Suryaa.co.in

Editorial

‘చదివింపు’ల ‘మేఘ’సందేశం!

– ఆగ‘మేఘా’లపై కేసులెందుకో?
– ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో తెరపైకొచ్చిన మేఘా కంపెనీ
– సోషల్‌మీడియా వార్తలపై కలవరమెందుకో?
– మేఘాపై ఆరోపణలు చేసిన షర్మిలపై కేసు పెట్టరా?
– కేసీఆర్‌కు కమిషన్లు ఇచ్చి కాంట్రాక్టులు పొందారంటూ సోషల్‌మీడియాలో కథనాలు
– మూడు రాష్ట్రాల సీఎంలకు కాసులిచ్చేందుకు హామీ ఇచ్చారంటూ ప్రచారం
– దానిపై మనస్తాపం చెందిన మేఘా కంపెనీ యాజమాన్యం
– సోషల్‌మీడియా వార్తలపై చర్యలు తీసుకోవాలని వినతి
– కోర్టుకు ఎస్‌బీఐ వివరాలే అందిస్తున్న సోషల్‌మీడియా
– ఇంతకూ చదివింపులు తప్పా? వాటిని రాయడం తప్పా?
– బాండ్ల కొనుగోలు తప్పయితే ఎస్‌బీఐపై కేసు వేయరేం?
– ఈలోగా అమరావతిటు డోన్ పైపుల తరలింపు రచ్చ
– అనుమతి లేకుండానే డోన్‌కు మేఘా వాటర్‌పైపులు తరలించిందంటూ కథనాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిద్ధాంతకర్త రవిశంకర్‌కే పాఠాలు చెప్పగల స్థాయి మేఘా ఇంజనీరింగ్ కంపెనీది. పాలకులెవరైనా.. పార్టీ ఏదైనా అన్ని పనులూ ఆ కంపెనీకే ఆగ‘మేఘా’లపై దక్కుతుంటాయి. దానికి రాష్ట్రాల సరిహద్దులు కూడా ఉండవు. జాతి ప్రయోజనాల కోసం కొందరు, మరో ప్రయోజనాల కోసం ఇంకొందరు పాలకులు మేఘాపై ముచ్చటపడి వందలు, వేల కోట్ల కాంట్రాక్టులిచ్చేస్తుంటారు.

కంపెనీ అధిపతి కృష్ణారెడ్డి అందరివాడు. అన్ని పార్టీలూ ఆయన వైపే ఉంటాయి. ఇక మీడియా సంగతి చెప్పనవసరం లేదు. అనేక కంపెనీలు చేసే పనులపై పుంఖానుపుంఖాల వార్తలు వండి వార్చే తెలుగు మీడియా.. తెలుగునాట ఉన్న ఇంగ్లీషు మీడియా మేఘా పనుల నిర్వహణ జోలికి వెళ్లవు. ఆ కంపెనీ కీలక సందర్భాల్లో ఇచ్చే కోట్లాది రూపాయల ప్రకటనలు పరిశీలిస్తే, తెలుగు మీడియా మేఘాల వైపు ఎందుకు కన్నేయవో.. మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.

గతేడాది ఒక ఎలక్ట్రికల్ బస్సు మెహదీపట్నం ప్రాంతంలో ఎండలో తగలబడిందన్న వార్త.. జిల్లా పేజీలో ఎవరూ చదవకుండా జాగ్రత్తగా ఒక మూలన వేశారు. మిగిలిన సందర్భాల్లో అయితే ఆ కంపెనీ ఏది? ఎవరు అనుమతించారు? ఎలా అనుమతించారు? అసలు దానికి గతంలో ఎలక్ట్రిక్ బస్సులు తయారుచేసిన గతానుభవం ఉందా? అని కోడిపై ఈకలు లాగే మీడియా.. అసలు ఆ బస్సు తగలబడిన వార్త రాస్తే ఒట్టు. గుండె ధైర్యమంటూ గొప్పలు చెప్పుకునే మీడియా ఆసాములు కూడా.. మేఘా పనుల నిర్వహణ తీరు తెన్నులపై కన్నేసేందుకు సాహసించరు. కారణం.. ‘మామూలే’!

