– మొదటిసారి బీసీ జనాభా లెక్కల సేకరణ
– పూర్తిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ
– అన్ని స్థానాల్లో బిజెపి స్వతంత్ర పోటీ
– 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
– ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ విచారణ ఎందుకు అడగటం లేదు?
– బనకచర్ల ప్రాజెక్టు లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు
– కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పార్టీలు డూప్ ఫైటింగ్
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్: దేశంలో జనగణనతో పాటే కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 16 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ జనగణన 2027 మార్చి 1 నాటికి పూర్తవనుంది.ఇది నూతన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నూతన ఒరవడి తెస్తుంది. జనగణన కోసం 34 లక్షల గణకులు, సూపర్‌వైజర్లు, 1.34 లక్ష మంది సిబ్బంది పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుంది. ప్రతి వ్యక్తి వివరాలు భద్రంగా ఉండేలా అనువైన యాప్ రూపకల్పన జరుగుతోంది.
స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారి, బీసీ జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను, తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించడం కోసం.. పార్టీ చేపట్టిన కార్యక్రమాలు పూర్తిగా విజయవంతమవుతున్నాయి. జూన్ 8–18 తేదీల్లో జరిగే కార్యక్రమాలకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.
తెలంగాణలో స్థానిక సంస్థల (పంచాయతీరాజ్, మున్సిపల్) ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలు ఇప్పటికే జరగాల్సి ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది చాలా ఆలస్యం అయింది. కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ముందుగానే ప్రకటించి, పోటీ చేసే అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు సరైన అవగాహనతో ఎన్నికల్లో పాల్గొనేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అనుగుణంగా ఈ ఎన్నికలను నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
బిజెపి స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్రంగా, సంపూర్ణంగా పాల్గొంటుంది. అన్ని స్థానాల్లో కూడా స్వతంత్రంగా పోటీ చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నూతన యువతను ప్రోత్సహిస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వెయ్యి మంది యువత ముందుకు రావాలని ప్రకటించారు.
ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతను ప్రోత్సహించే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పోటీచేస్తుంది. ఆ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రకటించిన తర్వాత.. దానిపై బిజెపి పోలింగ్ బూత్ కమిటీల నుంచి మొదలు స్టేట్ పార్టీ వరకు అన్ని రకాల నిర్ణయం తీసుకుంటుంది.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే దాటిపోయింది. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే దాటిపోయింది. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. గ్రామాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదు. వీధిలైట్లు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ పర్యవేక్షణ లేదు.
గత పదేళ్లుగా నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు 15వ ఫైనాన్స్ ఆధారంగా నిధులు ఇస్తోంది. మన్రేగా నిధులు కూడా కేంద్రమే ఇస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి గత బీఆర్ఎస్ పాలనలో, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఖర్చు పెట్టలేదు.
పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచుల లేమి కారణంగా ఈరోజు పాలన మరింతగా అటకెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా గ్రామపంచాయితీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంతో ఎన్నికలను వాయిదా వేయడం సరికాదు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతిబింబంగా ఉంటాయి.
కానీ, మన రాష్ట్రంలో ప్రతిసారి ఒక తతంగంలా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ తరఫున రాష్ట్ర హైకోర్టుకు కూడా వెళ్లాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రజావ్యతిరేక చర్యలపై సీబీఐ విచారణ జరపాలని సుద్దపూసలా మాట్లాడుతూ ఉత్తరం రాసింది. మరి ఇప్పుడు ఆ మాటలు ఎటు పోయాయి? ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ విచారణ ఎందుకు అడగటం లేదు?
గతంలో ప్రభుత్వం హైకోర్టుకు సూచించినట్లు న్యాయవాదుల ఫోన్లు, అనేక మంది వ్యాపారస్తులు, సినిమా నటులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చివరకు నాతో పాటు బీజేపీ ఆఫీసులో పనిచేసే సిబ్బంది, బీజేపీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొనడం జరిగింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర విచారణ జరిగేలా, దోషులకు శిక్షపడేలా సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర న్యాయస్థానం ఆదేశించాలని కోరుతూ బీజేపీ తరఫున పిటిషన్ వేశాం. అందుకు అనుగుణంగా హైకోర్టు తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం.
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పీఎఫ్ఆర్ (ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్) ను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది. బనకచర్లపై తెలంగాణ నుంచి లేవనెత్తిన అంశంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక నివేదిక కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు, సెంట్రల్ వాటర్ కమిషన్‌కు ఇచ్చింది.
జల ఒప్పందాలపై విధానాలు, నిబంధనలు, నదులపై ఉన్న గైడ్‌లైన్లు, అనేక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సెంట్రల్ వాటర్ కమిషన్ సమగ్రంగా పరిశీలన జరుపుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇంతవరకు ఎవరికీ అన్యాయం జరగలేదు. జరిగే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించాలి.
కొంతమంది దుందుడుకు విధానంతో కేంద్రమంత్రులు ఏం చేస్తున్నారు అంటూ విమర్శలు చేయడం సరికాదు. బీజేపీపై విమర్శలు చేయడం సమంజసం కాదు. రెండు రాష్ట్రాలు – నీటి పంపకాలు, వరద జలాల విషయంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా ఆ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి పరిష్కారం చేయడం జరుగుతుంది.
ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎటువంటి సమాచార మార్పిడి జరగలేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల హక్కులను కాపాడే విషయంలో, రాష్ట్రానికి న్యాయం జరగేలా చర్యలు తీసుకునేలా కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంతకుముందు డిమాండ్ చేశాను.
