Home » ఏపీలో బీజేపీ డబుల్‌ గేమ్?

ఏపీలో బీజేపీ డబుల్‌ గేమ్?

– బీజేపీ డబుల్‌ గేమ్ ఆడుతోందంటూ సోషల్‌మీడియాలో చర్చ
– వైసీపీతోనూ తెరచాటు బంధం కొనసాగిస్తోందన్న అనుమానం
– నర్సాపురం సీటుపై జగన్ పట్టు గెలవడమే ఆ అనుమానాలకు కారణం
– ఎంపీ రాజుకు సీటివ్వకుండా చేయడంలో జగన్‌‘ బీజేపీ లాబీయింగ్’ సక్సెస్
– కూటమికి ‘గోడమీదరేపు’ గోస
– కొత్త సీఎస్‌గా నీరబ్ లేదా సిసోడియా అన్న ప్రచారం
– కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు వస్తారన్న ప్రచారం
– ప్రచారంతోనే సరి..నియామాలెప్పుడో మరి?
– నామినేషన్లు మొదలైనా కనిపించని ఈసీ చర్యలు
– కూటమి ఫిర్యాదు చేసినా కనిపించని కదలిక
– సీఎస్, డీజీపీ, ఏడీజీ, విశాఖ సీపీ ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
– ఈసీ ఆదేశించినా పట్టించుకోని సీఎస్ వైఖరిపై చర్యలెప్పుడు?
– ఇన్చార్జి డీజీపీని మార్చమని కోరినా పట్టించుకోరా?
– ఆయన హయాంలోనే ఎన్నికలు జరిపిస్తారా?
– ఈసీ తీరుపై కూటమి నేతల అసంతృప్తి
– గత ఎన్నికల్లో ఆగమేఘాలపై సీఎస్,డీజీపీ, ఏడీజీలను మార్చిన వైనం
– అప్పుడు ఫిర్యాదుదారు వైసీపీ ఒక్కటే
– ఇప్పుడు కూటమిలో మూడుపార్టీలు ఫిర్యాదు చేసినా పట్టని వైచిత్రి
( మార్తి సుబ్రహ్మణ్యం)

చిన్నప్పుడు గోడమీద రేపు.. అప్పు రేపు.. ఓ స్త్రీ రేపురా.. అన్న ఆక్షరాలు గోడలపై చదివేవాళ్లం. అంటే రేపటిమీద ఆశ కల్పించడం అన్నమాట. ఇప్పుడు ఏపీలో కూటమి పరిస్థితి కూడా అలాగే మారింది. సీఎస్, డీజీపీ, ఏడీజీ, బెజవాడ పోలీసు కమిషన్, మరికొందరు ఐఏఎస్-ఐపిఎస్ అధికారుల బదిలీలపై కూటమి ఇచ్చిన ఫిర్యాదులపై, రేపు చర్యలు తీసుకుంటారన్న ఆశ.. కూటమినేతల సహనం నశించేలా చేస్తోంది. ఆ రేపు ఆశ కాస్తా రోజులయి, ఇప్పుడు నామినేషన్ల పర్వం వరకూ చేరింది. ఫలితంగా రేపు ఆశ ఆవిరవుతోంది. ఈ అంశంలో ఎన్నికల సంఘం నత్తనడ క నిర్ణయాలపై, కూటమిలోని మూడుపార్టీల నేతలు తీవ్ర అసహనం-అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది.

నిజానికి గత ఎన్నికల ముందు అధికారంలో ఉన్న నాటి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీజీపీ, ఏడీజీ, సీఎస్, కొంతమంది ఐపిఎస్-ఐఏఎస్‌లను మార్చాలని వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా టీడీపీ నుంచి విడిపోయి, పరోక్షంగా వైసీపీకి తెరవెనుక మద్దతునిచ్చింది. ఫలితంగా కీలక స్థానాల్లోని డీజీపీ,ఏడీజీ, సీఎస్‌తోపాటు ఎస్పీలు, కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆగమేఘాలపై బదిలీ చేసింది. వారికి ఎన్నికలయ్యేంతవరకూ పోస్టింగులివ్వకూడదని ఆదేశించింది. ఆ చర్యపై ఆగ్రహించిన చంద్రబాబు, స్వయంగా ఈసీ గోపాలకృష్ణ ద్వివేదీ వద్దకు వెళ్లి ధర్నా చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు క థ మారింది. రాజకీయ సమీకరణలు కూడా మారాయి. గత ఎన్నికల ముందు శత్రువులైన టీడీపీ-బీజేపీ, ఇప్పుడు మిత్రులయి కూటమి కట్టారు. కొద్దినెలల క్రితం వరకూ టీడీపీని విమర్శించిన బీజేపీ నేతలు, ఇప్పుడు వైసీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రచారంతోపాటు, ఎన్నికల సంఘానికి ఇద్దరూ కలిసే ఫిర్యాదు చేస్తున్నారు. టీడీపీ-బీజేపీ-జనసేనేతలు సంయుక్త విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి బంధం ఆ స్థాయిలో బలంగా ‘కనిపిస్తోంది’.

