– మొంథా తుపాన్లో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి
– మీరు ప్రీమియమ్ కట్టి ఉంటే, వారికి పరిహారం ఉండేది
– ఉచిత పంటల బీమా ఎత్తేయడం వల్ల రైతులకు నష్టం
– ఈ రబీ నుంచి ఉచిత పంటల బీమా అమలు చేయాలి
– ఈరోజు పంటల బీమాలో కేవలం 19 లక్షల రైతులు
– మిగిలిన రైతులందరి పరిస్థితి ఏమిటి?
– రైతులకు న్యాయం చేసే వరకు పోరాడతాం
– రైతుల పక్షాన నిలుస్తాం. వారికి తోడుగా ఉంటాం
– మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రకటన
ఆకుమర్రులాకు. కృష్ణా జిల్లా: మొంథా తుపాన్ వల్ల నష్టపోయిన పంటలు పరిశీలించడంతో పాటు, రైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటించారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాలలో పర్యటించిన ఆయన తుపాన్లో నష్టపోయిన పంటలు పరిశీలించడంతో పాటు, రైతులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకున్నారు. చివరగా పెడన నియోజకవర్గం, గూడూరు మండలం, ఆకుమర్రులాకు వద్ద రైతులను కలుసుకున్న ఆయన, వారి బాధలు, కష్టాలు తెలుసుకున్నారు.
వ్యవసాయం దండగ అన్న సీఎం చంద్రబాబు అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో దాదాపు 16 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, దాంతో రైతులకు నష్టం కలుగుతోందని, అయినా ఏ ఒక్క రైతును ఆదుకున్న దాఖలా లేదని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు.
కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, పంట పొలాల్లోకి దిగిన వైయస్ జగన్తుపాన్లో నష్టపోయిన పంటలను స్వయంగా చూశారు. రైతులతో మాట్లాడి వారి బాధలు ఆరా తీశారు. వారి ప్రతి కష్టాన్ని, ఇబ్బందిని సావధానంగా విన్నారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
అందరూ మా ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నాడు ఏం జరిగినా రైతులు ఆందోళన చెందలేదు. జగనన్న ఉన్నాడు. ఆదుకుంటాడు అన్న భరోసా ఉండేది. ఉచిత పంటల బీమా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ కూడా వస్తుంది. ఏటా సీజన్ ఆరంభంలో పెట్టుబడి సాయం చేస్తాడు. అలా ఏటా రూ.13,500 తప్పనిసరిగా ఇస్తాడు అన్న నమ్మకం రైతుల్లో ఉండేది.
ఇప్పుడు చంద్రబాబు పాలనలో కేవలం 19 లక్షల మంది రైతులకు, 19 లక్షల ఎకరాలకు మాత్రమే పంటల బీమా ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? వారికి పంటల బీమా లేదు. మరి వారి పరిస్థితి ఏమిటి?. వారందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు? ఈరోజు ఈ రైతు ఒకే విషయం చెప్పాడు. ఎక్కడా, ఏ రైతు వద్దకు, ఏ పొలం వద్దకు ఎవరూ ఎన్యుమరేషన్ కోసం రాలేదు.
ఇంకా ఇక్కడ ఒక దారుణ అంశం ఏమిటంటే.. ఇది అక్టోబరు 30న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్. ఎన్యుమరేషన్, సోషల్ ఆడిటింగ్ ఆ మర్నాటికల్లా (అంటే అక్టోబరు 31. కేవలం ఒకే ఒక్క రోజు) పూర్తి కావాలని అందులో ఆదేశించారు. అక్కడ ఇంకో పేరాలో ఏం రాశారంటే.. అక్టోబరు 31 నాటికి అవి కచ్చితంగా పూర్తి చేయాలి. ఆ పని చేయకపోతే, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారట. ఆ తర్వాత రైతులు కనీసం దరఖాస్తు కూడా చేయడానికి వీలు లేదు. ఆ వివరాలు నవంబరు 1నాటికి కలెక్టరేట్‌కు చేరాలట. ఇది ఎంత దారుణం. కేవలం ఒకే ఒక రోజులో పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తారు? అది సాధ్యమేనా?
అసలు ఈ–క్రాప్ అంటే. రైతులను పొలాల్లో నిలిపి ఫోటో తీయాలి. కానీ, ఇప్పుడు ఈ–క్రాప్ పేరుకే చేస్తున్నారు. ఇంకా వాస్తవ పంటలకు మించి ఈ–క్రాప్ చూపుతున్నారు. టీడీపీ వారికి ఏకంగా ఉన్న భూమి కన్నా, ఎక్కువ పంట వేశారని చూపుతున్నారు. ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలికొదిలేసింది. ఇక్కడ ఇంత విపత్కర పరిస్థితులు ఉంటే, సీఎం ఏం చేశారు?. ఒకరోజు ఛాపర్లో అలా తిరిగి, మర్నాడు లండన్ వెళ్లిపోయారు. ఆయన కొడుకు ఆస్ట్రేలియాలో పర్యటించి వచ్చి, మర్నాడు క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం ముంబై వెళ్లాడు. ఇది వాళ్ల వ్యవహారశైలి.
చంద్రబాబు తప్పిదం వల్ల రైతులకు పంటల బీమా పరిహారం రావడం లేదు. మీరు ప్రీమియమ్ కట్టి ఉంటే, వారికి పరిహారం ఉండేది. ఉచిత పంటల బీమా మీరు ఎత్తేయడం వల్ల, వారికి నష్టం జరుగుతోంది. కాబట్టి, అది ఇచ్చి మీరే ఆదుకోవాలి. రబీ నుంచైనా కచ్చితంగా ఉచిత పంటల బీమా అమలు చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా తగ్గించి, తగ్గించి చివరకు రూ.600 కోట్లు బకాయి పెట్టారు. అది వెంటనే ఇవ్వాలి.