కమలమా? కామ్రేడ్లా?

– తెలుగుదేశం దారెటు?
– గ్యాడ్యుయేట్‌ ఎన్నికల్లో కలసివచ్చిన కామ్రేడ్లు
– చెల్లనిఓట్ల సంఖ్య కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ
-టీచర్‌ ఎన్నికలపై దృష్టి సారించని టీడీపీ
– టీడీపీ సహకరిస్తే పీడీఎఫ్‌ గెలుపు
– గ్య్రాడ్యుయేట్‌ ఎన్నికలకే టీడీపీ పరిమితం
– కామ్రేడ్ల బలం పోయినా ఉనికి సజీవం
– కమలంలో నాయకులెక్కువ, కార్యకర్తలు తక్కువ
– జనసేన-వామపక్షాలతో వెళ్లాలంటున్న టీడీపీ సీనియర్లు
– బీజేపీతో కలిస్తే లాభం లేదని సీనియర్ల వాదన
– భవిష్యత్తు అవసరాల కోసం బీజేపీనే బెటరన్న నాయకత్వ యోచన
– తెలుగుదేశం అంతర్మథనం
( మార్తి సుబ్రహ్మణ్యం)

వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు టీడీపీకి జీవన్మరణం. గెలిస్తే మరో పదేళ్లకు భరోసా. ఓడితే వచ్చే రాజకీయ సమస్యలు బోలెడు. ఈలోగా వచ్చిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీకి బోలెడంత ఉత్సాహం ఇచ్చాయి. వైసీపీ అధినేత-సీఎం జగన్‌ ఇలాకా సహా, సీమలో చేసిన విజయగర్జన, సైకిల్‌కు ‘ముందస్తు కిక్కు’ ఇచ్చింది. ఏడాదికి సరిపడా ఇచ్చిన ఈ టానిక్‌ టీడీపీకి బోలెడు ఆత్మస్థైర్యం ఇచ్చేదే. అయితే.. ఆ కిక్కు వెనుక కామ్రేడ్ల శ్రమదానం ఉంది. వామపక్షాల దన్ను లేకపోతే టీడీపీ మరింత ‘శ్రమ’టోడ్చాల్సి వచ్చేది.

అయితే.. టీడీపీ మరోవైపు బీజేపీ వైపు ఇంకా ఆశగా చూస్తోంది. బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు, చెల్లని ఓట్ల సంఖ్య కంటే తక్కువ. ఎక్కడా ఆర శాతం కూడా ఓట్లు కూడా సాధించలేని వైఫల్యం. అయినా సరే.. కమలం వైపు తగ్గని ఆశ. మరి టీడీపీ ఎవరి వైపు వెళుతుంది? కలసిరాని కమలం తోనా? కలసివచ్చిన కామ్రేడ్ల తోనా? ఎవరితో వెళితే లాభం? ఎవరితో నష్టం? ఇదీ ఇప్పుడు టీడీపీ అంతర్మథనం!

ఏపీలో తాజాగా జరిగిన మూడు గ్య్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. చివరాఖరకు వైసీపీ బలంగా ఉన్న రాయలసీమ జిల్లాలతో సహా రెండు స్థానాలు సాధించిన విజయంతో టీడీపీలో కిక్కు కనిపిస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విజయాన్ని ఎంత తేలిక చేసేందుకు ప్రయత్నించినా, వైనాట్‌ 175? అని నినదిస్తున్న వైసీపీకి శరాఘాతమే. నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యాధికులు చేయెత్తి సైకిల్‌కు జైకొట్టారని స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో విజయంపైఆశలు చిగురించిన టీడీపీ ముందు పెద్ద చిక్కు ప్రశ్న నిలుచుంది. అది కమలంతో వెళ్లాలా? కామ్రేడ్లతో వెళ్లాలా? అన్న అంతర్మథనం. నిజానికి ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లో వామపక్షాలకు భావజాలం తప్ప, ఆ పార్టీలకు ఓట్లు వేసేంత బలం ఎక్కడా లేదు. అయినా సరే ప్రభుత్వాలపై నిరంతర పోరాటాలతో తన ఉనికి నిలబెట్టుకుంటోంది. ప్రతిష్ఠాత్మక విశాఖ స్టీల్‌ ఉద్యమంలో వామపక్షాలదే ప్రముఖపాత్ర. విశాఖ స్టీల్‌పై ప్రత్యక్ష పోరాటాల్లో వామపక్షాలే ముందున్నాయి.

