Suryaa.co.in

Editorial

‘పుష్ప’ం అంటే ‘ఫ్లవరు’ కాదు… పవర్!

– యుపీలో ‘పువ్వు’ నవ్వింది
– మళ్లీ మీసం మెలేసిన కమలదళం
– ఆవిరయిన అడ్డగోలు ఆరోపణలు
– జీర్ణించుకోలేని వామపక్ష జీవులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా….ఫైర్…’ ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో పాపులర్ అయిన డైలాగు ఇది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ వాడిన ఈ డైలాగునే ఓటర్లు కూడా అచ్చంగా పలికిన వైచిత్రి. పుష్పం అంటే ఫ్లవరు కాదు. పవరని! దిమ్మతిరిగే ఫలితాలు వచ్చినా, అది పవర్ కాదు ఫ్లవరే అనుకున్న వారు వెర్రి పుష్పాల కిందే లెక్క.

అవును… ‘పువ్వు’ నవ్వింది. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. అనేక వర్గాలు ఉత్కంఠ, ఉద్వేగం, ఉక్రోషంతో ఎదురుచూసిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో యుపీ జనం ‘ఫ్లవరు’కు మళ్లీ
yogi-dspl పవరిచ్చారు. భోగి కాని యోగికే ఉత్తరప్రదేశ్ నీరాజనం పలికింది. రేపులు, హత్యలు, కిడ్నాపులు, అల్లర్లు, అరాచకాలు, మత వివక్ష, ఓబీసీ వ్యతిరేక పాలన వంటి పదాలతో మోతమోగిన ఎన్నికల ప్రచార ఆరోపణలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయి, యోగిని మరోసారి పట్టాభిషిక్తుడిని చేశాయి.

కాంగ్రెస్, ఎస్పీ, మజ్లిస్, వామపక్షాల వంటి పార్టీలు చెవినిల్లుకట్టుకుని పువ్వు పార్టీపై ప్రచారం చేసినట్లు, ఒకవేళ ఈ ఆరోపణలే నిజమయితే… వాటి ఆగ్రహావేశం జనంలో నరనరాన నాటుకుపోతే.. యోగి యోగ్యుడు కాదని యావత్ జనం కసితో తీర్మానించుకుంటే… మైనారిటీ మహిళలకు కమలదళంపై పీకల్లోతు కోపం ఉన్నట్టయితే… ప్రభుత్వ ఉద్యోగులు యోగి పాలపై పళ్లు నూరడమే నిజమయితే.. అధిక ధరలతో సామాన్యులు అగ్గిరాముళ్లలవుతున్నారదే నిజమయితే… యోగి సహా కమలదళానికి ధరావతు

కూడా దక్కే అర్హత ఉండదు. అలాంటి ప్రచారం చేసే ఈ బాపతు మేతావుల భాషణలు నిజమయితే, ‘పువ్వుపార్టీ’ మరోసారి పరిళమించే సమస్య ఉండదన్నది, మెడ మీద తల ఉన్న అందరికీ తెలుసు. కానీ ఎన్నికల్లో పువ్వు మళ్లీ నవ్వింది. అట్లా ఇట్లా కాదు.. కౌంటింగ్ సెంటర్ల మధ్య ఠీవిగా.. బాహుబలి మాదిరిగా నిలబడి, మోర ఎత్తి వికటాట్టహాసం చేసింది.

266 స్థానాలతో తిరుగులేని విజయం సాధించిన బీజేపీపై యుపీ ప్రజలు పెట్టుకున్న నమ్మకం నిజమని తేలిపోయింది. సమాజ్‌వాదీపార్టీ మీడియాలో హోరెత్తించిన ప్రచారం, ప్రియాంకతో రాహులబ్బాయి చేసిన ప్రచారం, దేశంలోని మైనారిటీ శక్తులంతా ఏకమయి ఉదరగొట్టిన బీజేపీ హిందూ వ్యతిరేక ప్రచారం,
opposition సందట్లో సడేమియా మాదిరిగా, తోలుబొమ్మలాటలో కేతిగాళ్ల వంటి వామపక్ష మీడియా బీజేపీ వ్యతిరేక ప్రచారం వల్ల కంఠశోష.. అదేదో ఆయాసం తప్ప మరేదీ మిగల్లేదు. అయోధ్య రామాలయ నిర్మాణం, కాశీ కారిడార్‌పై ప్రత్యర్థి పార్టీలు ఎంత విషప్రచారం చేసినా.. ఉత్తరప్రదేశ్ ఓటర్లు వాటిని తాగి, అమృతాన్ని యోగీ-మోదీ ద్వయానికి కానుకగా సమర్పించారు. బీజేపీ కొత్తగా వేసిన ఠాకూర్ల అనుకూల-ఓబీసీ వ్యతిరేక ముద్ర కూడా తాజా సునామీ లాంటి ఫలితాలలో కొట్టుకుపోయింది.

