Home » లోకేష్, పవన్ ఇద్దరూ బఫూన్లే

లోకేష్, పవన్ ఇద్దరూ బఫూన్లే

– సరుకు లేని లోకేష్ పాదయాత్ర చేసి ఏం ప్రయోజనం?
– అది యువ గళమో.. గరళమో త్వరలోనే తెలుస్తుంది
– గొడ్డొచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ.. అన్నట్టు లోకేష్ రాకతో టీడీపీ పతనం!
– బాబు కొడుకుగా తప్పితే లోకేష్ కు ఏ అర్హత ఉంది?
-:మంత్రి అంబటి రాంబాబు
– తండ్రిపై పవన్ వ్యాఖ్యలపై.. చిరంజీవి, నాగబాబులు సమాధానం చెప్పాలి
– ఎంత మంది కట్టకట్టుకొని వచ్చినా.. జగన్ ఎదుట నిలబడలేరు
– పోలీసులపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు టీడీపీ పతనానికి నాంది
– గుంటూరులో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

అది యువ “గరళం”
నారా లోకేష్‌ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్ర.. కొంత దూరం పోయిన తర్వాత ప్రజలకు అర్ధం అవుతుంది. అది యువగళమా లేక యువ గరళమా అన్నది త్వరలోనే ప్రజలకు తెలుస్తుంది. లోకేష్‌ మాత్రమే కాకుండా, చంద్రబాబు కూడా ఆ గరళం తాగుతాడు. ఎందుకంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఒళ్లంతా పుండవుతుంది. అదే లోకేష్‌కు కూడా జరుగుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. గొడ్డొచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ.. అన్న సామెత ఉంది. అందరికీ తెలుసు. లోకేష్‌ రాజకీయాల్లోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితం అయింది.ఇప్పుడు యువగళం పేరుతో యాత్ర మొదలు పెట్టాడు. గరళం తీసుకుని బయలుదేరాడు. ఏం జరుగుతుందో చూద్దాం. లోకేష్‌ ఒక బఫూన్, ఒక జోకర్‌. ఆయనకు పర్సనాలిటీ, క్యారెక్టర్‌ రెండూ లేవు. అయినా ఆయనను రాష్ట్రం మీద రుద్దాలని లోకేష్‌ తల్లిదండ్రులు తాపత్రయ పడుతున్నారు. అందుకే లోకేష్‌ ఎన్ని పాదయాత్రలు చేసినా, ఆయన నాయకుడు కాలేడు. ఎందుకంటే ఆయన దగ్గర సరుకు లేదు. నాయకుడు అనే వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. పట్టుదల, చిత్తశుద్ధి ఉండాలి. అవేవీ లోకేష్‌కు లేవు.తన తండ్రి సీఎంగా పనిచేశారు కాబట్టి, తానూ సీఎం కావాలనుకుంటే ఎలా?

ఇద్దరూ బఫూన్ లే
రాష్ట్రంలో ఇద్దరు బఫూన్‌లు తయారయ్యారు. ఒకరు చంద్రబాబు పుత్రుడు, మరొకరు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌. ఒకాయన పాదయాత్రతో వచ్చినా.. మరొకరు వారాహి మీద వచ్చినా అంతా హాస్యమే.పవన్‌ నోటికి అడ్డూ అదుపు లేదు. ఆఖరికి తన తండ్రి గురించి ఏదేదో మాట్లాడతాడు.ఇక లోకేష్‌ తన తండ్రి కంటే గొప్పవాడినని చెప్పుకుంటున్నాడు. ఇద్దరి మాటలు అచ్చం జోకర్ల మాదిరిగా ఉన్నాయి.
బాబు కొడుకుగా తప్పితే ఏ అర్హత ఉంది? తన అర్హతలను ప్రశ్నిస్తున్నారని.. కానీ తాను మంత్రిగా ఎంతో సేవ చేశానని, రోడ్లు వేయించానని, చెట్టు నాటానని ఏదేదో లోకేష్ చెప్పాడు. మళ్లీ చెబుతున్నాం. లోకేష్‌కు ఏ అర్హతా లేదు. ఆయన ప్రత్యక్షంగా ఏ ఎన్నికలోనూ గెలవలేదు. కేవలం చంద్రబాబు కొడుకుగా ఎమ్మెల్సీ అయి, దొడ్డి దారిలో మంత్రి అయ్యాడు. కేవలం చంద్రబాబు తనయుడుగా తప్ప, లోకేష్‌కు ఒక్కటైనా అర్హత ఉందా? నిన్న ఉపన్యాసంలో లోకేష్‌ మాట్లాడినవన్నీ అసత్యాలే. పాదయాత్ర చేస్తున్న లోకేష్‌కు చిత్తశుద్ధి లేదు. తానేదో పెరగాలనే తాపత్రయంతో ఆయన పాదయాత్ర చేపట్టాడు. పాదయాత్రలు కొత్త కాదు. ఆనాడు మహానేత వైయస్సార్‌ గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత చాలా మంది పాదయాత్రలు చేశారు. నేను ఒకటి అడుగుతున్నాను. మీ సీఎం అభ్యర్థి ఎవరు? నీవా? లేక నీ తండ్రినా? లేక పవన్‌కళ్యాణ్‌నా?.

