బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పొడిచింది!

– ఫలించిన చంద్రబాబు కృషి
– ముర్ము పర్యటన తర్వాత మారిన బీజేపీ వైఖరి
– వైసీపీ పాలనపై పెరుగుతున్న వ్యతిరేకతతో బీజేపీలో మార్పు
– తెలంగాణలో కమ్మ-సెటిలర్ల ఓట్ల కోణం
– వైసీపీపై పెరుగుతున్న బీజేపీ నేతల ఎదురుదాడి
– నలుగురైదుగురు మినహా టీడీపీతో పొత్తు ఉండాలంటున్న బీజేపీ సీనియర్లు
– మోదీలో మార్పు ఫలితమే ఈ పరిణామాలు
– ఎన్నికల ముందు టీడీపీపై ఆగ్రహంతో ఉన్న మోదీ
– చాలాకాలం తర్వాత చంద్రబాబు వివరణతో సంతృప్తి
– బీజేపీకి 12 లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకారం?
– 15 వరకూ అసెంబ్లీ స్థానాలు?
– చక్రం తిప్పిన హోంమంత్రి అమిత్‌షా
– ఇప్పటికే జనసేనతో పొత్తు ఖరారు?
– 25 అసెంబ్లీ స్థానాలకు జనసేన పోటీ?
– వచ్చే ఎన్నికల్లో మళ్లీ నాటి త్రిబుల్ కాంబినేషన్
( మార్తి సుబ్రహ్మణ్యం)

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ నాటి ‘సక్సెస్‌ఫుల్ త్రిబుల్ కాంబినేషన్’ కలసి కదనరంగంలోకి దిగనున్నాయా? టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య అనధికారికంగా మళ్లీ పొత్తు పొడిచిందా? ఆ మేరకు తెరవెనుక జరగవలసిన కథ శరవేగంతో జరిగిపోతోందా? ముందు టీడీపీతో పొత్తు వద్దన్న మోదీ, ఇప్పుడు ముద్దనడంతోనే ఈ పరిణామాలు మారిపోయాయా? ఈ కథలో అమిత్‌షా కీలకపాత్ర పోషించారా? ఇప్పటికే జనసేనతో దాదాపు పొత్తు ఖరారు చేసుకున్న టీడీపీ.. ఇక బీజేపీతో కూడా పొత్తుబంధ ం ఖరారు చేసుకుందా? ఆ మేరకు ఎన్నిసీట్లకు పోటీచేయాలన్న సూత్రపాయ నిర్ణయం కూడా జరిగిపోయిందా?.. ఇదీ ఇప్పుడు టీడీపీ-బీజేపీ-జనసేన వర్గాల్లో హాట్ టాపిక్.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు-శాశ్వత మిత్రులు ఉండరన్నది ప్రతి ఎన్నికల్లోనూ రుజువవుతూనే ఉంది. గత ఎన్నికల ముందు.. విడాకులు తీసుకున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు, మళ్లీ తమ బంధాన్ని పున రుద్ధరించుకునే దిశగా వేస్తున్న అడుగులు, పొత్తు లక్ష్యాన్ని చేరుకునేలా కనిపిస్తున్నాయి. ఆ మేరకు బీజేపీ అగ్ర నాయకత్వంతో టీడీపీ నాయకత్వం నిర్వహిస్తున్న చర్చలు ఫలించినట్లు సమాచారం.

రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలసి పోటీ చేసేందుకు, బీజేపీ జాతీయ నాయకత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇందుకు నాలుగున్నరేళ్ల సమయం పట్టింది. గత ఎన్నికల ముందు మోదీ సర్కారుపై యుద్ధం ప్రకటించిన టీడీపీ, ఫలితాల్లో అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. నాటి నుంచీ వైసీపీ ప్రత్యక్షంగా-పరోక్షంగా బీజేపీతో కొనసాగుతోంది. పార్లమెంటులో రెండు పార్టీల సమన్వయం కూడా బలపడింది. ఏపీలో జగన్ తీసుకునే నిర్ణయాలకు కేంద్రం మద్దతునిస్తోంది. ప్రధానంగా, జగన్ సర్కారు ఆర్ధికంగా కష్టాలపాలయినప్పుడల్లా, కేంద్రం ఆపద్బాంధవుడిలా ఆదుకుంటోంది.

