Suryaa.co.in

Andhra Pradesh

బాపట్ల జిల్లాకు ఎన్‌.జి. రంగా పేరు పెట్టాలి

13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను 26 జిల్లాలుగా విభజిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలకు అనేక మంది ప్రముఖుల పేర్లు పెడుతున్నారు. కానీ ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, రైతు బంధు, ప్రముఖ విద్యావేత్త, దేశభక్తులు ఎన్‌.జి. రంగా గారి పేరు పరిశీలనలోకి తీసుకోకపోవడం బాధాకరం.
ఆచార్య ఎన్‌.జి. రంగాగా ప్రసిద్ధులైన గోగినేని రంగనాయకులు గొప్ప స్వాతంత్య్ర సమరయోధులు. రైతాంగ నాయకుడు. ఈయనను భారత రైతాంగ ఉద్యమ పితామహునిగా భావిస్తారు. రంగా గారు 1930 నుంచి 1991 వరకు అతి సుధీర్ఘకాలం పార్లమెంట్‌ సభ్యునిగా పనిచేశారు. 1926లో ఈయన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో బి.లిట్‌ పొంది, భారత్‌కు తిరిగి వచ్చి మద్రాస్‌లోని పచ్చయ్య కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా పనిచేసిన గొప్ప విద్యావేత్త ఈయన.

1930లో మహాత్మాగాంధీ పిలుపునకు స్పందించి రంగా గారు తన ఉద్యోగాన్ని వదలి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఈయన ఆరు సార్లు జైలు శిక్ష అనుభవించారు. 1930లో తొలిసారి ఢిల్లీ కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1950-52 మధ్య భారత రాజ్యాంగ పరిషత్‌ సభ్యులతో ఏర్పడ్డ తొలి పార్లమెంట్‌లో రంగాగారు సభ్యులుగా పాల్గొన్నారు. భారత రాజ్యాంగ రచనలో అనేక అమూల్యమైన సలహాలు, సూచనలు చేశారు. 1933లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వం వహించారు. 1936లో స్వామి సహజానంద సరస్వతితో కలిసి భారతీయ కిసాన్‌ సభను స్థాపించారు.

జమిందారీ వ్యవస్థపైన అలుపెరగని పోరాటం చేశారు. రైతాంగ ఆర్థిక పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపారు. గ్రామీణుల కొరకు ‘వాహిని’ అనే వార పత్రికను 1936లో ప్రచురించడం మొదలు పెట్టారు. రంగా గారు 1946లో కోపెన్‌ హెగెన్‌లో జరిగిన ఫుడ్‌ అండ్‌ ఆర్గనైజింగ్‌ సదస్సులో, 1948లో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సదస్సులో, 1954లో న్యూయార్క్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ పెజంట్‌ యూనియన్‌లోనూ, 1957లో బల్గేరియా రైట్స్‌ సదస్సులోనూ పాల్గొన్నారు. నెహ్రూ విధానాలను వ్యతిరేకిస్తూ చక్రవర్తి రాజగోపాలాచారి, మీనూమాసాని, కెఎన్‌ మున్షిలతో కలిసి స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేశారు.

రంగా గారు రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసి ఎందరినో ప్రజానాయకులుగా తీర్చిదిద్దారు. గౌతు లచ్చన్న, పాతూరి రాజగోపాల్‌ నాయుడు, ఎడ్లపాటి వెంకటరావు, ప్రగడ కోటయ్య, శంకర సత్యనారాయణ, కొణిజేటి రోశయ్య, తెన్నేటి విశ్వనాథం, నారా చంద్రబాబు నాయుడు వంటి రాజకీయ ఉద్దండులు రంగా శిష్యులు. రైతాంగానికి వీరు చేసిన విశిష్ట సేవలకు పురస్కారంగా ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాన్ని ఆచార్య ఎన్‌.జి. రంగా విశ్వవిద్యాలయంగా 1997లో తెలుగుదేశం ప్రభుత్వం నామకరణం చేసి ఆయనను గౌరవించింది. 1991లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ఇచ్చింది. భారతీయ తపాలా శాఖ వారు 2001లో ఒక ప్రత్యేక స్మారక తపాలా బిళ్లను రంగా గారిపై విడుదల చేశారు.

ఈ విధంగా తన జీవితం మొత్తం ప్రజా సేవకు అంకితం చేసిన మహనీయులు రంగా గారు. ప్రజాభ్యుదమే తన జీవిత ధ్యేయంగా ఆయన జీవించారు. ఇంతటి సుధీర్ఘరాజకీయ జీవితం కలిగి ప్రజలతో మమేకమైన నేత తెలుగువారిలో మరెవరూ లేరు. చరిత్ర మరవని నేత రంగా గారు. ఈయన బాపట్ల దగ్గర నిడుబ్రోలులో జన్మించారు. ఇటువంటి మహనీయుని పేరు బాపట్ల జిల్లాకు పెడితే ఆయనను సముచిత రీతిలో సత్కరించినట్లవుతుందని నేను భావిస్తున్నాను.

దయచేసి నా ఈ విన్నపాన్ని పరిశీలించవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. బాపట్లకు రంగా గారి పేరు పెట్టడానికి మద్దతు ఇవ్వలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

katragadda-prasuna
– కాట్రగడ్డ ప్రసూన, ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ,తెలంగాణ రాష్ట్రం.

LEAVE A RESPONSE