అత్యాచారానికి గురైన సిరిసిల్ల చిన్నారిని పరామర్శించిన బండి సంజయ్

– నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
సిరిసిల్ల జిల్లాలో గత నెల 27న టీఆర్ఎస్ నాయకుడి చేతిలో అత్యాచారానికి గురై నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల చిన్నారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రవీంద్రనాయక్, స్థానిక నేతలతో కలిసి బండి సంజయ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. పాప పొత్తికడుపులో నొప్పి వస్తోందని మెరుగైన చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు వేడుకోగా…. వారికి అండగా ఉంటామని, మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
‘‘గత నెల 27న 6 ఏళ్ల పాపపై టీఆర్ఎస్ నేత అత్యాచారం చేసి హత్య చేసేందుకు యత్నించిండ్రు. ఇది దుర్మార్గమైన సంఘటన. చివరి ఘడియలో పాప ప్రాణాలు కాపాడారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి ఆందోళన చేస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించలేదు. అభం, శుభం తెలియని పేద వర్గానికి చెందిన పాప బంగారు భవిష్యత్తును నాశనం చేసిన మూర్ఖులు ఈ టీఆర్ఎస్ నేతలు.
రాజకీయ పార్టీలు, నాయకులు ఆందోళన చేస్తే తప్ప రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు యధేచ్చగా జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారాన్ని కూడా చిన్న సంఘటనగా చిత్రీకరిస్తూ నిందితుడిని కాపాడే యత్నం చేస్తుండటం సిగ్గుచేటు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆదుకోవాలనే సోయిగానీ ఈ ప్రభుత్వానికి లేదు. చివరకు ఆ పాపను ఆసుపత్రికి తీసుకొస్తుంటే కూడా ట్రీట్ మెంట్ చేయొద్దు…ఇంటికి పంపాలని సీఎంఓ నుండి ఒత్తిళ్లు వస్తున్నాయి. కనీసం పాప ప్రాణాలు కాపాడాలనే ఆలోచనే టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు. టీఆర్ఎస్ నేతలు లైసెన్స్ గూండాలుగా మారారు. దోపిడీ, దొంగతనాలుసహా ఏదైనా చేయొచ్చనే వాతావరణం టీఆర్ఎస్ పాలనలో ఉంది.
అత్యాచారం, హత్య జరిగితే ఆ విషయాలు టీవీల్లో, మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలుగా వస్తే తప్ప స్పందించే స్థితిలో సీఎం కేసీఆర్ లేరు. పేద వర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ పిల్లలపై అత్యాచారాలు జరిగితే మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ జిల్లాకు చెందిన మంత్రి ఓ యువరాజు. కాబోయే సీఎం. ఆయన ఎక్కడుంటాడో ఆయనకే తెలియదు. పేదల ఉసురుపోసుకోవడం ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం మంచిది కాదు. బాధ్యులపై కఠినాతికఠిన చర్యలు తీసుకోవాలి. పేద కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు నిందితుడికి శిక్ష పడే వరకు పోరాడతాం.