అందులో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇన్చార్జి డీజీపీగా ఉన్న రాజేంద్రనాధ్‌రెడ్డి, ఇంటలిజన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా సహా మరికొందరు ఐపిఎస్,ఐఏఎస్‌లను బదిలీ చేయాలని ఎన్డీయే కూటమి, ఈసీకి కోడ్ అమలయినప్పటి నుంచి వరసగా ఫిర్యాదు చేస్తోంది.

డీజీపీ, సీఎస్ ఇద్దరూ జగన్మోహన్‌రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడంతోపాటు, ముగ్గురిదీ ఒకే జిల్లా కావడం విశేషం. ఆలోగా కొందరు ఐఏఎస్,ఐపిఎస్ అధికారులను బదిలీ చేసింది. వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలెదుర్కొంటున్న ఐపిఎస్ కొల్లిని, అక్కడి నుంచి తప్పించి, పక్క రాష్ట్రాల ఎన్నికల విధులకు పంపింది. దీనితో మిగిలిన వారిని కూడా మారుస్తారన్న ఆశ మొలకెత్తింది. కానీ నామినేషన్లు కూడా ప్రారంభం కావడంతో, కూటమికి ఆ ఆశ ఆవిరయిపోతోంది.

అయితే ఈసీ తప్పించిన అధికారులు.. ఇప్పటికీ తమ క్యాంపు ఆఫీసులను ఖాళీ చేయకుండా అక్కడే కొనసాగుతున్నా, చర్యలు తీసుకోవడంలేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించడం చర్చనీయాంశమయింది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై చర్య తీసుకోవాలని ఈసీ ఆదేశించినప్పటికీ, సీఎస్ స్పందించకపోవడంపై కూటమిలో ఆగ్రహం వ్యక్తం వ్యక్తమవుతోంది. ఇలాంటి అనేక ఫిర్యాదులపై ఈసీ మిన్నకుండటమే వారి అసంతృప్తికి అసలు కారణం. పెన్షన్ల పంపిణీని వివాదాస్పదంగా మార్చి, దానిని వైసీపీకి లబ్దిపొందేలా చేశారన్న ఆరోపణ సీఎస్‌పై ఉన్న విషయం తెలిసిందే. కూటమి ఆమేరకు ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది.

సీఎస్ జవహర్‌రెడ్డి, ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిని తప్పించాలని కూటమి కోరడం, ‘రేపు’ నిర్ణయాలు తీసుకుంటారన్న సమాచారం రావడం, చాలారోజుల నుంచి కూటమికి అలవాటయిపోయింది. రేపో మాపో వారిని మార్చేస్తున్నారన్న సమాధానం కూటమి నేతలను సంతృప్తి పరుస్తోందో తప్ప, కార్యాచరణ కనిపించకపోవడం నిరాశకు గురిచేస్తోంది. ముఖ్యంగా జవహర్‌రెడ్డి స్థానంలో నీరబ్‌కుమార్ లేదా సిసోడియా ప్రధాన కార్యదర్శిగా వస్తారన్న ప్రచారం అధికార వర్గాల్లో చాలారోజుల నుంచి జరుగుతోంది. నీరబ్‌కుమార్ పదవీకాలం జూన్‌తో ముగుస్తున్నందున, సిసోడియా సీఎస్ అవుతారన్న చర్చ కూడా జరిగింది. నీరబ్ ముక్కుసూటి అధికారి. వివాదరహిత ఐఏఎస్‌గా పేరుంది.