వైసీపీ సర్కారు ప్రజావ్యతిరేక నిర్ణయాలపై, ఎప్పటికప్పుడు ఉద్యమిస్తున్నవి వామపక్ష పార్టీలే. మోదీపై భయభక్తులతో అటు వైసీపీ-ఇటు టీడీపీ రెండూ, బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పేందుకు భయపడుతున్నాయి. అందుకే కేంద్రం ఏం నిర్ణయం తీసుకున్నా, వైసీపీ-టీడీపీ గళం విప్పకపోగా, స్వాగతిస్తున్నాయి. రెండు పార్టీలూ బీజేపీకి చేరువయ్యేందుకు పరితపిస్తున్నాయన్నది నిష్ఠుర సత్యం.

తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీడీపీ మూడు స్థానాలు సాధించిన విజయంలో వామపక్షాల పాత్ర ఎక్కువ. వామపక్షాలు, వాటి అనుబంధసంస్థలు- టీడీపీ ఒక అవగాహనతో ఎన్నికల్లో పనిచేశాయి. వామపక్షాలు తమ ఓట్లను, టీడీపీకి బదిలీ చేయడంలో సక్సెస్‌ అయ్యాయి. కానీ టీచర్‌ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో వామపక్ష మద్దతిచ్చిన అభ్యర్ధుల విజయంపై, టీడీపీ పెద్దగా దృష్టిపెట్టలేదు.

దానితో తొలిసారి వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. టీచర్లు సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తున్న సమయంలో, రెండు టీచర్‌ స్థానాలు గెలవడం గొప్ప విషయమే. నిజంగా టీడీపీ దృష్టి సారించినట్లయితే, అక్కడా రెండుసీట్లు సాధించి వామపక్షాలతో బంధం బలపడి ఉండేది. ఆ రకంగా వామపక్షాలు, మరొకరిని గెలిపించే స్థాయికి చేరడం కొత్త పరిణామమే. ఇప్పటివరకూ వామపక్షాలు ఒకరిని గెలిపించేందుకు కాకపోయినా, ఓడించేందుకు పనికొస్తారన్న ప్రచారం ఉండేది. అందువల్ల వచ్చే ఎన్నికల్లో జనసేన-వామపక్షాలతో కలసి వెళితే బాగుంటున్న అభిప్రాయం, టీడీపీలోని ఒక వర్గంలో కనిపిస్తోంది.

కానీ టీడీపీ నాయకత్వం మాత్రం.. బీజేపీతో దోస్తానా కోరుకుంటోంది. దానికి కారణాలు అనేకం. మెజారిటీ తగ్గినా, కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందన్న భావన ఒక కారణం. ఎన్నికల సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలసి ఉంటే, దానివల్ల ప్రయోజనాలేమిటి? దూరంగా ఉంటే వచ్చే నష్టమేమిటో, టీడీపీ గత ఎన్నికల సమయంలో అనుభవ పూర్వకంగా తెలుసుకుంది. పార్టీకి విరాళాలు నిలిచిపోయే ప్రమాదంతోపాటు, దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారుల నుంచి విరాళాలు వచ్చే దారులు మూసుకుపోతాయి.

విపక్షాలకు నిధుల సర్దుబాటు కష్టమవుతుంది. నిధులిచ్చే సంస్థలపై ఐటి, ఈడీ దాడులు జరుగుతాయి. పైగా బీజేపీని విస్మరిస్తే, అది వైసీపీకి నేరుగా ప్రయోజనం కలిగించవచ్చు. ఈ కారణాలతోనే టీడీపీ వచ్చే ఎన్నికల్లో, బీజేపీ సఖ్యత కోరుకుంటోందన్నది సీనియర్ల విశ్లేషణ. ఈ కారణాలు తప్ప.. బీజేపీకి బలం ఉంది కాబట్టి, ఆ పార్టీతో కలసి వెళ్లానుకోవడం భ్రమేనంటున్నారు.

అయితే నిజానికి బీజేపీకి ఏపీలో బలం శూన్యం. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధి మాధవ్‌కు చెల్లనిఓట్ల సంఖ్య కంటే తక్కువ ఓట్లు రావడం బట్టి, బీజేపీ పట్ల విద్యావంతులు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో స్పష్టమవుతుంది. ఇక బీజేపీ రంగంలో ఉన్న మిగిలిన రెండు నియోజకవర్గాల్లో, అసలు కనీస పోటీ ఇవ్వలేని దయనీయం. మాధవ్‌కు 5.5, దయాకర్‌కు 2.5, రాఘవేంద్రకు 3.5 శాతం ఓట్లు మాత్రమే దక్కడం బట్టి, ఆ పార్టీ వాస్తవ బలమేమిటో స్పష్టమవుతుంది.

విచిత్రంగా బీజేపీకి ఓటేసిన ఆ పార్టీ సానుభూతి పరులు, ఉత్తరాంధ్రలో తమ రెండో ప్రాధాన్య ఓటును టీడీపీకి వేశారు. 73.6 శాతం మంది బీజేపీ సానుభూతిపరులు టీడీపీకి ఓటు వేస్తే, 26.3 శాతం మంది వైసీపీకి ఓటు వేయడం ఆశ్చర్యం. ఇక తూర్పు రాయలసీమలో బీజేపీకి నుంచి టీడీపీకి 65.5 శాతం, బీజేపీ నుంచి వైసీపీకి 34.5 శాతం ఓట్లు బదిలీ అయ్యాయి. అటు పళ్చిమ రాయలసీమలో కూడా.. బీజేపీ నుంచి టీడీపీకి72.8 శాతం, బీజేపీ నుంచి వైసీపీకి 27.2 శాతం ఓట్లు రావడం విశేషం. దీన్నిబట్టి, బీజేపీ సానుభూతిపరుల్లో ఎక్కువమంది టీడీపీకి మద్దతునిచ్చినట్లు ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి.

అసలు రాష్ట్రంలో నామమాత్రంగా ఉన్న బీజేపీతో పొత్తు వల్ల, రాజకీయంగా వచ్చే లాభమేమీలేదన్నది టీటీడీలో ఒక వర్గం వాదన. బీజేపీకి రాష్ట్రంలో నాయకులు తప్ప కార్యకర్తలు లేరంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ వంటి బలమైన నేతను దూరం చేసుకుని, ఏమాత్రం బలం లేని సోము వీర్రాజును ఇంకా కొనసాగిస్తున్నారంటే.. ఆ పార్టీకి రాష్ట్రంలో ఎదగాలన్న కోరిక లేనట్లు స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

పైగా విశాఖ స్టీల్‌, రైల్వేజోన్‌, ప్రత్యేక హోదా వంటి కీలక అంశాల్లో బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందన్న ఆగ్రహం జనంలో బలంగా ఉంది. మూడు రాజధానులకు బీజేపీ నాయకత్వం మద్దతునిస్తున్నట్లు ఆ పార్టీ నేతల మాటలు తరచూ స్పష్టం అవుతుండటం కూడా వారి ఆగ్రహానికి మరో కారణంగా కనిపిస్తోంది. బీజేపీ-వైసీపీ ఒకటే అన్న భావనే ఈ ఫలితాలకు కారణమన్న బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు విశ్లేషణను గుర్తు చేస్తున్నారు. అసలు ఏపీకి బీజేపీ చేసిందేమీ లేదని, ఆ పార్టీతో కలిస్తే ముస్లిం ఓట్లు దూరమవుతాయని టీడీపీలోని ఓ వర్గం విశ్లేషిస్తోంది.

ఈ నేపథ్యంలో, పవన్‌ నాయకత్వంలోని జనసేన-కమ్యూనిస్టులతో వెళితేనే, రాజకీయంగా లాభపడతామని పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. పవన్‌తో కనీసం 30 నుంచి 50 నియోజకవర్గాల్లో లాభం ఉంటుందని, వామపక్షాలతో నెల్లూరు, విశాఖ, కృష్ణా వంటి కొన్ని జిల్లాల్లో లాభం ఉంటుందన్నది వారి విశ్లేషణ. బీజేపీ కంటే జనసేనతో పోటీ చేస్తే వచ్చే లాభమేమిటన్నది, గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తేలిపోయిందని గుర్తు చే స్తున్నారు.

Leave a Reply