బీసీ మంత్రులు.. బడ్జెట్ లో కేటాయింపులపై చర్చకు వచ్చే దమ్ముందా?

0
11

– బడ్జెట్ లో కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేదు
-మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్

వేణుగోపాల్ కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్ ఇతర బీసీ మంత్రులు.. బడ్జెట్ లో కేటాయింపులపై చర్చకు వచ్చే దమ్ముందా? అని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సవాల్ విసిరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నేడు రాష్ట్రంలో జగన్ రెడ్డి కేబినెట్ లోని మంత్రులు సజ్జల ఇచ్చిన స్రిప్ట్ ని చదవుతున్నారే తప్ప మరొకటి లేదు. బీసీలు రాష్ట్రానికి వెన్నుముక అని చెప్పే మంత్రులకు వెన్నుమొకలేదని తెలుస్తోంది. బిసిలకు సంబంధించిన మంత్రుల ప్రకటనలు చూస్తుంటే మతిపోతోంది. వారిది ఉత్తుత్తి ఆర్భాటం తప్ప మరొకటికాదు. బీసీల్లో ఎక్కడ చూసినా నిస్పృహే కనపడుతోంది.

జగన్ రెడ్డి అథికార, అహంకార మదంతో వ్యవహరిస్తున్నారు. బిసిలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు, రాష్ట్రానికి బ్యాక్ బోన్ అని అన్న జగన్ నేడు నయవంచన మాటలు మాట్లాడుతున్నారు. బిసిలకు వున్న వెన్నుమొకను లేకుండా చేస్తున్నారు. జగన్ రెడ్డి పరిపాలన విధానం అస్తవ్యస్తంగా వుంది.

వైసీపీ చెల్లుబోయిన గోపాలకృష్ణ మాట్లాడిన మాటలు ఎక్కడ చెల్లుబాటు కావు. కేబినెట్ లో బిసిలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ఎంత మందికి ఇచ్చారు? అధికారిక పదవులు, కార్పొరేషన్ పదవులు, సలహాదారు పదవులు 730 మంది రెడ్ల సామాజిక వర్గానికి ఇచ్చి అక్కడక్కడ అరకొరగా బిసి పదవులు ఇచ్చారు. అదేనా బిసిలకు అధికారం కల్పించడమంటే, న్యాయం చేయడమంటే?

చెల్లుబోయిన గోపాలకృష్ణ కాదు.. చెల్లనటువంటి గోపాలకృష్ణ. సీఎం రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి, నాలుగు ప్రాంతాలను నలుగురు రెడ్లకి అప్పజెప్పారు. ఉత్తారాంధ్ర జిల్లాలని ఒక రెడ్డికి, తూర్పు, వెస్ట్ గోదావరి జిల్లాలలో మిథున్ రెడ్డిని కాదని ఏమైనా చేయగలరా వేణుగోపాల్ కృష్ణ? మీరు మాటలకు తప్ప చేతలకు పనికిరారు. జగన్ రెడ్డి మంత్రివర్గంలోని వారంతా అసమర్థులు. వారికి జగన్ మాటలకు వత్తాసు పలకడానికి నోరెలా వస్తుంది? బీసీ మంత్రులకు తాము బిసి అని చెప్పుకోవడానికి సిగ్గనిపించడం లేదా? మంత్రి పదవులు కట్టబెట్టినంత మాత్రాన బిసిలలో ఆత్మ స్ధైర్యం, ఆత్మ గౌరవం రాదు. బిసిలకు కావాల్సిన మనో ధైర్యాన్ని ప్రభుత్వం నుంచే అందించే కార్యక్రమాలను చేయాలి.

చంద్రబాబు నాయుడు బిసిలకు వెన్నుపోటు పొడిచారనడం సమంజసంకాదు. ఏరకంగా చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచారో చెప్పాలి. రాష్ట్రంలో 34శాతం రిజర్వేషన్లను కల్పించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. రాజకీయ అధికారాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గొప్ప వారా? లేక రిజర్వేషన్లలో 10శాతం తగ్గించి 6,800 రాజకీయ పదవులను బిసిలకు దూరం చేసిన జగన్ రెడ్డి గొప్పవారా?

