– బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్
హైదరాబాద్: ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పథకాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, రోడ్లు, రైల్వేలు, భద్రత, ఇంధనం, సాంకేతికత వంటి అనేక రంగాలలో ఈ ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం గత వంద రోజుల పాలనలో, సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వివరించారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రగతి నివేదన రూపంలో ప్రజల ముందుంచారు. అయితే, దేశంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలనను మెచ్చి ప్రజలు పట్టం కడుతుంటే, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ, నెహ్రూ కుటుంబం జీర్ణించుకోలేక, అబద్ధపు ప్రచారంతో దాడి చేస్తున్నారంటూ లక్ష్మణ్ మండిపడ్డారు.
రాహుల్ గాంధీ భారత ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించకుండా, విదేశాలకు వెళ్లి అక్కడ దేశంపై విషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని మోదీ గారిపై నిందలు వేయడం రాహుల్ గాంధీకి పరిపాటిగా మారిందంటూ దుయ్యబట్టారు.
ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి తో పాటు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా వాటిని నెరవేర్చేలా నరేంద్ర మోదీ పాలన అందిస్తుంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తూ కాలం వెల్లదీస్తోందంటూ విమర్శించారు.
హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలో గ్యారంటీల పేరుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను హామీలు అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మోదీ 3.O పాలనలో 100 రోజుల్లో జరిగిన అభివృద్ధిని, తీసుకున్న నిర్ణయాలను, సంక్షేమ కార్యక్రమాలపై ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల ముందుంచారు.