– టీఎంసీ కోటను బద్దలు కొట్టిన కాషాయదళం
– ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయ.
– హిందూ ఓటు బ్యాంక్ ఏకీకరణ
– సిఏఏ అమలు అంశాలే అస్త్రాలు
– లెఫ్ట్, కాంగ్రెస్ బలహీనతతో పుంజుకున్న కాషాయదళం
(ఇస్కా రాజేష్)
బెంగాల్ రాజకీయాల్లో చరిత్రాత్మక మలుపు తిరిగింది. 15 ఏళ్ల పాటు అఖండ ఆధిపత్యంతో కొనసాగిన తృణమూల్ కాంగ్రెస్‌కు చెక్ పెడుతూ బీజేపీ ఘన విజయం సాధించింది. ‘మా, మాటీ, మానుష్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఎంసీ, అదే ప్రజల మధ్య విశ్వాసం కోల్పోయి ఓటమిని చవిచూసింది.
2021లో చేజారిన అవకాశాన్ని 2026లో బీజేపీ భారీ మెజారిటీతో అందిపుచ్చుకుని బంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఉన్నతస్థాయి వరకు టీఎంసీ నాయకులపై అవినీతి ఆరోపణలు బంగాల్లో బీజేపీ ప్రభంజనానికి ప్రధాన కారణం టీఎంసీ ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకత.
15 ఏళ్ల పాలనలో కింది స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి.
ముఖ్యంగా స్కూల్ సర్వీస్ కమిషన్ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం, రేషన్ పంపిణీ లోపాలు, బొగ్గు, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. కొందరు మంత్రులు, కీలక నేతల ఇళ్లలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం కావడం, మధ్యతరగతి, చదువుకున్న వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ వ్యతిరేకతను బీజేపీ సమర్థంగా తనవైపు తిప్పుకోవడంలో సఫలమైంది.
సందేశ్‌ఖాలీలో మహిళలపై అకృత్యాలు సాగించిన టీఎంసీ స్థానిక నేతలు
మమతా బెనర్జీకి అండగా నిలిచే మహిళలు ఈ ఎన్నికల్లో మాత్రం దూరమయ్యారు. సందేశ్‌ఖాలీ ఘటనల్లో మహిళలపై జరిగిన దాడులు, భూకబ్జాల ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
అలాగే కోల్‌కతాలో ఆర్.జి.కర్ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలి హత్యాచార ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు విమర్శలకు దారి తీసింది. మహిళల భద్రతలో ప్రభుత్వం విఫలమైందన్న భావన బలపడింది. ‘లక్ష్మీ భండార్’ వంటి పథకాలు ఉన్నప్పటికీ, ఈ అసంతృప్తి మహిళలను బీజేపీ వైపు మళ్లించింది.
హిందూ ఓటు బ్యాంక్ ఏకీకరణతో రాజకీయంగా బీజేపీకి లాభం
రాజకీయంగా బీజేపీకి లాభించిన మరో కీలక అంశం హిందూ ఓటు బ్యాంక్ ఏకీకరణ. టీఎంసీ మైనార్టీలను ప్రసన్నం చేసుకునే రాజకీయాలు చేస్తోందన్న బీజేపీ ప్రచారం గ్రామీణ స్థాయిలో బలంగా చొచ్చుకుపోయింది. పౌరసత్వ సవరణ చట్టం అమలు ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మతువా సమాజం, ఇతర శరణార్థుల్లో బీజేపీపై విశ్వాసాన్ని పెంచింది.
నదియా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పౌరసత్వం కల నెరవేరుతుందన్న ఆశ బీజేపీకి ఓటు బ్యాంక్‌గా మారింది. అదే సమయంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపింది. నకిలీ ఓట్ల తొలగింపు, పారదర్శకత పెంపు వల్ల నిజమైన ఓటర్లే పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో నమోదైన ఓటింగ్ శాతం మార్పుకు సంకేతంగా నిలిచింది.
టీఎంసీ ని ఓడించే ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని భావించిన ప్రజలు ప్రతిపక్ష పార్టీల బలహీనత కూడా బీజేపీకి కలిసి వచ్చింది. వామపక్షాలు, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయాయి. టీఎంసీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు ఈ పార్టీలకు కాకుండా నేరుగా బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఫలితంగా ప్రతిపక్ష ఓటు చీలిక జరగకుండా బీజేపీకి ఏకపక్ష లాభం దక్కింది.
టీఎంసీని ఓడించగల ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న భావన ప్రజల్లో బలపడింది. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం కూడా బీజేపీకి మేలు చేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందన్న సందేశాన్ని బలంగా తీసుకెళ్లింది. ప్రధాని నరేంద్ర మోదీ పలు సభల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధిని బంగాల్‌తో పోల్చుతూ చేసిన ప్రసంగాలు ఓటర్లపై ప్రభావం చూపాయి.
గతంలో కంటే ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ
బంగాల్లో బీజేపీ నాయకత్వం ఈసారి గతంలో కంటే ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. విపక్ష నేత సువేందు అధికారి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేశారు. ఒకప్పుడు టీఎంసీలో కీలక నేతగా ఉన్న ఆయన, ఆ పార్టీ బలహీనతలను బాగా అర్థం చేసుకుని వ్యూహాలు రచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ నాయకత్వం బూత్ స్థాయి వరకు పర్యవేక్షణ చేయడం పార్టీ యంత్రాంగాన్ని చురుకుగా మార్చింది.
ప్రధాని మోదీ స్వయంగా ప్రచారంలో పాల్గొని కేడర్‌లో ఉత్సాహాన్ని పెంచారు. మమతా బెనర్జీ లక్ష్యంగా మోదీ చేసిన భావోద్వేగ ప్రసంగాలు కాషాయ క్యాడర్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. మొత్తం మీద ప్రజా వ్యతిరేకతను అంచనా వేయడంలో టీఎంసీ విఫలమైంది. అవినీతి కుంభకోణాలు, మహిళల భద్రతపై ఆందోళనలు తృణమూల్ ఓటమికి ఒక ఎత్తైతే క్షేత్ర స్థాయిలో పక్కా వ్యూహంతో అడుగులు వేయడం బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని అందించింది.