మీరు నిజమైన బిసి అయితే బిసి కులాల మీద అభిమానం ఉంటే, బిసి ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలనే ఆలోచన మీకుంటే వాస్తవాలు మాట్లాడాలి. నేడు చంద్రబాబు నాయుడు, లోకేష్ ని తిడితే మీ మంత్రి పదవులు నిలబడతాయి అనుకుంటున్నారు. బిసిలమని బిసిలకు వెన్నుపోటు పొడవద్దు. కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫీజు రియింబర్స్ మెంటుతో బిసి పేద విద్యార్ధులకు చాలా పెద్ద చదువులు చదివించాం అంటున్నారు. అతను మంత్రి కాక ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 16,40,000 మందికి ఫీజు రియింబర్స్ మెంటు సౌకర్యం కల్పించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంత మందికి ఫీజు రియింబర్స్ మెంటు సౌకర్యం కల్పిస్తున్నారు? కేవలం 10లక్షల మందికి కల్పించి 6లక్షల 40వేల మందికి ఫీజు రియింబర్స్ మెంటు ఎగ్గొట్టారు. రాష్ట్రంలో ఫీజు రియింబర్స్ మెంటుని ఎగ్గొట్టింది వాస్తవం కాదా? పెద్ద చదువులు అంటే ఇంటర్మిడియటా, డిగ్రీనా? పీజి పెద్ద చదువు కాదా? పిజి విద్యార్థులకు పీజు రియింబర్స్ మెంటు ఎగ్గొట్టి, నిలుపుదల చేసి మోసం చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం కాదా?

ఎవరు బిసిల కోసం పాటుపడ్డారో అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిన ప్రకటనలు చెబుతున్నాయి. మీ సాక్షిపత్రికలో ప్రచురించిన ప్రకటనలు దానికి అద్దం పడుదున్నాయి. ఇంగ్లీష్ మీడియంను అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాన్సెప్ట్ స్కూళ్ళని తీసుకొచ్చారు. ఇంగ్లీషు మీడియంని హైస్కూల్ స్ధాయిలో ప్రవేశ పెట్టారు. ఇంగ్లీషు, తెలుగు రెండు బాషలలో చదువుకునేలా చేశారు. తల్లి బాషను విడువ కూడదని, ఎవరు ఏది కోరుకుంటే ఆ బాషలో చదువుకొనే రీతిలో కాన్సెప్ట్ స్కూళ్ళని పెట్టారు. ఇంగ్లీషుని ప్రవేశ పెట్టి ఆసక్తి వున్నవారికి సహకారమందించారు. వైసీపీ నాయకులు కళ్ళున్న గుడ్డి వారుగా మారారు కాబట్టే వాస్తవాలను, అవస్తావాలను గుర్తించలేకున్నారు.

బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదంటున్నారు. చంద్రబాబు నాయడు జగన్ రెడ్డిలా మోసపు మాటలు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు హయాంలో 2014-2015 లో ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో 40శాతం డబ్బుల్ని రెవెన్యూ ప్లస్ ఎక్సపెండిచర్ కింద కేవలం బిసిలకు ఖర్చు చేశారు. 2015-2016లో 29శాతం, 2016-2017లో 32శాతం, 2017-2018లో 28శాతం ఖర్చు పెట్టారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి 2019-2020లో వైసీపీ బిసిల కోసం 28శాతం ఖర్చు చేసింది. 2020-2021లో రాష్ట్రంలో అధిక అప్పులు చేసి బిసిల కోసం ఖర్చు చేసింది కేవలం 26శాతం. 2021-2022లో 26 శాతం ఖర్చు చేశారు.

బిసిల అభ్యున్నతి కోసం, వాళ్ళ చదువుల కోసం, ఉపాధి ఉద్యోగాల కోసం పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దీన్ని రాష్ట్రంలో ఉన్న బిసిలు, దళితులు గమనించాలి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపు భవన్ కు బడ్జెట్ లో రూ.20 కోట్లు పెడితే వైసీపీ ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టలేదు. వేణుగోపాల్ కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్ ఇతర బీసీ మంత్రులు బడ్జెట్ లో కేటాయింపులపై చర్చకు వస్తారా? బడ్జెట్ లో కేటాయింపులకి, ఖర్చు పెట్టడానికి పొంతన లేదు. ఏ బీసీ కులానికీ న్యాయం జరగలేదని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తేల్చి చెప్పారు.