పేరుతో పార్టీ పెట్టినంత మాత్రాన జాతీయ పార్టీ అవుతుందా? ఏఐఏడీఎంకే, ఆర్జేడీ, జేడీఎస్, ఎన్సీపీ పార్టీలు కూడా ఇట్లనే అనుకుని కనుమరుగైపోయినయ్.

బీఆర్ఎస్ కు దేశంలోని ఎంతోమంది నాయకులు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారట… నీకు మద్దతిచ్చిన వాళ్లలో ఒక్కడైనా జనం ఆమోదం పొందిన నాయకుడున్నడా? జనం తిరస్కరించినోళ్లు, పేపర్ టైగర్లు, అవకాశవాదులు …ఇంకా చెప్పాలంటే రాజకీయ నిరుద్యోగులు నువ్విచ్చే పైసలకు ఆశపడి వస్తున్నవాళ్లే తప్ప ఒక్కడైనా నీకు జనామోదం ఉన్న నాయకుడొచ్చి మద్దతిచ్చినడా?

నిన్న టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ ఈ దేశాన్ని లింగ వివక్ష, కుల వివక్ష పట్టి పీడిస్తున్నదట… వాటిని రూపుమాపుతాడట…సిగ్గుండాలె చెప్పడానికి… తెలంగాణ మంత్రివర్గంలో 5 ఏళ్లపాటు ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా చోటివ్వని దుర్మార్గుడు కేసీఆర్…మహిళా కమిషన్ ను ఏర్పాటు చేయకుండా ఏళ్ల తరబడి నాన్చిన మహిళా ద్వేషి కేసీఆర్… లింగ వివక్ష గురించి మాట్లాడతవా? రాష్ట్రపతిగా గిరిజన మహిళ నిలబడితే.. పైసలిచ్చి ఆమెను ఓడగట్టేందుకు కుట్ర చేసిన మహిళా ద్రోహి కేసీఆర్. సొంత కులంతోసహా అన్ని కులాలను మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్.

ఇంకో పచ్చి అబద్దం చెప్పిండు… రాష్ట్రంలో 17 లక్షల 50 వేల దళిత కుటుంబాలుంటే… అందులో 8 లక్షల 40 వేల కుటుంబాలకు దళిత బంధు అందిస్తున్నడట. కేసీఆర్… అసలు నీది నోరా… డ్రైనేజీయా? పండుగ పూట కూడా పచ్చి అబద్దాలే ఆడుతున్నడు. నీకు దమ్ముంటే ఈరోజు వరకు ఎంతమందికి దళిత బంధు ఇచ్చినవ్? వాళ్లలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నరనే వివరాలపై శ్వేత పత్రం విడుదల చెయ్.. అప్పుడు నువ్వు చెబుతున్నది ఎంత పచ్చి అబద్దమో తేలిపోతది.

జాతీయ పార్టీ పెట్టి వ్యవసాయ రంగాన్ని ఉద్దరిస్తడట… కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఉంది. గత 8 ఏండ్లలో పంట నష్టపోయిన ఒక్క రైతును కూడా ఆదుకోలేదు. పంజాబ్ కు పోయి పైసలిచ్చినవే.. ఇక్కడి రైతులేం పాపం చేసిండ్రు. వడ్ల కుప్పలపై పడి చనిపోయినా కనికరించలేదు. నీ దుర్మార్గపు పాలనలో రైతులు రోజుకొకరు ఆత్మహత్య చేసుకుంటున్నరు. కౌలు రైతులను ఏనాడూ ఆదుకోలే. తెలంగాణలో వరి వేస్తే ఉరి అన్నవ్…ఇప్పుడు గోధుమ పంట వేస్తే గొయ్యి..నువ్వుల పంట వేస్తే నుయ్యి అనడమే నీ నూతన పంటల విధానమా?

తెలంగాణ మోడల్ దేశానికి అవసరమట.. ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజలను కలవకుండా ఫాంహౌజ్ కు పరిమితమవడమే తెలంగాణ మోడలా? ప్రజలను కలవకుండా, సచివాలయానికి రాకుండా రాత్రింబవళ్లు తాగి పండటమే దేశానికి ఆదర్శమా? తెలంగాణ రైతులు అరిగొస పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే… వాళ్లను గాలికొదిలేసి తెలంగాణ పైసలు తీసుకుపోయి ఎక్కడో పంజాబ్ లో ఖర్చు పెట్టడమే తెలంగాణ మోడలా?.. ఇక్కడ ఉద్యోగులకు జీతాలే ఇయ్యడం చేతగాక వాయిదాల పద్దతిలో రోజుకో జిల్లాలో జీతాలేయడమే తెలంగాణ మోడలా? ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇక్కడ లక్షలాది మంది నిరుద్యోగులను రోడ్డుపాల్జేసి నీ కుటుంబం కొత్త ఉద్యోగం కోసం దేశమ్మీద పడటమే నీ తెలంగాణ మోడలా?

