Suryaa.co.in

Telangana

జూబ్లిహిల్స్ కేసును పూర్తిగా నీరుగార్చారు

-ఆధారాలు గల్లంతు చేసి ఎమ్మెల్యే కొడుకుపై కేసు పెడతారా?
-నిందితులపై కేసు నమోదు విషయంలో కావాలనే జాప్యం
-కేసును తప్పుదోవ పట్టించేందుకు తొలి ఎఫ్ఐఆర్ లో సూరజ్ అనే పేరు నమోదు
-బీజేపీ ఉద్యమించకపోతే కేసును క్లోజ్ చేసేవాళ్లు
-అత్యాచారం చేస్తే కళ్లు పీకేస్తానన్న కేసీఆర్ ఎటు పోయారు?
-సీబీఐ జరిపితేనే బాధితురాలికి న్యాయం జరిగే అవకాశం….
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

• జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసును పోలీసులు పూర్తిగా నీరుగార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. అత్యాచారం కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ గల్లంతు చేసిన తరువాతే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేశారని అన్నారు. అత్యాచారం జరిగిన ఘటన రోజు నుండి కేసు నమోదు చేయడ చేయడంలో పోలీసులు కావాలనే జాప్యం చేశారని తెలిపారు. కేసును తప్పు దోవ పట్టించేందుకు… ఈ కేసులో హిందువు ఉన్నట్లు చిత్రీకరించేందుకు మొదటి ఎఫ్ఐఆర్ లో సూరజ్ అనే పేరు నమోదు చేశారన్నారు. పోలీసులు ఎమ్మెల్యే వాహనాన్ని సర్వీసింగ్ చేసి ఆధారాలన్నీ గల్లంతయ్యాయని నిర్దారణ చేసుకున్నాకే ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేయడంతోపాటు నిందితుల జాబితాలో చివరన చేర్చారని చెప్పారు. బీజేపీ ఉద్యమించడంవల్లే పోలీసులు ఈ మాత్రం స్పందించారని… లేనిపక్షంలో కేసును మూసేసేవారని పేర్కొన్నారు.

• బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, ఎమ్మెల్యే రఘు నందన్ రావు, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్ రావు, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్. ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధులు రాకేశ్ రెడ్డి, పాల్వాయి రజినీ, జె.సంగప్ప, రాణి రుద్రమదేవి, పోరెడ్డి కిషోర్, చందుపట్ల కీర్తిరెడ్డి లీగల్ సెల్ నాయకులు ఆంటోనీ రెడ్డి, కరుణాసాగర్ లతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పూర్తి పాఠం….

• జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో చివరి వరకు ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు ప్రయత్నించింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దోషులను కాపాడేందుకు కేసును నీరుగార్చింది. బీజేపీ ఆందోళన చేయడంవల్లే పోలీసులు ఈ మాత్రమైనా స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేతగానితనంవల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ఫాంహౌజ్ కే సీఎం పరిమితమయ్యారు. గత పక్షం రోజులుగా రోజుకో ఘటన వెలుగు చూస్తున్నా… పోలీసులు, ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా? సీఎం ఉన్నారా? … అనే అనుమానాలు కలుగుతున్నాయి.

• జూబ్లిహిల్స్ కేసులో పోలీసులు పరస్పర విరుద్దంగా మాట్లాడుతున్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం లేదని డీసీపీ జోయల్ డెవిస్ చెబితే… నిన్న పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాత్రం ఎమ్మెల్యే కొడుకుపైనా కేసు నమోదు చేశామని చెప్పారు.. ఆధారాలన్నీ గల్లంతు చేసిందుకు సర్వీసింగ్ చేసింది పోలీసులే. పూర్తి కాలయాపన చేసి ఆధారాలు దొరకకుండా నీరుగార్చి నిజమైన నిందితులను చివరి పేరులో చేర్చి చట్టానికి భిన్నంగా వ్యవహరించారు. ఈ కేసులో మెజిస్ట్రేట్ ఎదుట బాలిక స్టేట్ మెంట్ రికార్డు చేయాల్సినప్పటికీ సకాలంలో చేయలేదు.

• ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చి ఆదేశాల మేరకే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లను కాపాడేందుకు పోలీసులు కేసును నీరుగార్చారు. పైకి మాత్రం నిందితులకు 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందంటూ ప్రజలను నమ్మించేందుకు ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి రాష్ట్రాన్ని పంచుకున్నయ్… ఎంఐఎం నాయకులు అత్యాచారాలు చేస్తుంటే టీఆర్ఎస్ నాయకులు హత్యలు చేస్తున్నారు.

• ఈరోజు కూడా సిటీలో అత్యాచారం జరిగింది. 15 రోజులుగా నిత్యం ఇవే ఘటనలు జరుగుతున్నాయి. ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందిస్తామని… సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు పసిగడతాయని చెప్పిన కేసీఆర్ కొడుకు ఇప్పుడేమంటారు? రాష్ట్రంలో అత్యాచారాలు చేస్తే కళ్లు పీకేస్తామన్న కేసీఆర్ ఏమైండు? చూడటానికి కేసీఆర్ కే కళ్లు లేవు… ఇక దోషుల కళ్లేం పీకుతడు?

• కేసీఆర్ కుటుంబం స్పందిస్తే తప్ప పోలీసులు కదిలే పరిస్థితి లేదు… న్యాయస్థానాలు స్పందించి పోలీసులను శిక్షిస్తున్నారు. చివరకు పోలీసులు బలవుతున్నా మేల్కోవడం లేదు.

• జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం ప్రీ ప్లాన్ కుట్ర. బీజేపీ నాయకులు, లీగల్ సెల్ నాయకుల పోరాటంవల్లే కేసులు నమోదు చేశారు… బీజేపీ స్పందించకపోతే కేసును మూసేసేవారు. న్యాయం కోరుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘనందన్ రావులపై కేసు పెట్టే విషయంపై ఉన్న శ్రద్ద… మైనర్ బాలికపై అత్యాచారాలు జరుగుతుంటే కేసులు పెట్టడం లో ఎందుకు చూపడం లేదు?

• మొదటి ఎఫ్ఐఆర్ లో సూరజ్ అనే పేరు నమోదు చేసి హిందూవులు కూడా ఉన్నారనే భావన కలిగించాలని పోలీసులు కుట్ర చేశారు… బీజేపీ ఉద్యమించడంతో రెండో ఎఫ్ఐఆర్ లో ఆ పేరు తీసేశారు. క్రిమినల్స్ ను క్రిమినల్స్ లాగా చూడకపోవడంవల్లే ఈ దుస్థితి. తెలంగాణలో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణీంచాయి. ఇది పథకం ప్రకారం జరిగిన అత్యాచారం. వెంటనే సీబీఐ విచారణ జరపాలి..

LEAVE A RESPONSE