Home » పశుసంవర్ధక పథకాలకు కేంద్రం ప్రశంసలు

పశుసంవర్ధక పథకాలకు కేంద్రం ప్రశంసలు

– వివిధ రాష్ట్రాల మంత్రుల వీడియో కాన్ఫరెన్సులో కేంద్ర మంత్రి రూపాలా, తలసాని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు బెష్ అని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంసించారు. సోమవారం కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా వివిధ రాష్ట్రాల పశుసంవర్ధక శాఖ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, తెలంగాణా రాష్ట్రం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వివిధ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి KCR ఆధ్వర్యంలో అమలు పరుస్తుందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జీవాల వద్దకే వెళ్ళి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సెప్టెంబర్ 2017 సంవత్సరంలో 100 సంచార పశువైద్య శాలలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 19,26,640 లక్షల పశువులకు చికిత్స అందించడం జరిగిందని కేంద్ర మంత్రికి వివరించారు. ఇట్టి సేవలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కులవృత్తులను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు.
అందులో భాగంగా గొల్ల, కురుమలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనతో మొదటి విడతలో 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో 75 శాతం సబ్సిడీ పై గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, 6వేల కోట్ల రూపాయల ఖర్చుతో 2 వ విడతలో గొర్రెల పంపిణీని ప్రారంభించినట్లు వివరించారు. పాడి రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని మరింతగా ప్రోత్సహించేందుకు గాను సబ్సిడీ పై పాడి గేదెలను కూడా పంపిణీ చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ విజయ డెయిరీ అభివృద్ధి లో భాగంగా 250 కోట్ల రూపాయల ఖర్చుతో 8 లక్షల లీటర్ల సామర్ద్యంతో నిర్మించనున్న మెగా డెయిరీ ప్లాంట్ నిర్మాణ పనులను కూడా ఇటీవల ప్రారంభించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలతో ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది లబ్దిచేకూరుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో పెరిగిన జీవాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని దాణా కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం రైతులకు సబ్సిడీ పై గడ్డి విత్తనాలను పంపిణీ చేయడం, తమ శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లో పశుగ్రాసం పెంపకం చేపట్టినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలాకు వివరించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని జీవాలకు అవసరమైన వ్యాక్సిన్ ను VBRI ద్వారా ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుందని, RKVY పథకం క్రింద 2018-19 సంవత్సరానికి గాను రంగారెడ్డి జిల్లా కరకపట్ల లో చేపట్టిన టీకా ఉత్పత్తి కేంద్రం (VBRI) నిర్మించుట కొరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 75 కోట్ల రూపాయలతో పాటు వివిధ కార్యక్రమాల అమలు కోసం మంజూరు చేసిన 29 కోట్ల రూపాయలను త్వరిగతిన విడుదల చేసినట్లయితే ఆయా కార్యక్రమాలను త్వరిగతిన పూర్తి చేసుకొనే అవకాశం ఉంటుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
అధిక పాల దిగుబడినిచ్చే మేలుజాతి పశు సంపదను సృష్టించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా కంసానిపల్లి వద్ద ప్రోజోన్ సెమెన్ బుల్ స్టేషన్ (ఘనీకృత వీర్య ఉత్పత్తి కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహకారంతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం క్రింద నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇప్పటి వరకు 90 శాతం పైగా నిర్మాణ పనులు పూర్తయ్యాయని, కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేస్తే నిర్మాణం చేసుకొని వీర్య ఉత్పత్తిని ప్రారంభించుకొనే అవకాశం ఉంటుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల మేరకు 2019 పశుగణన ప్రకారం తెలంగాణ రాష్ట్రం 190.63 లక్షల గొర్రెలు మరియు 49.35 లక్షల మేకల సంపద తో దేశంలోనే మొదటిస్థానం లో ఉందని చెప్పారు. రాష్ట్రంలో పెరిగిన జీవాల సంఖ్య ను దృష్టిలో ఉంచుకొని వాటికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంచార పశువైద్యశాలల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి అదనంగా మరో 100 వాహనాలను మంజూరు చేయాలని కోరారు.
పశుసంపద అభివృద్దిలో కూడా దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రధమస్థానంలో ఉందని, పశుగణాభివృద్ధి రంగంలో రాష్ట్రం వినూత్న పథకాలను రూపొందించి వాటిని అమలు చేయడంలో కూడా అగ్రస్థానంలో ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. పశు వైద్య కళాశాలలకు అనుసంధానంగా ICAR ఆధ్వర్యంలో నిర్వహించబడే కృషి విజ్ఞాన కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ఈ కేంద్రాలలో పనిచేసే శాస్త్రవేత్తలు పశువైద్యం ఆరోగ్య సంరక్షణలో పాడి పోషణలో వచ్చే నూతన విధానాల పై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ స్థానిక ప్రభుత్వాలకు, రైతులకు సహాయకారిగా పనిచేస్తున్నందున, తెలంగాణ రాష్ట్రానికి స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతనంగా 2 పశువైద్య కృషి విజ్ఞాన కేంద్రాలను మంజూరు చేయవలసిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం బూక్యా, షీఫ్ ఫెడరేషన్ MD రాంచందర్, TSLDA CEO మంజువాణి, విజయ డెయిరీ MD శ్రీనివాస్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply