మంచిర్యాల : పుష్ప సినిమా తరహాలో కొందరు స్మగ్లర్లు అతి తెలివి ఉపయోగిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు అంతు చి క్కని రీతిలో గంజాయి రవాణా చేస్తున్నారు. తాజాగా రాత్రి మంచిర్యాల జిల్లాలో కొందరు దుండగులు పైన ఇటుకలు..లోపల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడడంతో అసలు నిజం బయటపడింది.
ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి గంజాయి తరలింపు కోసం కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. పెద్ద మొత్తంలో గంజాయిని ట్రాక్టర్ లో ఉంచి పైన సిమెంట్ ఇటుకలు పేర్చి సరఫరా చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోర్లా పడింది. చేసేది లేక నిందితులు వాహనం వదిలేసి పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుపై పడి ఉన్న ఇటుకలను తొలగిస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఇటుకల కింద ఉంచిన ఒక్కో ప్యాకెట్ లో ఐదు కిలోల గంజాయి చొప్పున 5 క్వింటాలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వాహనంతో పాటు గంజాయిని పోలీస్ స్టేషన్ కు తరలించి పోలీసులు విచారణ ప్రారంభించారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లినట్టు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకుంటే ఎక్కడినుండి ఎక్కడికి గంజాయి సరఫరా చేస్తున్నారని అంశం బహిర్గతం అవుతుంది.