కేంద్రంలోని బీజేపీకి వైసిపి అవసరం ఉంది

– ఇప్పుడు విభజన హామీలు, ప్రత్యేక హోదా గురించి పోరాడితే ఫలితం
– ముందస్తు ఎన్నికల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు
– సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ అవసరం ఇతర పార్టీల కన్నా బీజేపీకి ఎక్కువగా ఉన్నదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికలే అదనుగా విభజన హామీలపై బీజేపీపై ఒత్తిడి తేవచ్చునని ఆయన సూచించారు. ముందస్తుపై తీవ్రమైన చర్చ జరుగుతుందని, అయితే ముందస్తుపై కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరించడంపై చూపితే బాగుంటుందని అన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలతోపాటు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ అవసరం ఉన్నందున, ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వివిధ విభజన హామీలను నెరవేర్చేందుకు వారిపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీకి మంచి అవకాశం ఉన్నదని లక్ష్మీనారాయణ చెప్పారు.

విభజన సమయంలో కేంద్రం చేసిన హామీలను పొందేందుకు అన్ని పార్టీలు పార్టీలకతీతంగా పోరాటం చేయాల్సిన అవసరమున్నదని నొక్కి చెప్పారు. ఏపీలోని అన్ని పార్టీలు ఒక్కటై కేంద్రాన్ని ఒత్తిడి చేస్తే విభజన హామీలన్నీ నెరవేరుతాయన్నారు.ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను పొందేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ముందస్తు గురించే జోరుగా చర్చలు సాగుతున్నాయన్నారు.రాజకీయ నేతలు ముందస్తు గురించి కాకుండా ప్రజల సమస్యలపై ముందస్తు దృష్టిపెడితే బాగుంటుదని చెప్పారు. ముందస్తు ఎన్నికల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఒక ఛానల్ ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.