చిరంజీవి, నాగబాబులు సమాధానం చెప్పాలి
పవన్‌ తన పర్యటనల కోసం కొన్న వారాహి వాహనం గురించి కూడా లోకేష్‌ మాట్లాడాడు. అంటే ఇప్పటికే ప్యాకేజీ కుదిరిందా?. ఇక పవన్‌ కూడా దారుణంగా మాట్లాడుతున్నాడు. తన నానమ్మ దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే, దాంతో తన తండ్రి సిగరెట్‌ వెలిగించుకున్న హేతువాది అన్నాడు. ఆ విధంగా ఆయన తన తండ్రిని అవమానించాడు. అది నిజమో, అబద్ధమో చిరంజీవి లేదా నాగబాబు చెప్పాలి. ఏమిటా దుర్మార్గమైన మాటలు. హేతువాదులైనంత మాత్రాన, మరొకరి విశ్వాసాలను, నమ్మకాలను దెబ్బతీసే హక్కు పవన్ కల్యాణ్ కు ఎక్కడిది..?భాష మీద పట్టు లేని వారు, చిత్తశుద్ధి లేని వారు, ఏం మాట్లాడుతున్నారో తెలియని వారు వీరు.

టీడీపీకి సంస్కారం లేదు.. మీరే భోజనం ఏర్పాట్లు చేసుకోండి: పోలీసులకు అంబటి సూచన
నిన్న కుప్పం సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులను ఉద్దేశించి చాలా దారుణంగా బూతులు మాట్లాడాడు. అది వారి పతనానికి నాంది. ఆశించిన స్థాయిలో ప్రజా సమీకరణ, ప్రజల్లో స్పందన లేకపోవడంతో తెలుగుదేశం నేతల్లో ఫ్రస్టేషన్‌ మొదలైంది. మరోవైపు అందరూ ఏకమై జగన్‌ని ఓడిస్తామని అంటున్నారు. అవన్నీ పిచ్చి మాటలు. యువగళం పేరుతో వస్తున్న లోకేష్‌కు జనం తగిన బుద్ధి చెబుతారు. తమ భద్రత కోసం పని చేస్తున్న పోలీసుల గురించి టీడీపీ నేతలు అలా మాట్లాడడం దారుణం. వారు తిండి కోసం రారు. ఈ విషయాన్ని గుర్తించాలి. సిన్సియర్‌గా పని చేసే పోలీసులకు నాదొక విజ్ఞప్తి. యువగళం యాత్రలో డ్యూటీ చేస్తున్న పోలీసులు.. భోజన ఏర్పాట్లు సొంతంగా ఏర్పాటు చేసుకొండి. ఎందుకంటే టీడీపీ నేతలు, అచ్చెన్నాయుడుకు ఏ మాత్రం సంస్కారం లేదు.

జగన్ ఎదుట నిలబడలేరు
రాష్ట్రంలో మూడున్నర ఏళ్లుగా చిత్తశుద్ధితో, పారదర్శకతతో అద్భుతమైన పరిపాలనను జగన్‌గారు అందిస్తున్నారు. అందుకే ఎంతమంది, కట్ట కట్టుకుని వచ్చినా, జగన్‌ ఎదుట నిలబడలేరు. ఓడిపోక తప్పదు. ప్రతి పథకాన్ని అర్హతే ప్రామాణికంగా అమలు చేస్తున్నారు. అన్ని పథకాలు, కార్యక్రమాలు పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నారు. జనం గుండెల్లో జగన్ ఉన్నారు. మా ప్రయాణం ఎలాంటిది? మా పోరాటం ఎలాంటిది? ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాం? మా నేతను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టినా, ఆయన భయపడలేదు. వెనక్కు తగ్గలేదు. మా పార్టీ నుంచి 23 మందిని సంతల్లో పశువుల్లా కొనుగోలు చేసి, వారిలో నలుగురిని మంత్రులుగా కూడా చంద్రబాబు చేశారు. ఎవరు పాదయాత్ర చేసినా, మరొకరు వారాహి మీద వచ్చినా మేము భయపడేది లేదు. ఎందుకంటే మేము ప్రజల్లో ఉన్నాం. వారి ఆదరాభిమానాలు పొందాం. పులి ఎవరో? నక్క ఎవరో? తెలుసు కదా?. పులి పోరాటం చేసి అధికారం చేపట్టింది. నక్క దాన్ని చూసి వాతలు పెట్టుకుంటుంది. ఒళ్లు పుండ్లు పడుతుంది తప్ప, మరేదీ ఒరగదు.చంద్రబాబు కూడా గతి తప్పారు. సీనియర్‌ నాయకుడు. అయినా తనలో విశ్వాసం పోయింది. అందుకే మాట్లాడితే తప్పులు దొర్లుతున్నాయి. సైకిల్‌ పోవాలి.. అని పిలుపునిస్తున్నాడు. మేము ఒక్కటే చెబుతున్నాం. మీరు అందరూ కలవాలని ఎందుకు అనుకుంటున్నారు? మా బలం చాలా ఎక్కువ అనే కదా? అది వాస్తవం. అంతిమ విజయం వైయస్సార్‌ కాంగ్రెస్‌దే.

Leave a Reply