– రవ్వలకొండ అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోండి
– టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు
రాష్ట్రంలో గనులు, ఖనిజ వనరులను తమవారికి కట్టబెట్టేందుకు గనులను వేలం పద్ధతిలో కేటాయించేలా ప్రభుత్వం నూతన ఈ-ఆక్షన్ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఈనెల 14వతేదీన జి.ఓ. నెం. 14లను విడుదల చేసింది.
నూతన జిఓ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఇకపై నూతనంగా కేటాయించే గనులన్నింటినీ ఈ-ఆక్షన్ విధానంలోనే కేటాయిస్తారు. దీనివల్ల దశాబ్ధాల తరబడి మైనింగ్ ఆధారపడిన చిన్న మైనింగ్ దారులు, ఆయా గనుల్లో పనిచేసే వేలాదిమంది కార్మికులను ప్రభుత్వం రోడ్డున పడేసేందుకు పూనుకోవడం దుర్మార్గం.
ఇప్పటికే మైనింగ్ చేస్తూ కాలపరిమితి పూర్తయి రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుని ఉన్న గనులను కూడా ఈ-వేలం పరిధిలోకి తెస్తామని చెప్పడం అధికారపార్టీ నియంతృత్వ పోకడకు నిదర్శనం. బ్రహ్మంగారు కాలజ్జానం రాసిన రవ్వలకొండ పరిసరాల్లో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు భారీఎత్తున బ్లాస్టింగ్ నిర్వహిస్తూ అక్రమమైనింగ్ చేస్తున్నారు.
అక్రమ మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని పరిశీలిస్తే ఇందుకు సర్కారు పరోక్ష సహకారం అందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి అధికారులు రవ్వలకొండ సమీపంలో అన్ సర్వేయ్డ్ హిల్ బ్లాక్ పేరుతో మైనింగ్ లీజులు ఇచ్చారు. టిడిపి ప్రభుత్వ హయాంలో రవ్వలకొండ వద్ద అక్రమ మైనింగ్ పై పలు కేసులు నమోదు చేశారు.
వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని మాఫీ చేయించారు. క్వారీ పనులను తిరిగి హుటాహుటిన మొదలుపెట్టారు. సంబంధిత 3.002 హెక్టార్లతో పాటు ఆనుకుని ఉన్న రవ్వలకొండలోని ఎక్స్ టెన్షన్ 1.910 హెక్టార్లనూ తవ్వేస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రచించిన రవ్వలకొండలోని గుహలకు 500 మీటర్ల దూరంలోపు మైనింగ్ జరపకూడదన్న నిబంధనలను అక్రమార్కులు తుంగలో తొక్కుతున్నారు. భారీగా ఎక్స్వేటర్లను మోహరించి ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రవ్వలకొండలో అక్రమ మైనింగ్ ను నిలిపివేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.