— దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
– రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్
హైదరాబాద్: కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం, ఢిల్లీలోని కాలనియల్ పేర్ల మార్పు వంటి నిర్ణయాలు దేశ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే చర్యలు. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ సమైక్యతకు ప్రతీకగా ఈ మార్పులను తీసుకువస్తుంటే, తమిళనాడులోని ఒక సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుపై కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం దురదృష్టకరం.
అలాగే, 2017లో జీహెచ్ఎంసి పరిధిలో పాఠశాలల్లో “వందేమాతరం” గేయం ఆలాపనను తప్పనిసరి చేస్తూ సర్క్యులర్ జారీ చేసినప్పుడు, ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ దానికి వ్యతిరేకంగా మాట్లాడగా, వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అంటే, కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు — బీఆర్ఎస్ పార్టీ కూడా ముస్లింల ఓట్ల కోసం అదే రకమైన సంతుష్టీకరణ రాజకీయాలు చేసింది. ఈ ధోరణి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
2019లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం సచివాలయంలో “వందేమాతరం” గేయం ఆలాపనపై ఆంక్షలు విధించింది. 1950లో భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు “వందేమాతరం” గీతానికి జాతీయ గీత హోదా ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ దానిని తక్కువ చేయడం జాతీయ గౌరవానికి అవమానకరం.
ఇక ఇప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం “వందేమాతరం@ 150” పేరుతో నవంబర్ 7 నుండి 25 వరకు దేశవ్యాప్తంగా మహోత్సవాలను నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాల్లో భాగంగా నవంబర్ 7న దేశవ్యాప్తంగా 150 ప్రాముఖ్యమైన స్థలాల్లో, 150 మంది గాయకుల సమక్షంలో “వందేమాతరం” గేయం ఆలాపన జరగనుంది. ఈ సందర్భంగా వేలాది మంది పాల్గొనేలా వేదికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల నిర్వహణలో భాగంగా జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తాను ఇన్ఛార్జ్గా నియామకవ్వడం ఆనందంగా ఉంది.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వందేమాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమాలు నవంబర్ 8 నుండి 26 వరకు జరగనున్నాయి. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమాల ద్వారా రాజ్యాంగ విలువలు, దేశభక్తి, జాతీయ సమగ్రత వంటి అంశాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లడమే పార్టీ లక్ష్యం. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనూ భవ్యమైన కార్యక్రమాలు జరగనున్నాయి.
ప్రతి జిల్లా కేంద్రంలో వందేమాతరం 150వ వార్షికోత్సవానికి గుర్తుగా ప్రత్యేక ప్రదర్శనలు, స్వాతంత్ర్య సమరయోధుల జీవిత విశేషాలు, సెమినార్లు, ఎగ్జిబిషన్లు నిర్వహించబడతాయి. నవంబర్ 7న తెలంగాణలో ఐదు కేంద్రాల్లో — ఆదిలాబాద్, నిజామాబాద్, గోల్కొండ, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో — కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
నవంబర్ 8న మొదటి విడతగా 150 ప్రాంతాల్లో 150 మంది గాయకులు పూర్తి వందేమాతరం గేయాన్ని (నాలుగు నిమిషాల నిడివి కలిగిన పూర్తి వెర్షన్) సామూహికంగా ఆలపించనున్నారు. అనంతరం ఈ కార్యక్రమాలు జిల్లాల వారీగా, అసెంబ్లీ స్థాయిలో, స్కూల్లు మరియు కాలేజీలలో కొనసాగుతాయి.
సర్దార్ వల్లభభాయి పటేల్ గారి 150వ జయంతి ఉత్సవాలతో పాటుగా వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని కలిపి, కులమత, భాష, ప్రాంతాల అతీతంగా జాతీయ ఐక్యతను బలపర్చడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం. ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి ఉత్సాహాన్ని ప్రదర్శించాలని కోరుతున్నాం.