Suryaa.co.in

Telangana

అంతర్జాతీయ వేదికల దృష్టికి బంగ్లాదేశ్ హిందువుల వెతలు

  • బంగ్లాదేశ్ హిందువులను అంతమొందించేందుకు పాక్ సాయుధబలగాలు
  • బెంగాల్, బీహార్, ఒడిషా రాష్ట్రాలను కూడా తీసుకుంటామని హెచ్చరికలు
  • బంగ్లాదేశ్ ప్రధాని మహ్మద్ యూనిస్ నోబెల్ బహుమతిని వెనక్కి తీసుకోవాలి
  • బంగ్లాదేశ్ హిందువులను భారత్ అనుమతించాలి, భారత సర్కారు సైనిక చర్య చేపట్టాలి
  • బంగ్లాదేశ్ హిందువులను రక్షించేందుకు అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు పెట్టడంతో పాటు UN fact finding teamని పంపాలి

బంగ్లాదేశ్ హిందువుల కొనసాగుతున్న నరమేధంపై అంతర్జాతీయ మానవహక్కుల దినం సందర్భంగా “మానవ హక్కుల సంస్థ” తెలంగాణ శాఖ మంగళవారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం ఆవేదనతో ప్రతిధ్వనించింది. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం తక్షణం మరింత చైతన్య కావలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, ప్రభుత్వంలో వివిధ హోదాలలో సేవలందించిన పూర్వ అధికారులు పాల్గొని బంగ్లాదేశ్‌లోని పరిణామాలకు సంబంధించిన చారిత్రక కారణాలు, తమ పరిశీలన-అనుభవాలు, నేటి పరిస్థితి, ప్రస్తుతం-భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యలు, పరిష్కారం దిశగా సూచనలు చేస్తూ అర్థవంతమైన చర్చ జరిపారు. భారత ప్రభుత్వంతో పాటు పౌర సమాజం చేపట్టవలసిన కార్యాచరణపై పలు అంశాలతో తీర్మానాన్ని ప్రతిపాదించారు.

రౌండ్ టేబుల్‌లో ముఖ్యవక్తలుగా పాల్గొన్న భారత హోంశాఖ పూర్వ కార్యదర్శి పద్మనాభయ్య చర్చను ప్రారంభించారు. ఆఫ్ఘనిస్తాన్, బర్మా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు ఒకనాడు భారత్‌లో భాగంగా ఉండేవని గుర్తు చేస్తూ పూర్వ ప్రధాని గుజ్రాల్ నేతృత్వంలోని ప్రభుత్వం “పొరుగు దేశాలకు ప్రాధాన్యత” అంటూ అనుసరించిన విధానం ఏ మేరకు విజయవంతమైందో నేటి పరిణామాలను చూసి మనమే గ్రహించాలన్నారు. సెక్యులర్ రాజ్యాంగం ఉన్నప్పటికీ ముస్లింలు అధికంగా ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువులకు తీవ్ర నష్టం జరిగిందని, మన దేశంలో కూడా ముస్లిం జనాభా వేగంగా పెరుగుతున్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. భారతదేశంలో UCCని వెంటనే అమలు చెయ్యాలని పద్మనాభయ్య స్పష్టం చేశారు. అమెరికా, ఐరోపా దేశాలు ప్రపంచవ్యాప్తంగా పెత్తనం సాగిస్తూ వస్తున్నాయని పేర్కొన్న పద్మనాభయ్య అసలు మానవహక్కులకు సంబంధించి ప్రపంచంలో సర్వే నిర్వహించి కామెంట్స్ చేసే అధికారం అమెరికాకు ఎక్కడిదని ప్రశ్నించారు.

