బీసీల ద్రోహి చంద్రబాబునాయడు

-వారికి ఆయన ఏనాడూ న్యాయం చేయలేదు
-బీసీలను నమ్మించి మోసం చేసిన తెలుగుదేశం పార్టీ
-డిప్యూటీ సీఎం, (పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు

బీసీల ద్రోహి చంద్రబాబు:
బీసీలను ఓటు బ్యాంక్‌గా వాడుకుని వదిలేసిన చంద్రబాబు, ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం రజకులకు నాలుగు ఇస్త్రీ పెట్టెలు, నాయీ బ్రాహ్మణులకు కత్తెరలు, శెట్టి బలిజ, గీత కార్మికులకు మోకులు ఇవ్వటం తప్ప బీసీలకు చంద్రబాబు ఏం చేశారు?. బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు ఇస్తామని 2014 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు, ఆ 5 ఏళ్లలో ఏమీ ఇవ్వకుండా మోసం చేశారు.

మహానేత హయాంలో..:
బీసీలకు తొలుత న్యాయం జరిగింది ఆనాడు మహానేత వైయస్సార్‌ హయాంలోనే. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాల ద్వారా ఆయన బీసీలతో పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కూడా ఆదుకున్నారు. పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఆయన పని చేశారు. నిరుపేద కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు చదివితేనే వారి బతుకులు మారుతాయని ఆయన గట్టిగా నమ్మారు. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేశారు. అలాగే సామాన్యులు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందేలా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. మరి ఏనాడైనా చంద్రబాబు ఆ కోణంలో ఆలోచించారా? కనీసం ఒక్కటైనా అమలు చేశారా?.

ఇప్పుడు ఎన్నెన్నో పథకాలు:
ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో నిరుపేదల కష్టాలు స్వయంగా చూసిన సీఎం వైయస్‌ జగన్, వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను బడికి పంపిస్తే, తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమ చేస్తూ అమ్మ ఒడి పథకం. పూర్తి ఫీజు చెల్లిస్తూ విద్యాదీవెన, హాస్టల్‌ ఖర్చులు ఇస్తూ వసతి దీవెన, పిల్లలకు పుస్తకాలు షూస్, నోట్‌ బుక్స్‌ ఇస్తూ విద్యాకానుక, డ్వాక్రా మహిళలకు ఆసరా, నిస్సహాయ అక్కచెల్లెమ్మలకు చేయూత వంటి పథకాలను దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. కోవిడ్‌ కష్టకాలంలో కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా అమలు చేసి, ఆయా కుటుంబాలకు కొండంత అండలా నిల్చారు.

బీసీలకు రాజకీయంగా..ఆర్థికంగా..:
బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలుస్తూ, వారికి అన్ని పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏకంగా నలుగురు బీసీలను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారు. ఆయన ఏనాడైనా ఇలా ఒక్కరినైనా రాజ్యసభకు పంపారా?
బీసీల సంక్షేమం కోసం ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు, బీసీల్లో మొత్తం కులాలు, ఉప కులాలను తెలుసుకోవడం కోసం అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
నిరుపేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు సీఎం వైయస్‌ జగన్‌ ఇన్ని చేస్తున్నారు కాబట్టే, 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైయస్సార్‌సీపీకి ప్రజలు అఖండ విజయాన్ని అందిస్తున్నారు. చివరకు కుప్పంలో స్థానిక ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఓడించారు. దీంతో చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు.

ఆనాడు చెప్పులు.. ఇప్పుడు దైవం:
ఆనాడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, ఆయన నుంచి ముఖ్యమంత్రి పదవి లాక్కున్న చంద్రబాబు, చివరకు ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించాడు. అలా ఎన్టీఆర్‌పై చెప్పులేసిన ద్రోహి చంద్రబాబు. అలాంటి చంద్రబాబు ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్‌ను దేవుడు అంటున్నారు.
చివరకు ఆరోజు స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడు కూడా ఎన్టీఆర్‌కు ద్రోహం చేశారు. సభలో మాట్లాడేందుకు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. నిర్దాక్షిణ్యంగా మైక్‌ కట్‌ చేశారు. ఇప్పుడు అదే ఎన్టీఆర్‌ బొమ్మ కనిపించకపోతే టీడీపీకి ఓట్లేయరని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు.
తనకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదని చంద్రబాబుకు తెలుసు. కుప్పంలో పోటీ చేసే శక్తి, సామర్థ్యం కూడా ఆయనకు లేవు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు గల్లంతు అవుతాయి. ఇది ఖాయం.. అని డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు స్పష్టం చేశారు.

Leave a Reply