పేదోడికి ఖరీదైన వైద్యం అందుబాటులోకి తెచ్చిన మహానేత వైఎస్ఆర్
వైఎస్సార్ స్ఫూర్తితో రాష్ట్రంలో మరింత మెరుగ్గా వైద్య సేవలు
వైకాపాలో వైద్యులకు ప్రాధాన్యత
ఎంపీ విజయసాయిరెడ్డి
నరసరావుపేట, నవంబర్ 20: ఆరోగ్యశ్రీ పథకంతో పేదోడికి ఖరీదైన వైద్యం అందుబాటులోకి తెచ్చి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న మహా నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన స్ఫూర్తితో సీఎం జగన్ వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణ చేపట్టి, ప్రజలు మరింత మెరుగైన వైద్యం అందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ కోస్తా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి అన్నారు.
సామాజిక సాధికార యాత్రలో భాగంగా సోమవారం నరసరావుపేటలో వైద్యులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో అత్యంత గౌరవ ప్రదమైన వృత్తి వైద్యంగా ప్రజలందరూ భావిస్తారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైద్యులకు అధిక ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. వైయస్సార్ పార్టీలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇలా 15 మంది వైద్యులు ఎమ్మెల్యేలుగా ఉన్నారని గుర్తుచేశారు.
గతంలో పేదవారికి ఖరీదైన వైద్యం అందని ద్రాక్షలా ఉండేదని, వైద్యానికి డబ్బుల్లేక, మరణించిన సందర్బాలు ఉండేవని అన్నారు. వైద్యానికి డబ్బులు లేక పేదోడు మరణించకూడాదనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డా. రాజశేఖర్ రెడ్డి మెదడు నుంచి ఉద్భవించిన పథకమే ఆరోగ్యశ్రీ అని వివరించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా విస్తరించి, ఆరోగ్యశ్రీ పరిధిలోని జబ్బులు, నెట్ వర్క్ ఆసుపత్రుల సంఖ్యను సీఎం జగన్ మరింతగా పెంచారని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా రాష్ట్రంలోని 15 వేల పైచిలుకు సచివాలయాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ రాష్ట్రంలోని 1.6కోట్ల ఇళ్లకూ వైద్యం సేవలు చేరువ చేశారని అన్నారు.
వలంటీర్ల ద్వారా ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్యలు తెలుసుకొని సచివాలయాల్లో నిర్వహించే మెడికల్ క్యాంపులకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి హాజరుపరిచే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. సీఎం జగన్ 15 మంది వైద్యులను ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించడమే కాక, అత్యంత ప్రాధాన్యత కలిగిన పలు ప్రభుత్వ ఉన్నత పోస్టుల్లో వైద్యులను నియమించారని గుర్తుచేశారు. ఆసుపత్రలు డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అఫిలియేషన్ పొందడంలో ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని, తాను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా ప్రైవేటు మెడికల్ క్యాంపులు, రాజకీయ పార్టీలు నిర్వహించే మెడికల్ క్యాంపులు కనిపించడంలేదని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అమలుతో 1.6 కోట్లు ఇళ్లకూ మెడికల్ క్యాంపు సేవలు అందుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి వైద్యరంగంలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ప్రజలకు అందిస్తున్న మెరుగైన వైద్య సేవలు ప్రజలకు తెలియజేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు.
అలాగే పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం నిర్వహించారు.అనంతరం నరసరావుపేట పల్నాడు బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభ వరకు కొనసాగిన బస్సు యాత్ర లో పాల్గొని, ఇతర ప్రముఖులతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. బస్సుయాత్రలో మంత్రులు మెరుగు నాగార్జున,ఆదిమూలపు సురేష్, కరుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి,మాజీ ఎమ్మెల్సీ డోక్క మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.