అంధ్రభూమి పత్రిక పూర్వ సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు ఎంవిఆర్ శాస్త్రి మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో హింసాకాండకు ప్రధాన బాధ్యత ఆ దేశ ప్రధాని మహ్మద్ యూనిస్‌దేనన్నారు. లక్షలాది మంది హిందువులపై మారణకాండ జరుగుతుంటే మౌనంగా ఉన్న కమ్యూనిస్టుల వైఖరిని ఎండగట్టారు. భారత్‌లో మైనార్టీల రక్షణ గురించి సెనెట్‌లో పెద్ద చర్చ చేపట్టిన అమెరికా నేడు బంగ్లాదేశ్‌లో లక్షలాది హిందువులు ఊచకోతకు గురవుతుంటే మౌనంగా ఉందని, అక్కడ చనిపోయినవారు హిందువులు కానట్లయితే భారీ చర్చ చేసేవారని అగ్రరాజ్యం వైఖరిని దుయ్యబట్టారు. “Hindu lives don’t matter” అన్న తీరు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 1946లో జిన్నా పిలుపుతో జరిగిన డైరెక్ట్ యాక్షన్ డే… ఆ తర్వాత పాకిస్తాన్ పాలకుడు యాహ్యా ఖాన్ చేపట్టిన సెర్చిలైట్ ఆపరేషన్ హిందువులను దారుణాతి దారుణంగా బలిగొన్నాయని, నాడు ఢాకా యూనివర్సిటీలో 10 వేల మంది విద్యార్థుల ప్రాణాలు తీశారని శాస్త్రి గుర్తు చేశారు. బంగ్లాదేశ్ మారణకాండపై ఇంగ్లాండ్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో చర్చ జరగాలని ఆ దేశ ఎంపీలు కోరుతుండగా… మరోవైపు అమెరికా సెనెటర్ తులసీ గబార్డ్ బంగ్లాదేశ్ పరిణామాలను తీవ్రంగా ఖండించారని, అయితే భారత పార్లమెంటులో మాత్రం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్యలు జోకర్‌ని తలపిస్తున్నాయని మండిపడ్డారు. బంగ్లాదేశ్ హిందువులను కాపాడే క్రమంలో పాకిస్తాన్‌కు సైతం బుద్ధి చెప్పాలంటే 1971 నాటి పరిణామాల తరహాలోనే అక్కడ భారత్ జోక్యం చేసుకోవాలని, వారికి అర్థమయ్యే భాష అదేనని, అప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారమవుతుందని తేల్చి చెప్పారు.

సామాజిక కార్యకర్త, న్యాయవాది అయిన మోనికా ఆరోరా స్పందిస్తూ బంగ్లాదేశ్ పరిణామాలపై 4 నెలల పాటు తాము నిర్వహించిన నిజ నిర్ధారణ కార్యాచరణ నివేదికలోని అంశాలను రౌండ్ టేబుల్ ముందుంచారు. బంగ్లాదేశ్‌లో కేవలం పేదలు, బలహీన వర్గాల హిందువులపై మాత్రమే దాడులు జరుగుతున్నాయనుకోవడం సరికాదంటూ ఆ సమాజంలో మంచి సేవలతో పేరు ప్రఖ్యాతులు పొందిన లాయర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, వ్యాపారులైన హిందువులు, బంగ్లాదేశ్ పోలీస్, ఆర్మీలో ఉన్న హిందువులను సైతం ఊచకోతకు గురి చేస్తున్నారని తెలిపారు. దాడులకు పాల్పడినవారిలో బాధితుల ఇరుగుపొరుగువారు, బయటివారు అందరూ ఉన్నారని వివరాలందించారు. ప్రాణాలతో ఉండాలంటే మతం మారాలి లేదా లక్షలాది బంగ్లాదేశ్ కరెన్సీతో జిజియా (లంచం) కట్టాలని డిమాండ్ చేస్తూ బీఎన్‌పీ పార్టీ కార్యకర్తలు, జమాతే ఇస్లామీ తీవ్రవాదులు రేయింబవళ్లు హిందువులే లక్ష్యంగా వెంటాడున్నారని చెప్పారు. నిజనిర్ధారణ ప్రక్రియలో భాగంగా మోనికా బృందం బంగ్లాదేశ్‌లో మాట్లాడిన లాయర్లు, డాక్టర్లు, కళాకారుల అనుభవాలు, వేదనను, వారితో జరిగిన ఆవేదనా భరిత సంభాషణలను సభలో వెల్లడించారు. బంగ్లాదేశ్‌ని వీడిన మైనార్టీల ఆస్తుల స్వాధీనంతో పాటు ప్రస్తుతం ఉంటున్న మైనార్టీలు ఆస్తులు అమ్మడానికి వీల్లేకుండా, కనీసం బదలాయింపు చెయ్యకుండా వేధిస్తున్న ఆ దేశ చట్టాల క్రౌర్యాన్ని మోనికా వివరించారు. ప్రస్తుతం పాక్ సర్కారు సైతం బంగ్లాదేశ్‌తో జట్టు కట్టి ఆయుధాలు, బలగాల తరలింపు చేస్తోందన్నారు. బంగ్లాదేశ్ సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరించిన తస్లీమా నస్రీన్ లజ్జ నవల ఎంత సంచలనం సృష్టించిందో వెల్లడిస్తూ హైదరాబాదులో సైతం తస్లీమాపై జరిగిన దాడుల ఘటనను గుర్తు చేశారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కేవలం మైనార్టీల రక్షణకు డిమాండ్ చేసినందుకే అరెస్ట్ చేశారని, అందులో భాగంగా మైనార్టీలకు ఒక మంత్రిత్వశాఖ, మైనార్టీల కేసుల విచారణకు ట్రిబ్యునల్, దుర్గాపూజకు అనుకూల వాతావరణం, మైనార్టీలకు గౌరవప్రదమైన జీవనం కోరారని మోనికా వివరించారు. చిట్టగాంగ్ సమావేశంలో బంగ్లాదేశ్ జెండాని తక్కువ ఎత్తులో ఉంచారంటూ చిన్నయ్ పై దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పారు.