పైగా అసలు ‘మేఘా’రెడ్డిగారికే పేరు గొప్ప మీడియాసంస్థలున్నాయి మరి. అలా అన్ని రంగాల్లో విస్తరించిన మేఘాకు, పాలకులు పిలిచి పెద్దపీట వేయడంలో వింతేమీ లేదు. గమ్మతుగా.. మేఘా కంపెనీపై విపక్షంలో ఉన్న పార్టీలు ఆరోపణలు గుప్పిస్తాయి. మళ్లీ అదే విపక్షం అధికారంలోకి వస్తే.. అదే మేఘాకు పువ్వుల్లో పెట్టి పనుల కాంట్రాక్టులు అప్పగిస్తుంటాయి. దటీజ్ మేఘా. ఇంత గొప్ప ఆర్ట్ ఆఫ్ లివింగ్ మిగిలిన కంపెనీలకు లేకపోవడం వల్లే, అవి నష్టాల దిశగా పయనిస్తూ, మూసేసుకునే పరిస్థితిలో ఉన్నాయి.

అయినా.. దేశ ప్రయోజనాలు-రాష్ట్ర ప్రయోజనాలు-జాతి ప్రయోజనాల కోసం.. లోకకల్యాణం కోసం పరితపించే రాజకీయ పార్టీల ప్రజాసేవ మెచ్చి, వారికి ఏ పదో పరకో ఇస్తే సోషల్‌మీడియా ఇంత గాయి చేయడమే బాగాలేదన్నది మేఘా అభిమానుల ఆవేదన. కడపలో విశ్వేశ్వరరెడ్డి గారి ఎలక్ట్రికల్ కంపెనీ కూడా ఇలాంటి జాతి ప్రయోజనాలు-రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాజకీయ పార్టీలకు బాండ్లు ప్రేమతో చదివించుకున్నాయట. అందులో తప్పేమిటన్నది వారి భావన. ‘‘ఏదీ ఉచితంగా తీసుకోకూడదు. తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావయిపోతార’’న్న మహేష్ డైలాగు, వారికి స్ఫూర్తి కావచ్చేమో?!

అంతలావు మేఘా కంపెనీ.. ఇప్పుడు బాధితురాలి హోదాలో, పోలీసులకు ఫిర్యాదు చేయడం సహజంగానే చర్చనీయాంశమయింది. అన్నట్లు మేఘా కంపెనీ ఘనత ఈ వారంలోనే ప్రపంచప్రజలకు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల పుణ్యాన.. ఏ కంపెనీ ఏయే పార్టీలకు చందాలు ఇచ్చిందన్న వివరాలను ఎస్‌బీఐ బలవంతంగా బయటపెట్టాల్సి వచ్చింది. ఇప్పటివరకూ ఈ చందాల యవ్వారాన్ని బ్రహ్మరహస్యంగా ఉంచేందుకు చివరి వరకూ ఎస్‌బీఐ ప్రయత్నించినా, ఫలితం దక్కలేదు. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇలాంటి సాహసం చేసి, చరిత్రలో చిరస్థాయగా నిలిచిపోయారు. కోర్టు కన్నెర్ర చేస్తే తప్ప, ఎస్‌బీఐ పార్టీకి చందాలిచ్చిన వారి పేర్లు బయటపెట్టలేదు.

సరే ఇప్పుడు ఆ చందాల జాబితాలో మన ‘తెలుగు ప్రైడ్’ అయిన, ‘మేఘా’ రెడ్డిగారి కంపెనీ కూడా టాప్‌లో ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. తెలుగువారిగా అది మనకు గర్వకారణం కూడా. ఒక తెలుగువాడు అన్నేసి వందల కోట్లు రాజకీయపార్టీలకు ‘చదివించినందుకు’ ప్రతి తెలుగువాడూ గర్వపడాల్సిందే కదా? అయితే రెడ్డిగారి కంపెనీ రాజకీయ పార్టీలకు చందాలివ్వకపోతే ఆశ్చర్యం గానీ, ఇస్తే ఆశ్చర్యం ఏముందన్నది మేధావుల ఉవాచ.

ఇక ఇప్పుడు ఆ ఎలక్టోరల్ బాండ్ల చందాలగుట్టు మీడియా సాక్షిగా రట్టు కావడంతో, మేఘా రెడ్డి గారు ఏ పార్టీకి ఎంత చదివించుకున్నారన్న నిజం బయటపడింది. మనం ఒక శుభాకార్యానికి వెళితే ఎంతో కొంత చదివించుకుంటాం. దేనికంటే బలమైన బంధం కోసం. అలాగే మేఘా లాంటి కంపెనీలు కూడా, తమకు పనులు చేసి పెట్టినందుకు రాజకీయ పార్టీలకు చదివించుకుంటాయి. దానికీ దీనికీ పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే మనం శుభకార్యాలకు వెళ్లినప్పుడు డబ్బులో, నగలో కవర్‌లో పెట్టి ఇస్తాం. మేఘా లాంటి కంపెనీలు, ఇలా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా చదివించుకుంటాయి. అంతే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్!