అందుకు తగినట్లుగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సహా, నలుగురైదుగురు రాష్ట్ర నాయకులు కూడా, జగన్ ప్రభుత్వంపై సానుకూలంగానే వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తుంటాయి. పైకి జగన్ సర్కారును ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, అంతర్గతంగా మాత్రం జగన్ సర్కారుకు మద్దతుదారులన్న ముద్ర, వీరిపై బీజేపీ బలంగానే ఉందన్నది బహిరంగ రహస్యం. వీరంతా టీడీపీని మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నవారే కావడం గమనార్హం.

నిజానికి గత ఎన్నికల ముందు.. తనపై యుద్ధం ప్రకటించిన టీడీపీపై, ప్రధాని మోదీ ఇటీవలి కాలం వరకూ ఆగ్రహంతోనే ఉన్నారు. అయితే.. తాను ఏపీకి ప్రత్యేక హోదా కోసమే అప్పట్లో కేంద్రంపై యుద్ధం ప్రకటించానే తప్ప, బీజేపీ లేదా వ్యక్తులపై కాదని స్వయంగా చంద్రబాబునాయుడు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అప్పటికీ సుముఖంగా లేని ప్రధాని మోదీకి.. ఏపీలో జగన్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత, రానున్న ఎన్నికల్లో విపక్షాల ఏకీకరణ, దక్షిణాదిలో పార్టీ విస్తరణ వంటి రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని , టీడీపీతో మళ్లీ పొత్తుకు అంగీకరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అధికారం కోల్పోయిన తర్వాత.. తొలిసారితో మోదీతో భేటీ అయిన బాబు పట్ల, ప్రధాని సానుకూల వైఖరితో మాట్లాడటం, బీజేపీ నేతల వద్ద కూడా గతంలో జరిగిన విషయాలపై మనసువిప్పి మాట్లాడటం కూడా,Narendra-Modi-Chandrababu-Naidu-Delhi మారిన బీజేపీ మనసుకు మరో కారణమన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మోదీ-బాబు భేటీపై వైసీపీ నేతలు వరస వెంట విమర్శలు, వ్యాఖ్యలు చేశారంటే, ఆ అంశం ఏపీ భవిష్యత్తు రాజకీయాలపై ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో స్పష్టమవుతుంది.

వీటికి మించి.. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న హోంమంత్రి అమిత్‌షా కూడా.. భవిష్యత్తులో దక్షిణాదిలో పార్టీ విస్తరణ దృష్ట్యా, టీడీపీతో చెలిమి అవసరమని గుర్తించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్ధి ముర్ము విజయవాడ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఆమెతో టీడీపీ నాయకత్వం సమావేశం ఏర్పాటుచేయకుండా, వైసీపీ నాయకత్వం శతవిధాలా ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న అమిత్‌షా స్వయంగా రంగంలోకి దిగి, టీడీపీ ప్రజాప్రతినిధులతో ముర్ము భేటీ ఏర్పాటుచేయించడాన్ని విస్మరించకూడదు.

ప్రధానంగా.. తెలంగాణలో అధికారం లోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీకి.. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు.. దాదాపు 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న కమ్మ- ఆంధ్రా సెటిలర్ల ఓట్లు కీలకమన్న తెలంగాణ బీజేపీ అగ్రనేతల నివేదిక కూడా, అమిత్‌షా టీడీపీ వైపు మొగ్గు చూపేందుకు మరో ప్రధాన కారణమంటున్నారు. బీజేపీపై ఆంధ్రా సెటిలర్లు, కమ్మ సామాజికవర్గానికి ప్రత్యేకించి ఆగ్రహం లేకపోయినప్పటికీ.. ఏపీలో జగన్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతునిస్తోందని, ప్రధానంగా… అమరావతికి అడ్డంకులు సృష్టిస్తున్న వైసీపీకి సహకరిస్తోందన్న అంశమే, బీజేపీపై హైదరాబాద్‌లోని సెటిలర్ల ఆగ్రహానికి కారణమని బీజేపీ నాయకత్వం ఆలస్యంగా గ్రహించినట్లు తెలుస్తోంది.