బీఆర్ఎస్ ను చూస్తే దివాళా తీసిన కంపెనీలు గుర్తుకొస్తున్నయ్. ఆ కంపెనీలు బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని బాగా సంపాదించుకున్నాక దివాళా తీసినట్లు ప్రకటించి కొత్త పేరుతో మళ్లా దుకాణం స్టార్ట్ చేస్తయ్. టీఆర్ఎస్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. టీఆర్ఎస్ పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసి కోట్లు సంపాదించి ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నడు.

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సర్వనాశం చేసి 5 లక్షల కోట్ల అప్పులపాల్జేసి ఒక్కో తలపై 1 లక్షా 20 వేల భారం మోపడమే తెలంగాణ మోడలా? ప్రభుత్వ ఆస్తులతోపాటు యావత్ తెలంగాణ ఆస్తులన్నీ బ్యాంకులకు, కార్పొరేషన్లకు కుదువ పెట్టి దోచుకోవడమే తెలంగాణ మోడలా? నీ లిక్కర్ పాలసీతో తెలంగాణ ప్రజల జీవితాలను నాశనం చేసి మహిళల పుస్తెలు తెంపడమే దేశానికి ఆదర్శమా?

కేసీఆర్ మాటలెట్లా ఉన్నాయంటే…. మూసీ నదిని ప్రక్షాళన చేయలేనోడు దేశంలోనే అతి పెద్ద గంగా నది గురించి మాట్లాడుతున్నడు… పక్క రాష్ట్రాలతోనున్న చిన్న చిన్న వివాదాలను పరిష్కరించలేనోడు దేశ సరిహద్దుల గురించి మాట్లాడుతున్నడు. మంచి గుణం లేనోడు గుణాత్మక మార్పు గూర్చి మాట్లాడుతున్నడు… సైనికులను కించపరిచోడు దేశ రక్షణ గూర్చి మాట్లాడుతున్నడు. శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్ పాటపాడేటోడు దేశ భక్తి గురించి లెక్చర్ ఇస్తున్నడు? తెలంగాణలో ఉద్యోగులకు సరిగ్గా జీతాలే ఇయ్యలేనోడు ఈ దేశ ప్రజల జీవితాలు మారుస్తానంటున్నడు.

బీఆర్ఎస్ పేరుతో ఆడుతున్నదంతా పెద్ద డ్రామా. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ముఖం చెల్లడం లేదు. మునుగోడు ఎన్నికల నుండి రాష్ట్ర ప్రజల ద్రుష్టిని మళ్ళించేందుకు ఆడుతున్న నాటకమే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నడు. రేపు ప్రపంచ రాజ్య సమితి (పీఆర్ఎస్) కూడా పెడతాడేమో. రేపో మాపో ఐక్య రాజ్య సమితి కూడా అత్యవసర సమావేశం పెట్టి దీనిపై చర్చిస్తదేమో (ఎద్దేవా చేస్తూ…).. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అనగానే సోషల్ మీడియాలో నెటిజన్లంతా సెటైర్లు వేస్తూ పొట్టుపొట్టు తిడుతున్నరు.

టీఆర్ఎస్ పేరుతో అక్రమంగా సంపాదించిన సొమ్ము, అవినీతిపై దేశమంతా చర్చ జరుగుతోంది. పార్టీలో అసమ్మతి మొదలైంది. ఇటు వంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడానికి, ట్విట్టర్ టిల్లును సీఎంను చేయడానికి, లిక్కర్ క్వీన్ ను కాపాడటానికి ఆడుతున్న డ్రామాయే బీఆర్ఎస్. మజ్లిస్ పార్టీతో కలిసి మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్న చోట పోటీ చేసి 30. 40 సీట్లను సాధించుకుని చక్రం తిప్పి దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నడు. అందుకోసం మజ్లిస్ సహా చిన్నాచితకా పార్టీలతో కలిసి పోటీ చేయబోతున్నడు. కేసీఆర్ ఎన్ని డ్రామాలాడినా నువ్వు చెల్లని రూపాయిగా మారినవ్. ఆయనను ఎవరూ దేఖడం లేదు. మునుగోడు ఫలితాలతోనే కేసీఆర్ ఖేల్ ఖతం, దుకాణం బంద్ కాబోతోంది.

Leave a Reply