కావున ఈ విషయంలో ఉత్తరం రాయడంతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ద్వారా ఏపీ ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడేలా ఇనిషియేటివ్ తీసుకోవాలి. సమస్యలను పరిష్కరించుకోవాలి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ – “రెండు తెలుగు రాష్ట్రాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. భేషజాలు లేవు. బేసిన్ల గొడవ లేదు. అపోహలు లేవు. వివాదాలు అక్కర్లేదు. వివాదాలే కావాలంటే మరో తరానికి కూడా మనం నీళ్లు ఇవ్వలేము” అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఆలోచించరు. ప్రజలు నమ్మి మాకు ఓటేశారు. వారికి మేలు చేయడమే మా బాధ్యత. రెండు రాష్ట్రాలు కలిసి నడిచినప్పుడే ప్రగతి సాధ్యమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి అనేక విషయాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. పూర్తి అవగాహనతో, పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ, రెండు రాష్ట్రాల ప్రజలే మనవారన్న భావనతో ముందుకు సాగాలని కేసీఆర్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ముఖ్యమంత్రులు కలిసి పాల్గొనడం మంచి సంకేతాన్ని ఇచ్చిందని అప్పట్లో కేసీఆర్ చెప్పారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగాలి. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మూడు టీఎంసీల నీరు తన్నుకుపోతున్న సమయంలో కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉండిపోయి స్పందించలేదు.
కానీ ప్రతీదానికీ బీజేపీని విమర్శించడం కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలకు అలవాటుగా మారింది. ప్రజలకు న్యాయం చేయకుండా, చేతులు దులుపుకునేలా, అవతలి వారిపై రాళ్లు వేస్తూ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం ఈ రెండు పార్టీలూ చేస్తున్నాయి. ఇప్పటికైనా అందరం కలిసి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో గత మార్గదర్శకాలను అనుసరించాలి.
కాళేశ్వరం విషయంలో అప్పుడు, ఇప్పుడూ బీజేపీ ఒకే మాట చెబుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో దోపిడీ జరిగింది. ఆర్థికంగా, సాంకేతికంగా ఈ ప్రాజెక్టు సాధ్యసాధ్యాల పరంగా అనేక అనుమానాలు ఉన్నాయని తెలంగాణ ఇరిగేషన్ రంగానికి చెందిన నిపుణులే అప్పుడే చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీకి పగుళ్లు రావడంతో ఆ అనుమానాలు వాస్తవమేనని నిరూపితమైంది.
బీజేపీ స్టాండ్ ఎప్పటిలానే స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు కోరాం. ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. గతంలో సీబీఐ దర్యాప్తు కోరిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారి స్టాండ్ ను మార్చుకుంది.
నక్సలైట్ల హింస ద్వారా, రక్తపాతం ద్వారా, తుపాకీ గొట్టం ద్వారా సమాజంలో మార్పు రాదు. గతంలో అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పోలీస్ అధికారులు, నక్సలైట్లు కాల్పులు, ఎన్‌కౌంటర్లలో చనిపోయారు.
ఇప్పటికైనా నక్సలైట్లు ఆయుధాలు వదిలి ముందుకు రావాలి. నక్సలైట్లు ఆయుధాలు వదిలి ముందుకు వస్తే, అందరూ స్వాగతం పలుకుతారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక పోరాటాలు చేయవచ్చు. ‘ఎలిమినేషన్’ అనే పేరుతో హింసను కొనసాగించడమంటే అది సమంజసం కాదు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు బిజెపి ఆఫీసులో తయారు చేస్తున్నారనే బీఆర్‌ఎస్ విమర్శలు వాస్తవ విరుద్ధమైనవి. రానున్న రోజుల్లో బిజెపి ని అడ్డుకోవాలని, తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావొద్దని కాంగ్రెస్ హైకమాండ్–కేసీఆర్ కుటుంబం కలసి చేసుకున్న ఒప్పందం ప్రకారమే బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పార్టీలు డూప్ ఫైటింగ్ చేస్తున్నాయి. ‘‘నువ్వు కొట్టినట్లు చెయ్, నేను ఏడ్చినట్లు చేస్తా’’ అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.
ఈ రెండు పార్టీల నిజ స్వరూపాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు కర్చుకాల్చి వాత పెట్టారు. మెడికల్ కాలేజీలకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం గత ముఖ్యమంత్రికి ప్రొఫార్మా పంపింది. అయితే ప్రొఫార్మా నింపకుండా దరఖాస్తు చేయలేదు.
కేంద్ర ప్రభుత్వం వచ్చిన దరఖాస్తులను ప్రాసెస్ చేసి ఆయా రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. కానీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సకాలంలో దరఖాస్తు చేయలేదు. ఇప్పుడేమో మెడికల్ కాలేజీలు తెలంగాణకు ఇవ్వలేదంటూ విమర్శిస్తున్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలలో, ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదు. కనీస వసతులు లేకుండా వైద్య విద్యార్థులకు విద్య ఎలా అందుబాటులోకి వస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రుల్లో కనీసం కొత్త కుర్చీలు, బెంచీలు కూడా కల్పించలేదు.
సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిని అనేక సంవత్సరాలుగా పర్యవేక్షణ చేస్తున్నం. ఇటీవలే ఈ హాస్పిటల్ కు ‘బెస్ట్ హాస్పిటల్’ అవార్డు వచ్చింది. ఈఎస్ఐ ఆసుపత్రులకు ఇప్పుడు గాంధీ ఆసుపత్రికన్నా ఎక్కువగా ఓపీ పేషెంట్లు వస్తున్నారు. అద్భుతమైన సౌకర్యాలతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.