ఈ కారణంతోనే వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు, ఏపీ బీజేపీ నాయకులు ఇటీవలి కాలంలో అమరావతి రైతుల ఉద్యమానికి, బాహాటంగానే మద్దతునిస్తున్నారు. వారి కార్యక్రమాలకు స్వయంగా హాజరవుతున్నారు. అసలు గుంటూరు జిల్లా పార్టీనే, అమరావతి కోసం పాదయాత్ర నిర్వహించడం విశేషం. గతంలో న్యాయస్థానం టు దేవస్థానం ముగింపు సభకు.. బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడైన కన్నా లక్ష్మీనారాయణ హాజరుకాగా, తాజాగా అమరావతి టు అరసవెల్లి పాదయాత్రకు, భీమవరంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ హాజరయి మద్దతు ప్రకటించారు. ఈవిధంగా బీజేపీ-టీడీపీ పొత్తు బంధంలో అమిత్‌షా కీలకపాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

దానికితోడు ఇటీవలి కాలంలో.. సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, కన్నా లక్ష్మీనారాయణ, ఆదినారాయణరెడ్డి, నాగోతు రమేష్‌నాయుడు వంటి నేతలు జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. దానితో వైసీపీ సత్యకుమార్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆయనపై మాటల దాడి ప్రారంభించింది. రాజకీయ ప్రత్యర్ధులను తన మాటలతో వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే సత్యకుమార్ ప్రకటనలు, సరిగ్గా వైసీపీ వ్యూహబృందానికి ఎక్కడ తగలాలో అక్కడే తగిలినట్లు , మంత్రులు ఆయనపై చేసిన ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. కొద్దిరోజులు రాజకీయ ప్రకటన యుద్ధం, బీజేపీ-వైసీపీ మధ్య జరగడం ప్రస్తావనార్హం.

నిజానికి టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలను, విపక్షాలు విమర్శించినప్పటికీ, టీడీపీ మాత్రం ఆ విమర్శలకు దూరంగానే ఉండటం గమనార్హం. పైగా పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన అనేక బిల్లులతోపాటు, రాష్ట్రపతి-ఉప రాష్ట్రపతి వంటి ప్రతిష్టాత్మక ఎన్నికలకూ, బీజేపీకే మద్దతునివ్వడం విస్మరించకూడదు.

ఈ నేపథ్యంలో మళ్లీ దగ్గరయిన బీజేపీ-టీడీపీ బంధం, లోక్‌సభ స్థానాలపై చర్చల వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. ఏపీలో 12 లోక్‌సభ స్థానాలు, బీజేపీ ఇచ్చేందుకు సూత్రప్రాయ నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. టీడీపీ నాయకత్వం కూడా బీజేపీకి అసెంబ్లీ స్థానాల కంటే, లోక్‌సభ స్థానాలే ముఖ్యం కాబట్టి.. లోక్‌సభకు ఎక్కువ సీట్లు ఇచ్చి, అసెంబ్లీకి 15 సీట్ల వరకూ ఇచ్చేందుకు అంగీకరించిందన్నది సమాచారం.

ఇక చాలాకాలం నుంచీ టీడీపీ-జనసేన పొత్తు ఖరారయిందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. జగన్ సర్కారుపై యుద్ధం చేస్తున్న జససేనాధిపతి పవన్‌ను, టీడీపీతో కలవకుండా వైసీపీ వ్యూహబృందం ఎంత రెచ్చగొట్టినా జనసైనికులు సంయమనం కోల్పోవడం లేదు. అసలు జనసేన 175 స్థానాల్లో పోటీ చేస్తుందా? లేదా?, అన్ని సీట్లలో పోటీ చేసే ధైర్యం ఉందా? అంటూ వైసీపీ నేతలు- మంత్రులు ఎంత రెచ్చగొట్టినా, పవన్ సహా జనసైనికులు పెదవి విప్పకపోవడానికి ఇదే కారణమంటున్నారు.

కాగా.. రానున్న ఎన్నికల్లో జనసేనకు 25 సీట్ల వరకూ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే జనసేన పట్టు ఎక్కువగా ఉన్నట్లు, ఇటీవల ఎంపీ రఘురామకృష్ణంరాజు నిర్వహించిన సర్వేలో వెల్లడయిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో పొత్తులో భాగంగా కేటాయించే సీట్లు కూడా, ఆ మేరకు ఉండనున్నట్లు కనిపిస్తోంది.

Leave a Reply