అయితే ఇప్పుడు దాని ఆధారంగా సోషల్‌మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. దానితో కలతచెందిన కంపెనీ ప్రతినిధులు సోషల్‌మీడియా దుర్మార్గులు తమ కంపెనీ పరువు తీస్తున్నారుకాబట్టి, వారిపై చర్యలు తీసుకుని, ఆ పోస్టులను తొలగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే మేఘా రెడ్డి గారి కంపెనీ ఒక్కటే 966 కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేసిన మాట నిజం. సదరు కంపెనీ అనుబంధ సంస్ధల పేరుతో కూడా బాండ్లు కొనుగోలు చేసిన మాట నిజమని, పేరు గొప్ప పత్రికల్లోనే అచ్చయింది. పైగా బీఆర్‌ఎస్‌కు చందాలిచ్చిన తెలుగు కంపెనీల పేర్లు కేంద్ర మాజీ మంత్రి జైరాంరమేష్ బయటపెట్టారు. కాకపోతే వాటికి సోషల్‌మీడియా సోల్జర్స్ సొంత వ్యాఖ్యానాలు తగిలించి, సర్క్యులేట్ చేస్తున్నారు. అదొక్కటే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్.

నిజానికి మేఘా రెడ్డి గారి కంపెనీ ఎలక్టోరల్ బాండ్ల కొనుగొలు యవ్వారాన్ని సోషల్‌మీడియా ఏమీ పరిశోధించి బయటపెట్టలేదు. అవి ఎస్‌బీఐ సుప్రీంకోర్టుకు సమర్పించి, వెబ్‌సైట్‌లో పెట్టినవే. అంటే ఓపెన్ డాక్యుమెంట్లన్నమాట. వాటినే జాతీయ-అంతర్జాతీయ మీడియా సంస్థలు అచ్చేశాయి.

ఆ ప్రకారంగా.. మేఘా 966 కోట్లు, హెచ్‌ఇఎస్ ఇన్‌ఫ్రా 22 కోట్లు, వెస్ట్రన్ యుపి పవర్ అండ్ ట్రాన్స్‌మిషన్ 220 కోట్లు, ఆర్కే ఇన్‌ఫ్రా కార్ప్ 5 కోట్లు, జివిపిఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ 10 కోట్ల బాండ్లు కొనుగోలుచేసిందని జాతీయ మీడియా ఘోషించింది. వాటినే తెలుగు సోషల్‌మీడియా ప్రజలకు అర్ధమయ్యేలా అందించింది. అయితే వాటిలో మేఘాపై అవినీతి ఆరోపణలు వదిలేస్తే, మిగిలినందా పబ్లిక్ డాక్యుమెంట్లలో ఉన్నదే. దానికి ఉడుక్కుని పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఆశ్చర్యం.

ఇక ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి గతంలో వైఎస్సార్‌టీపీ చీఫ్ హోదాలో.. ఏకంగా మేఘారెడ్డి గారి కంపెనీపై ఢిల్లీకి వెళ్లి మరీ, ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఆమె నేరుగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. మేఘా కంపెనీ-బీఆర్‌ఎస్ సర్కారుకు ఉన్న బాదరాయబంధాన్ని బట్టబయలు చేశారు. తెలంగాణలో రోడ్లు, డ్యాములు, విద్యుత్ రవాణా వంటి రంగాల్లో దాదాపు 90 శాతం పనులన్నీ, 50 శాతం మార్జిన్‌తో మేఘా కంపెనీకి కట్టబెట్టారని ఆరోపించారు. గత పదేళ్లలో తెలంగాణ ప్రాజెక్టుల నుంచి 72 వేల కోట్ల రూపాయలు లబ్ధిపొందిందన్నది షర్మిల చేసిన నాటి ఆరోపణ. ఇది అప్పట్లో సంచలనం సృష్టించినా, కంపెనీ అధినేత బయటకు వచ్చి ఖండించక పోవడం ప్రస్తావనార్హం.

డిసెంబర్ 2020లో నాటి జీఎస్టీ అదనపు డైరక్టర్ జనరల్ బాలాజీ మజుందార్ మేఘా కంపెనీకి సంబంధించి 12 వేల కోట్ల రూపాయల జీఎస్టీ విధించారు. అయితే విచిత్రంగా 2028లో రిటైర్ కావలసిన ఆయన.. హటాత్తుగా ఫిబ్రవరి 11, 2021న స్వచ్చంద పదవీ విరమణ తీసుకోవటం చర్చనీయాంశమయింది. ఇది రహ స్యమేమీ కాదు. బహిరంగంగా జరిగిన వ్యవహారమే. ఇందులో సోషల్‌మీడియా పాత్ర కించిత్తు కూడా లేదు.

