బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూత

-రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ ఎమ్మెల్యే
-లాస్యను వెంటాడిన రోడ్డు ప్రమాదాలు
-చివరికి తప్పని మృత్యువు
-గత ఎన్నికల ముందు తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి
-సాయన్న కుటుంబాన్ని వీడని విషాదం
-పలువురి దిగ్భ్రాంతి

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలో ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె పీఏ ఆకాశ్‌ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. సమాచారం అందకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతకు ఆమె కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లాస్య నందిత ఇటీవలే ఓ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బీఆర్ఎస్ కార్యానిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి అప్పుడు పరామర్శించారు కూడా. కొన్ని రోజుల్లో మళ్లీ ఆమె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం విషాదంగా మారింది. ఇక దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. ఆయన చనిపోవడంతో బీఆర్ఎస్‌ లాస్య నందితకు సీటు ఇచ్చి పోటీ చేయించింది.

లాస్యను వెంటాడిన ప్రమాదాలు
ఎమ్మెల్యేగా ఆమె పదవిని చేపట్టి ఏడాది కూడా కాకమునుపే కన్నుమూశారు. తొలుత లిప్ట్‌లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి ఆమె బయటి పడ్డారు.ఆ తరువాత నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండవ సారి‌ ప్రమాదానికి గురయ్యారు. మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ మృతి చెందారు. ఆ సమయంలో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పది రోజులు గడువక‌ ముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది.

సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదన్నారు. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం.. ఇదే నెలలో నందిత కూడా ఆకస్మిక మరణం పాలవడం అత్యంత విషాదకరమన్నారు.

కేసీఆర్ సంతాపం
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

చంద్రబాబు విచారం
కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. సాయన్న టీడీపీలో ఉన్నప్పుడు అత్యంత క్రమశిక్షణ గల నాయకుడిగా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన లాస్య కుటుంబానికి త న సానుభూతి వ్యక్తం చేశారు.

తలసాని విచారం
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి వార్త తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య మూడు నెలల్లోనే ఇలా అందరికీ దూరం అవుతుందని అనుకోలేదన్నారు. లాస్య కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలుపుతున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

తెలంగాణ టీడీపీ నేతల దిగ్భ్రాంతి
ఎమ్మెల్యే లాస్య నందిని మృతిపై టీడీపీ తెలంగాణ ఇన్చార్జి కంభంపాటి రామ్మోహన్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి, కార్యనిర్వహక కార్యదర్శి మండూరి సాంబశివరావు, కానూరు జయశ్రీ, అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్‌రావు, నగర అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్, టీడీపీ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు బుజ్జి యాదగిరిరావు సంతాపం ప్రకటించారు.

Leave a Reply