బద్వేల్ లో అధికార పార్టీకి వణుకు పుట్టించిన బిజెపి అభ్యర్థి సురేష్…

రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నా నేటికీ అవి సామాన్యుడికి అందని ద్రాక్ష లాగానే కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిణామాలు రిజర్వుడు నియోజకవర్గాలలో కాస్తంత ఎక్కువగానే ఉన్నాయనే చెప్పొచ్చు. సైద్ధాంతిక భూమిక ఉద్యమాల నేపథ్యం ఉన్నవారికి నమ్ముకున్న పార్టీ అండ తోడైతే ఎలా ఉంటాయో అనే దానికి ఆంధ్ర ప్రదేశ్ బద్వేల్ ఉప ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణ.
భారతీయ జనతా పార్టీ బద్వేలు అభ్యర్థిగా బరిలోకి దిగిన పనతాల సురేష్ ఆర్థిక,సామాజిక విషయాలు ఒకవైపు, మరోవైపు సైద్ధాంతిక నేపథ్యంలో సాగిన విద్యార్థి, రాజకీయ ఉద్యమాలను పరిశీలన చేస్తే నేటి రాజకీయాలలో సరి కొత్త కోణం కనుపిస్తుంది.ఆర్ధిక, కండ బలం లేకున్నా అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లో పనిచేస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని దానికి సురేష్ విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది.దీనికి తోడు బద్వేలు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీలోని రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల సహకారంతో తనదైన శైలిలో ప్రచార జోరు సాగించిన సురేష్ అధికార వైసిపి నేతల వెన్నులో వణుకు పుట్టించాడు.
కడప జిల్లా పెనగలూరు మండలం పోందలూరు గ్రామంలో అత్యంత సామాన్యమైన కుటుంబంలో జన్మించిన సురేష్ జిల్లాలోని గడపగడపకు విద్యార్థి నాయకుడిగా సుపరిచితుడు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తో కళాశాల స్థాయిలో ఏర్పడిన అనుబంధంతో అంచెలంచెలుగా ఎదుగుతూ కళాశాల స్థాయి నుంచి అఖిలభారత స్థాయివరకు అనేక బాధ్యతలు సరేష్ నిర్వహించాడు.కళాశాల అధ్యక్షులుగా,నగర కార్యదర్శిగా,భాగ్ ప్రముఖ,జిల్లా కన్వీనర్, రెండు దఫాలు రాష్ట్ర సహాయ కార్యదర్శి, మరో రెండు సార్లు రాష్ట్ర కార్యదర్శిగా,జాతీయ కార్యదర్శి గా రెండు సంవత్సరాలు పని చేయడమే కాకుండా ABVP లో కీలకమైన సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా భాద్యతలు నిర్వహించాడు.
విద్యార్థి ఉద్యమంలో భాగంగా అనేక పోరాటాలు చేసిన సురేష్ కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష అనుభవించటమే కాకుండా దాదాపు 25 పైగా కేసు ఎదుర్కొన్నారు.
వీటికితోడు దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో ఏబీవీపీ పూర్తి సమయ కార్యకర్తగా కీలకంగా పనిచేసాడు.అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జాతీయ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి బరిలోకి దిగిన సురేష్ నేడు బద్వేల్ ఉప ఎన్నికలలో ఆ పార్టీ తరఫున పోటీ లో ఉన్నారు.
బద్వేలు బరిలో…
బద్వేలు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ భాజపా మిత్రపక్షంగా ఉన్న జనసేన సంప్రదాయం పేరుతో పోటీకి తమ అభ్యర్థులను నిలపలేదు. భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిగా గతంలో పోటీ చేసిన జయరాములు తో పాటు మరికొన్ని పేర్లు పరిశీలన చేసింది అయితే కేంద్ర పార్టీ సురేష్ వైపే మొగ్గు చూపడంతో బద్వేలు బరిలోకి దిగే అవకాశం వరించింది.
ఇదిలా ఉండగా బద్వేలులో అధికార వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధాను బరిలోకి దింపింది. అయితే గెలుపు సునాయసం అంటూ లక్ష పైగా మెజార్టీ సాధించే విధంగా అధికార పార్టీ ప్రచారం మొదలు పెట్టింది.ఈ నేపథ్యంలో చేతిలో నయపైసా లేని సురేష్ పార్టీ అధినాయకత్వం నుంచి వచ్చిన మద్దతు తో పాటు తనదైన శైలిలో జరిపిన ప్రచార తీరుతో అధికార పార్టీ నేతలు తమ ప్రచార తీరును సైతం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.దశాబ్దకాలంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బద్వేలు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పై సురేష్ చేసిన విమర్శలు అధికార పార్టీనేతలను ఉక్కిరి బిక్కిరికి గురిచేశాయి. ప్రచారంలో నియోజకవర్గంలో అభివృద్ధి , సమస్యలు పరిష్కారం విషయంలో దాటవేసిన ధోరణి అవలంభిచిన అధికార పార్టీ ఆర్థిక,అంగ,అధికార బలాన్ని నమ్ముకొని ప్రచారంకోనసాగించింది.
అయితే బిజెపి నేతలు జాతీయ కార్యదర్శి సత్య కుమార్ తో పాటు ఆదినారాయణ రెడ్డి ,సీఎం రమేష్ లు కీలక భూమికను పోషించటంతో పార్టీ ప్రచారంలో జోరు పెరిగింది. వీరికి తోడు నాయకులు కేంద్ర మంత్రి మురుగన్ ,సోము వీర్రాజు, జి వి ఎల్ నరసింహారావు,కన్నా లక్ష్మీనారాయణ,పురందరేశ్వరి ఎమ్మెల్సీ మాధవ్ , విష్టువర్ధన్ రెడ్డి, రావెల కిషోర్ తదితర నేతలు నియోజకవర్గంలో జరిగిన ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి వచ్చిన నాయకులతో అన్ని గ్రామాల్లో బిజెపి ప్రచారం జోరు కొనసాగింది.బద్వేలు పోటీలో ఉన్న మరో పార్టీ కాంగ్రెస్ పాత్ర నామమాత్రంగానే కనిపిస్తోంది.ఓట్లు, శాతాలు అంశాన్ని పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ విషయంలో అభ్యర్థి ఎంపిక నుండి ప్రచారం తదనంతర పలు అంశాలలో తీసుకున్న కీలక నిర్ణయాలు పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

Leave a Reply