‘కుటుంబ బాధ్యత లేని సన్యాసికి సంసార కష్టాలేమి తెలుస్తాయ’ని ప్రశ్నించిన అఖిలేష్ యాదవ్‌కు, ఉత్తరప్రదేశ్ జనం తిరుగులేని గుణపాఠం చెప్పారు. తమకు అవినీతిపరుడు కాని వ్యక్తి మాత్రమే నాయకుడు కావాలని, రాష్ట్రాన్నే తన కుటుంబంగా భావించే యోగి లాంటి యోగ్యుడే సీఎం కావాలని, తిరుగులేని తీర్పు ఇవ్వడం.. రాజకీయాల్లో ఉన్న సన్యాసులపై చేసే విమర్శలకు సరైన సమాధానమే.
అదే సన్యాసి పాలనను వ్యతిరేకిస్తూ, సాగునీటి చట్టాలను సవాలు చేస్తూ తెలుగు టీవీ జీడిపాకం సీరియళ్ల మాదిరిగా, రాజకీయపార్టీలు రోజుల తరబడి నడిపిన రైతు ఉద్యమాలు జరిగిన జిల్లాల్లో కూడా కాషాయ జెండా ఎగరడం, కాంగీ-కమ్మీ-ఎస్పీ అండ్ అదర్స్‌కు చెంపదెబ్బే. కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు కారు నడిపి రైతుల మృతికి కారణమయ్యారంటూ.. జరిగిన రైతు ఉద్యమానికి కేంద్రమయిన లఖీంపోర్ ఖీరీ జిల్లాలోని 8 సీట్లలో, మొత్తం కమలదళమే గెలిచి నిలిచిందంటే, రైతులు మరీ అంత వెర్రివాళ్లు కాదన్న నిజం తేలిపోయింది.

దళిత బాలికపై హత్యాచారం జరిగి, బీజేపీ ఇమేజికి డామేజీ జరిగిన హాత్రాస్ కూడా కమలానికే జైకొట్టింది. ఈ కొన్ని ఉదాహరణ చాలు.. బీజేపీ వ్యతిరేక శక్తులవి కేకలే తప్ప, వాటిలో కంటెంటు లేదని చెప్పడానికి! మొత్తంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ప్రజలు జాతీయ వాదానికే జైకొట్టారు. క్రైస్తవులు గణనీయంగా ఉన్న గోవా, మణిపూర్‌తోపాటు, యుపీలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా కమలం వికసించడం కొత్త మలుపు. బీహార్‌లో మాదిరిగా యుపీలోనూ చక్రం తిప్పాలనకుని, వంద సీట్లలో పోటీ చేసిన మజ్లిస్, అన్ని స్థానాల్లో డిపాజిట్‌రాక చతికిలపడింది. పాపం.. అనవసరంగా బీజేపీకి ‘బీ’టీమ్‌గా ముద్రపడిన మజ్లిస్‌కు అటు వ్రతమూ జరగలేదు. ఫలితమూ దక్కలేదు. ఒకవేళ నిజంగా మజ్లిస్‌కు ముస్లిం ఓట్లు పడితే, బీజేపీకి మరికొన్ని సీట్లు అదనంగా వచ్చేవేకదా?

తాజా ఫలితాలు రాష్ట్రపతి ఎన్నికల సంకటంలో ఉన్న భాజపాను గట్టెక్కించాయి. యుపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో లభించిన విజయంతో.. ఇక బీజేపీ ఏ ఇతర పార్టీల సాయం కోరకుండానే, తన రాష్ట్రపతి అభ్యర్ధిని సులభంగా గెలిపించుకునే స్థాయికి చేరడం కొత్త పరిణామం. దేశంలో తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలతో.. బీజేపీ ప్రవచిత ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’లక్ష్యం చేరుకునేందుకు చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలే మిగిలాయి. అంటే దేశంలో ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’కు మరో రెండు అడుగులే దూరం ఉందన్నమాట.

ఈ ‘దారుణాతిదారుణ ఫలితాల’ను వామపక్షీయులు, వారికి నిరంతర వార్తా స్రవంతి ద్వారా ఆక్సిజను అందించే, వామపక్ష మీడియా జీర్ణించుకోకపోవడం సహజం. అందుకే యుపీలో బీజేపీ అద్భుత విజయంపై కోడిగుడ్డుకు ఈకలు పీకే అలవాటయిన పని మొదలెట్టాయి. అక్కడ జరుగుతున్న నేరాలు-ఘోరాలను బట్టి యోగి అయోగ్యుడన్నది వారి వాదన. ఈవీఎం టాంపరింగుతో గెలిచిగట్టెక్కారన్నది మరో దుగ్ధ. కాసేపు అదే నిజమయితే, మిగిలిన రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు ఓడిందన్న తర్కానికి, వారి వద్ద జవాబు ఉండదు. ఎందుకంటే వామపక్ష మీడియాకు ప్రశ్నల బురద వేసి పారిపోయి.. మళ్లీ కొత్త సమస్య వచ్చినప్పుడు ప్రత్యక్షమవడమే తప్ప, ఎదురు నిలిచిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అలవాటు ఉండదు. ఇప్పుడూ అదే జరిగింది.

ఏతావాతా మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం మోదీ ఇమేజ్‌ని హిమాలయమంత ఎత్తుకు పెంచాయి. ఇక
modi-yogi-1 యుపీలో విజయం మాత్రం నిస్సందేహంగా యోగీ పాలనకు మెచ్చి ఇచ్చిన మార్కులే. ఇకపై దేశంలో మోదీ తర్వాత వినిపించనున్న పేరు.. నిస్సందేహంగా యోగీ మహరాజ్‌దేనేమో?!

LEAVE A RESPONSE