ప్రజ్ఞాభారతి ఛైర్మన్ హనుమాన్ చౌదరి స్పందిస్తూ ఇస్లామిక్ సమాజంలో ముస్లిమేతరులకు మానవహక్కులు లేవన్నారు. 62 సభ్యదేశాలున్న OIC ఇదే విషయాన్ని ఎప్పుడో బహిరంగంగా స్పష్టం చేసినట్లు ఆయన గుర్తు చేస్తూ క్రీ.శ 623, 624 సంవత్సరాలలో మహ్మద్ ప్రవక్త ఉన్న కాలంలో యూదులకు ఇవే పరిస్థితులు ఎదురయ్యాయని, ఆ తర్వాత కాశ్మీర్‌లోను ఆ పరిస్థితులో పునరావతృతమయ్యాయని తెలిపారు. 1946లో నౌఖాలీలో మొదలైన మారణకాండ నిరాటంకంగా కొనసాగుతూనే ఉందని హనుమాన్ చౌదరి ఆవేదన వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ పరిణామాల నడుమ అక్కడి హిందువులందరినీ భారత్‌లోకి అనుమతించేలా జనాభా మార్పిడి జరగాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం ఇదే అంశాన్ని లేవనెత్తారని తెలియజేస్తూ బల్గేరియా పరిణామాలను సభకు వివరించారు. బంగ్లాదేశ్ మారణకాండపై ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ కోర్టు దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఇక హైదరాబాదులో అక్రమ కట్టడాల కూల్చివేతకు ఉద్దేశించిన హైడ్రా ముస్లింలవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఎత్తి చూపారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పందిస్తూ బంగ్లాదేశ్ హిందువుల విషయంలో భారతదేశం వ్యక్తం చేసిన ఆందోళనపై అది తమ ఆంతరంగిక విషయమంటూ బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి జషిముద్దీన్ చేసిన వ్యాఖ్యల వెనుక అంతరార్ధాన్ని గుర్తించాలని హెచ్చరించారు. ఇది చాలక భారత్‌లోని బెంగాల్, బీహార్, ఒడిషా రాష్ట్రాలను కూడా తీసుకుంటామని బంగ్లాదేశ్‌లోని బీఎన్‌పీకి చెందిన వ్యక్తులు చేసిన హెచ్చరికల వెనుక ఎవరున్నారో గ్రహించాలన్నారు.

సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్ మాట్లాడుతూ హిందువులపై జరుగుతున్న మారణకాండ యావత్ ప్రపంచానికీ చేరాలని ఆకాంక్షించారు. ఇందుకోసం పలు అంశాలతో కూడిన కార్యాచరణను అనుసరించాలన్నారు. అవి… 1. దేశరాజధాని ఢిల్లీలో ధర్మాచార్యులతో సభ 2. బంగ్లాదేశ్ హిందువుల భవిష్యత్తు ప్రపంచంలోని హిందువుల భవిష్యత్తు అని గ్రహించేలా భారత రాష్ట్రపతితో ప్రకటన చేయించడం 3. హిందువుల వేదనను తెలియజేసేలా వీలైనన్ని దేశవ్యాప్తంగా ఏకకాలంలో ర్యాలీలు జరగాలి 4. యువతరం స్పందించకుంటే వారి కుటుంబాలు దానికి మూల్యం చెల్లించుకోవాలనే సందేశం వెళ్లాలి.

రౌండ్ టేబుల్‌లో భాగంగా మాట్లాడిన పలువురు వక్తలు హిందువులు మరింత చైతన్యవంతులు కావాలని, 2047 నాటికి భారత్ ఇస్లామీకరణ పేరిట PFI విడుదల చేసిన పత్రం, 15 నిమిషాలు పోలీసులు పక్కన ఉంటే సత్తా చూపిస్తామంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు, కాశ్మీర్ సహా బెంగాల్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలలోని పరిణామాలను గుర్తు చేసి హిందువులను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.

చివరిగా కింద తెలిపిన అంశాలతో కూడిన తీర్మానాన్ని రౌండ్ టేబుల్ ప్రతిపాదించింది….

1. బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న మారణకాండ, మైనార్టీల మానవహక్కుల ఉల్లంఘనకు శాశ్వతంగా ముగింపు పలికేలా భారత ప్రభుత్వం వెంటనే అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి.

2. బంగ్లాదేశీయులు ఆ దేశంలోని హిందువులపై కొనసాగిస్తున్న మారణకాండ, మైనార్టీల మానవహక్కుల ఉల్లంఘనకు శాశ్వతంగా వెంటనే ముగింపు పలికేలా ఒత్తిడి తెచ్చే విధంగా భారత ప్రభుత్వం ఈ విషయాన్ని UN Human rights commission సహా అన్ని అంతర్జాతీయ వేదికలపైనా లేవనెత్తాలి.

3. భారత్‌లోను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధ్యతగల పౌర సమాజం యావత్తూ బంగ్లాదేశ్ హిందువులపై కొనసాగుతున్న మారణకాండ, మైనార్టీల మానవహక్కుల ఉల్లంఘనకు శాశ్వతంగా వెంటనే ముగింపు పలికేలా బంగ్లాదేశీయులపై ఒత్తిడి తీసుకురావాలి. బంగ్లాదేశ్‌లోని హింసాకాండను ముగించేందుకు గాను ఆ దేశంలోని పౌర సమాజ వర్గాలతో సంప్రదింపులు జరపాలి.

4. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మహ్మద్ యూనస్‌కి గతంలో ప్రదానం చేసిన నొబెల్ బహుమతిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.

5. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లోని హిందువులు, ఇతర మైనార్టీలు భారతదేశంలో వేగంగా పౌరసత్వం పొందేలా తేదీలకు సంబంధించిన నియంత్రణలను మార్చుతూ CAAను సవరించాలి లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ భారతదేశ పౌరసత్వాన్ని అందించే విధంగా ఇజ్రాయెల్ తరహా విధానాన్ని అమలు చెయ్యాలి.

6. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులపై భవిష్యత్తులో ఏ విధమైన హింస జరుగకుండా నిరోధించేలా తీసుకోవలసిన చర్యలను సిఫారసు చేసి ఈ సమస్యను మొగ్గలోనే తుంచివెయ్యాలి.

7. బంగ్లాదేశ్‌లో ఇప్పటికే అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చేసి వారి రక్షణకు హామీ ఇవ్వాలి.

8. ప్రపంచవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న హింసకు శాశ్వతంగా ముగింపు పలికేలా దీర్ఘకాల, స్వల్పకాల పరిష్కారాలపై దృష్టి సారించాలి.

LEAVE A RESPONSE