అదేవిధంగా కొత్త డీజీపీగా ఆర్టీసీ చైర్మన్, ద్వారకా తిరుమలరావు అవుతారన్న ప్రచారం కూడా, చాలాకాలం నుంచీ అధికార వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆయనకూ వివాదరహితుడన్న పేరుంది. అయితే తాజాగా సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై, క్యాట్ ఈవారంలోనే తుదితీర్పు ఇవ్వనుంది. ఒకవేళ అక్కడ బీవీ సస్పెన్షన్‌ను కొట్టివేస్తే, సీనియారిటీ జాబితాలో ఏబీవీ ముందువరసలో ఉంటారు. అది వేరే కథ. దానికంటే ముందు.. కొత్త సీఎస్ ఎవరన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే కొత్త డీజీపీ ఎంపికలో సీఎస్ పాత్ర కీలకం కాబట్టి!

ఇదిలాఉండగా..వివాదాస్పద అధికారుల మార్పులకు సంబంధించి, ఈసీ చేస్తున్న ఆలస్యంపై రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్‌మీడియాలో అయితే.. వైసీపీతో బీజేపీ తెరచాటు బంధం కొనసాగుతోందనడానికి, ఇదో నిదర్శనమన్న చర్చ జరుగుతోంది.

‘‘ఆంధ్రాలో బీజేపీ డబుల్‌గేమ్ ఆడుతోంది. టీడీపీ-వైసీపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఇద్దరూ తమవైపే ఉంటారన్నది బీజేపీ నమ్మకం. అందుకే జగన్ ఒత్తిడి చేశారని నర్సాపురం సీటు రఘురామకృష్ణంరాజుకు ఇవ్వకుండా, బలహీనమైన అభ్యర్ధిని పెట్టింది. ఆ సీటు కావాలనే టీడీపీకి కాకుండా బీజేపీ తీసుకుంది. టీడీపీ కూడా ఆ సీటు రఘురామకృష్ణంరాజుకు ఇస్తారన్న నమ్మకంతో అభ్యంతరం పెట్టలేదు. బహుశా నర్సాపురం ఎంపీ సీటు శ్రీనివాసవర్మకు ఇస్తారని తెలిస్తే, చూస్తూ చూస్తూ ఒక ఎంపీ సీటు వైసీపీకి పోయేందుకు టీడీడీ ఎందుకు అంగీకరిస్తుంది? సీఎస్,డీజీపీ, ఏడీజీ, బెజవాడ సీపీలపై చర్యలు తీసుకోవడానికి ఈసీకి నిమిషం పట్టదు. గతంలో ఆ హోదాలున్న వారిని ఒకేసారి మార్చలేదా? మరి ఇప్పుడు ఆపని ఎందుకు చేయటం లేదు? టీడీపీ కూడా ఎన్డీఏలోనే ఉంది కదా? ఎందుకంటే బీజేపీకి జగన్‌తో ఇంకా దోస్తానా కొనసాగుతోంది కాబట్టి. మోదీకి జగన్ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి. ఇది అర్ధం చేసుకోకుండా చేసే ఏ విశ్లేషణయినా వ్యర్ధమే’’నన్న కోణంలో సోషల్‌మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

బీజేపీ నిలబెట్టిన ఎంపీ-ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితా చూస్తే, అది వైసీపీకి మేలు చేసేందుకు వేసిన ఎత్తుగడగానే అర్ధమవుతోందన్న చర్చ, సోషల్‌మీడియా వేదికగా జరుగుతోంది. నర్సాపురంలో మాస్ ఇమేజ్ ఉన్న సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కాకుండా, ఎవరికీ తెలియని శ్రీనివాసవర్మకు ఇవ్వడం.. బీసీ సీటయిన ఎచ్చర్లలో పట్టుమని పదికుటుంబాలు కూడా లేని కమ్మ అభ్యర్ధికి సీటివ్వడం.. రెడ్లకు బలమైన అనపర్తిలో టీడీపీని తప్పించి మరొకరికి సీటివ్వడం.. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ వంటి బలమైన మాస్ లీడర్ ఉన్న దెందులూరులో ఆయనను మార్చి, పెద్దగా ఎవరికీ తెలియని తపన చౌదరి అనే నాయకుడికి ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు పరిశీలిస్తే.. తెరవెనుక ఏం జరుగుతోందో అర్ధంచేసుకోవడం పెద్ద కష్టం కాదంటున్నారు.

బీజేపీకి ఇచ్చిన ఆరు ఎంపీ సీట్లలో ఒక్క చోట, 10 అసెంబ్లీలో 5 మినహా మిగిలినసీట్లలో పెద్దగా గెలిచే అవకాశాలు లేవంటే, బీజేపీ-వైసీపీ తెరచాటు అనుంబంధం, ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్ధమవుతోందన్న కోణంలో, సోషల్‌మీడియాలో కథనాలు వెల్లువెత్తుతుండటం విశేషం.

Leave a Reply