Suryaa.co.in

Telangana

పేద పిల్లలకు చదువు అక్కర్లేదా?

– ప్రభుత్వ స్కూళ్లను మూసేయాలనుకుంటున్నారా?
– 22 వేల మంది స్వచ్ఛ కార్మికులను తొలగించేశారు
– 12 వేల మంది విద్యా వలంటీర్లను తీసేశారు
– స్కూల్ మెయింటెనెన్స్ నిధులివ్వకుండా నిర్వీర్యం
– ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై బండి సంజయ్ ఫైర్
‘‘ఇవేం స్కూళ్లు. శుభ్రం చేసే స్వచ్ఛ కార్మికులను తీసేసిండ్రు. చదువు చెప్పే విద్యా వలంటీర్లను తొలగించిండ్రు. మెయింటెనెన్స్ నిధులను ఆపేసిండ్రు. ప్రభుత్వ స్కూళ్లను మూసేయాలనుకుంటున్నారా? పేద పిల్లలకు చదువును దూరం చేస్తారా?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 34వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ సిద్దిపేట జిల్లా కోహెడ సమీపంలోని శ్రీరాములపల్లెలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. కనీస సౌకర్యాల్లేక, పరిశుభ్రత లేక శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్న పాఠశాలను చూసి వాపోయారు. స్కూల్ పిల్లలు, టీచర్లతో చాలాసేపు గడిపారు. అక్కడున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
విద్యా వలంటీర్లను తీసేయడంతో టీచర్ల కొరత ఉందని, స్వచ్ఛ కార్మికులను తొలగించడంతో పాఠశాల అపరిశుభ్రంగా తయారైందని, మెయింటెనెన్స్ నిధులు కూడా రావడం లేదని గ్రామస్తులు, స్కూల్ విద్యార్థులు బండి సంజయ్ ద్రుష్టికి తీసుకొచ్చారు.
దీంతో తీవ్రంగా స్పందించిన బండి సంజయ్ ‘‘నేను పాదయాత్ర చేసిన ప్రాంతాల్లోని దాదాపు అన్ని స్కూళ్లలో ఇదే దుస్థితి. అన్నీ శిధిలావస్థలోనే ఉన్నయ్. స్కూల్ డెవలప్మెంట్ స్కీం కింద 2000 కోట్ల రూపాయలు ఖర్చుపెడతానని, ‘ప్రత్యేక బృందం ఢిల్లీ, ఏపీ కి పోయి ఒక నివేదిక సమర్పిస్తుంది. నివేదిక రాగానే పనులు మొదలు పెడతానని ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి నివేదిక వచ్చి నెలలు గడుస్తున్నా నిధులు మాత్రం పాఠశాలలకు ఇవ్వలేదు. ప్రైమరీ స్కూలుకి రూ.12 వేల నుండి 1 లక్ష రూపాయాలు ఏటా మైంటెనెస్ గ్రాంట్ ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. హై స్కూల్ కు ఏటా రూ.25 నుండి రూ.1 లక్ష వరకు మైంటెనెస్ గ్రాంట్ ఇవ్వాలి. అతీగతీ లేదు.’’అని మండిపడ్డారు.
‘‘రాష్ట్రంలో పాఠశాలల్లో పనిచేస్తున్న 28 వేల మంది స్వచ్చ కార్మికులను కేసీఆర్ తొలగించేసిండు. మాట్లాడితే రూ.2వేల పెన్షన్ లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ స్వచ్ఛ కార్మికులకు కనీసం రూ.2 వేల వేతనం ఇవ్వలేరా? వాళ్లు లేనందువల్ల పరిశుభ్రత లేక ఈరోజు పాఠశాలలన్నీ అత్యంత దయనీయమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నయ్.’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ప్రభుత్వ స్కూళ్లలో పాఠాలు చెప్పే పంతుళ్లు లేక విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పాఠాలు చెప్పే 12 వేల మంది విద్యా వలంటీర్లను కేసీఆర్ ప్రభుత్వం కక్ష కట్టి నిర్ధాక్షిణ్యంగా తొలగించింది. వాళ్లకు రావాల్సిన రూ.66 కోట్లు బకాయిలు కూడా చెల్లించలేదు. చివరకు పాఠశాలల్లో చాక్ పీస్ లకు కూడా దిక్కు లేదు. ఆ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఇక స్కూల్ కావలసిన శానిటేషన్ సామాను కూడా ఇవ్వట్లేదు ఇట్లాంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వ స్కూళ్లను మూసేసి పేద పిల్లలకు చదువు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది’’అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యలు వింటూ…భరోసా ఇస్తూ సాగిన పాదయాత్ర
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 34వ రోజు బండి సంజయ్ కోహెడ నుండి శ్రీరాములపల్లి, పర్వేద, పందిళ్ల మీదుగా పొట్లపల్లి వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఉదయం పాదయాత్ర ప్రారంభం కాగానే కరీంనగర్, వరంగల్ నుండి పెద్ద ఎత్తున సిక్కు మతస్తులు, ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చి బండి సంజయ్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. జై బండి సంజయ్, జై బీజేపీ అంటూ నినదించారు. అభిమానంతో బండి సంజయ్ కు సిక్కు తలపాగాను ధరింపజేశారు. సిక్కు తలపాగా ధరించి పాదయాత్ర చేసిన బండి సంజయ్ దారి పొడువునా ప్రజలను, రైతులను, నిరుద్యోగులను కలిసి వారి సమస్యలను వింటూ అండగా బీజేపీ ఉంటుంది అంటూ ముందుకు సాగారు. శ్రీరాములపల్లి, పర్వేద గ్రామాల్లో స్థానిక మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మంగళహారతులతో స్వాగతం పలికారు.

LEAVE A RESPONSE