బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో… బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలకు అర్థమైంది
ప్రభుత్వ, పదవులు లేవు అయినా నాయకులు కాంగ్రెస్ లోకి వస్తున్నారు
మరుగుజ్జులు ఎవరో, ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో తేలుతుంది
బీఆరెస్ ప్రాధాన్యత ఎన్నికలు, ఓట్లు, సీట్లు
కాంగ్రెస్ ప్రాధాన్యత ప్రజల సంక్షేమం
బీజేపీ కి అభ్యర్థులు లేరు, మానిఫెస్టో లేదు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
బీజేపీ, బీఆర్ఎస్ రెండూ పార్టీలు ఒక్కటే అనే విషయం ప్రజలకు అర్థమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన కుదిరిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కసిరెడ్డి నారాయణరెడ్డికి ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ బంధం బలంగా ఉంది కాబట్టే బీఆర్ఎస్ చేస్తున్న అవినీతికి బీజేపీ రక్షణకవచంగా నిలుస్తుందని విమర్శించారు. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో, బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు.
“వంశీ చంద్ రెడ్డి తాను పోటీ చేసే స్థానంలోకి నారాయణ రెడ్డిని ఆహ్వానించారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నా. తెలంగాణలో మిగతా నాయకులు వంశీచంద్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలి” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మా దగ్గర ప్రభుత్వం లేదు. పదవులు లేవు. అయినా సరే.. కసిరెడ్డి, మైనంపల్లి, రేఖా నాయక్ పదవుల్లో ఉండి కాంగ్రెస్ లోకి వచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. మరుగుజ్జులు ఎవరో… ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో తేలుతుందన్నారు. ఓడిపోతే పారి పోదామని ఇతర దేశాల పాస్ పోర్ట్ లు తీసుకున్నారు. అధికారంలోకి రాగానే విచారణ జరుపుతామన్నారు రేవంత్ రెడ్డి. ‘‘మమ్మల్ని మరుగుజ్జులు అంటారా..కేసీఆర్ ఏమన్నా బాహుబలి నా.. అద్దంలో ముఖం చూసుకోవాలి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కు ముఖం చెల్లక బిల్లా రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును కాంగ్రెస్ మంత్రిని చేసిందని గుర్తుచేశారు. రబ్బరు చెప్పులు వేసుకునే హరీష్ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఏం చేసిందో బిల్లా రంగాలు కేసీఆర్ ను అడిగితే చెబుతారని ఎద్దేవా చేశారు. మీరు అనుభవిస్తున్న పదవులు, హోదా కాంగ్రెస్ పెట్టిన బిక్ష అని గుర్తుంచుకోవాలన్నారు. ఆరోగ్య శ్రీ, రైతు రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందన్నారు. ఉచిత కరెంట్ హామీని రాజశేఖర రెడ్డి అమలు చేసి చూపించారన్నారు రేవంత్ రెడ్డి.
సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లో చేస్తున్న అభివృద్ధి మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు చేయడం లేదు..ఎందుకు మిగతా నియోజకవర్గాలపై వివక్ష చూపుతున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
“తెలంగాణలోనే సమాన అభివృద్ధి చేయని మీరు కాంగ్రెస్ ను విమర్శిస్తారా? ఛత్తీస్‌ఘడ్‌లో, హిమాచల్ లో అమలు చేస్తున్న పథకాలు మీ దగ్గర ఉన్నాయా?” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
“బీఆరెస్ ప్రాధాన్యత ఎన్నికలు, ఓట్లు,సీట్లు….కాంగ్రెస్ ప్రాధాన్యత ప్రజల సంక్షేమం..ప్రజలకు ఏం చేస్తామో మేం చెప్పాం. బీజేపీ కి అభ్యర్థులు లేరు. మానిఫెస్టో లేదు. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ అధికారంలో లేదు. తెలంగాణ వచ్చాక రెండు సార్లు అధికారంలో ఉన్నది మీరే. ఉమ్మడి రాష్ట్రంలో మా పదేళ్ల పాలన… తెలంగాణలో మీ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?” అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఇస్తే, లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి కొత్తగా మేనిఫెస్టో పేరుతో ఏం తీసుకొస్తారని ప్రశ్నించారు. మేనిఫెస్టో పేరుతో కొత్త అబద్దాలను ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోందని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ నిర్మాణం వరకు చేసిన ఖర్చుకు, పిలిచిన టెండర్లకు పొంతన లేదన్నారు.
రూ.400 కోట్లతో సెక్రటేరియట్ నిర్మాణం అని చెప్పి రూ.1200 కోట్లు ఖర్చు చేశారన్నారు. వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు అని ఎద్దేవా చేశారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన వ్యక్తి పసుపు బోర్డు ఎక్కడ పెడతారో చెప్పాలని ఎంపీ అరవింద్ ను ప్రశ్నిచారు రేవంత్ రెడ్డి. అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని పేర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చామని.. అవి నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.