Suryaa.co.in

Andhra Pradesh

డబ్బు పంచకుండా వైసీపీ నేతలు ‘తోట’కు తొండి చేశారా?

-పంపకాల విషయంలో చేతివాటం?
-ఫలితాలొచ్చాక పనిపడతానని వార్నింగ్
-అందరి లెక్కలు తేలుస్తానన్న కన్నెర్ర
(రమణ)

మండపేట: ఎన్నికలకు మూడు రోజుల ముందు వరకూ వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంటుపై దృష్టి సారించాయి. రెండు పార్టీలు డబ్బులు పంపిణీకి సిద్ధమయ్యాయి. వైసీపీ నాయకత్వం ఈ విషయంలో తలమునకలై వార్డుల్లోనూ, గ్రామాల్లోను ఓట్ల కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలను ఆయా గ్రామ వార్డు స్థాయి నాయకులకు ముట్ట జెప్పారు.

ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలీదు ప్రతీ ఓటు ఫ్యాన్ గుర్తుకే పడేలా చూసుకోవాలి మీరంతా అంటూ తోట బాధ్యతను వారికి అప్పగించారు. సందట్లో సడేమియా అన్నట్టుగా మనం పంచినాపంచక పోయినా ఈ సమయంలో మనల్ని ఎవరు అడుగుతారులే అనుకుని కొంత మేర కానిచ్చి మిగిలిన ఫలహారాన్ని కొంత మంది పంపకం దారులు భోం చేసేసారని ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. దానికి తోడు ఈ వ్యవహారం పోలింగ్ దగ్గర చేసి జరగడంతో ఈ చోటా నాయకులు మూడు నిబ్బులు ఆరు కాగితాలు కింద పంచుకుతినేసి తమకు మొండి చేయి చూపించారని ఓటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెవిన పడింది.

దీంతో చిర్రెత్తి పోయిన త్రిమూర్తులు పోలింగ్ పూర్తయ్యాక తన కార్యాలయంలో మీటింగ్ పెట్టారు. వైసీపీ కౌన్సిలర్లతో పాటు బాధ్యతలు అప్పగించిన వారందరినీ పిలిచి ఎవరెవరు ఏం చేసారో అన్నీ నాకు తెలుసు. మీ విషయంలో నేను ఇలాగే చేసానా అంటూ అవకతవకలకు పాల్పడిన కొంత మందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇంకా కక్కుర్తి పడిన మరి కొంతమందిని విడివిడిగా లోపలకి రమ్మని చెడామడా చివాట్లు పెట్టి మరీ పంపినట్టు సమాచారం.

అంతా తనవారేనని నమ్మితే దొంగలు దొంగలు ఊళ్ళపై పడి దోచుకు తిన్నట్టైందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అడిగిన వారందరికీ ప్రతీ పని చేసి పెట్టి సొంత కుటుంబ సభ్యుల మాదిరి చూసుకున్న త్రిమూర్తులుకు దెబ్బ కొట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు. చేసిన మోసం అంతా ఇంతా కాదని, రేపు తోట విజయంపై ఈ ప్రభావం చూపనుందని చెప్పుకుంటున్నారు.

ఫలితాలు వచ్చాక అందరి పనీ పడతానని, ఎవరెవరు చేతివాటం ప్రదర్శించారో వారి నుంచే తిన్నది రాబడతానని అన్నట్టు తెలుస్తోంది. కాగా చివరికి గతంలో గిరిజాల వెంకటస్వామి నాయుడుకి తగిలిన దెబ్బే తోట త్రిమూర్తులుకు వైసీపీ కార్యకర్తలు రుచి చూపించారని ప్రజలు చెప్పుకుంటున్నారు.

LEAVE A RESPONSE