ఇక మెక్‌డ్రిల్ ఆయిల్ తయారీ కంపెనీ కొనుగోలు.. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ గోల్డ్‌స్టోన్ ఇన్‌ఫ్రా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌గా మారిన వైనం.. రాజస్థాన్‌లో దక్కించుకున్న 4,500 కోట్ల రూపాయల నీటిపారుదల ప్రాజెక్టు.. అప్పర్ సీలేరు ప్రాజెక్టు..కాళేశ్వరం ప్రాజెక్టు వగైరాలన్నీ జాతీయ-రాష్ట్ర మీడియాలో వచ్చినవే. రహ్యమేమీ కాదు. అయితే ఇవన్నీ పాలకులు సదరు కంపెనీ కోసం, ఏర్పాటుచేసిన ప్రత్యేక నిబంధనల ప్రకారం దక్కినవే. అంటే పైకి ఇదంతా లీగల్ వ్యవహారమే. ఈవిధంగా ఒక ప్రాజెక్టు తమ అస్మదీయులకు కట్టబెట్టాలంటే, ఏ పాలకులైనా ఇలాంటి ప్రత్యేక నిబంధనలు పెడుతుంటారన్నది బహిరంగ రహస్యమే. అది మేఘాతోనే మొదలు కాలేదు.

అయితే… మేఘా కంపెనీ వ్యవహారం మొగుడు కొట్టినందుకు కాదు.. తోటికోడలు నవ్వినందుకు అన్నట్లుగా ఉందన్నది బుద్ధిజీవుల వాదన. మేఘా కంపెనీ తెలంగాణ ప్రాజెక్టుల నుంచి 72 వేల కోట్ల రూపాయలు లబ్థిపొందిందని.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆరోపించిన ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డిపై, మేఘా కంపెనీ ప్రతినిధులు ఇప్పటివరకూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడమే వింత.

నాటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కావలసినప్పుడల్లా డబ్బులు పంపిస్తున్నందుకే, వారిద్దరూ మేఘా కంపెనీపై ఆరోపించేందుకు భయపడుతున్నారన్న షర్మిలారెడ్డి ఆరోపణలను, కంపెనీ ప్రతినిధులు పట్టించుకోకపోవడమే ఆశ్చర్యం. ఆమె ఆరోపణలు ఇంకా ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియాలో సజీవంగానే ఉన్నాయి. బీఆర్‌ఎస్ హయాంలో మేఘాకు మాత్రమే దక్కుతున్న భారీ ప్రాజెక్టులపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలపైనా ఆ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు.

వారందరినీ వదిలేసి..ఎస్‌బీఐ ఇచ్చిన వివరాల ఆధారంగా.. జాతీయ మీడియా రాసిన కథనాలను, సొంత వ్యాఖ్యానాలతో వెల్లడించిన సోషల్‌మీడియాపై ఫిర్యాదు చేయడమే విచిత్రం. సరే పోలీసు చర్యతో సోషల్‌మీడియాలో పోస్టింగులు తొలగించుకుంటారే అనుకుందాం. మరి ఎస్‌బీఐ సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరాలయితే దాచలేరు కదా అని సీనియర్ జర్నలిస్టుల ప్రశ్న. ఇదంతా మిగిలిన మీడియా తమ కంపెనీపై భవిష్యత్తులో ఈ అంశంపై రాయకుండా చేసే, ముందస్తు మైండ్‌గేమ్ అన్నది సీనియర్ పాత్రికేయుల విశ్లేషణ.

పోనీ.. ఎస్‌బీఐ సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరాలు, ఆ మేరకు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో పెట్టిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలు తప్పని మేఘా ప్రతినిధులు ఖండించి ఉంటే, సదరు సంస్థ నిజాయితీ తెలిసేది. వందల కోట్ల బాండ్లను తాము కొనుగోలు చేయలేదని, ఎస్‌బీఐ తమను అప్రతిష్ఠపాలు చేస్తోందని పోనీ ఎస్‌బీఐపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అది కూడా చేయలేదంటే.. ఇంతకూ మేఘా కంపెనీ కవిహృదయం ఏమిటన్నది బుద్ధిజీవుల ప్రశ్న. మేఘా కంపెనీ బాండ్ల కొనుగోలుతో ‘పార్టీల చదివింపుల’ వ్యవహారం బయటపడిందనా? లేక వాటిని సోషల్‌మీడియా అరటిపండు వలిచినట్లు తెలియని వారందరికీ అర్ధమయ్యేలా చెబుతుందనా?

ఇన్ని వివాదాలతో యుద్ధం చేస్తున్న మేఘాకు.. తాజాగా అమరావతి నుంచి డోన్‌కు వాటర్‌పైపుల తరలింపు వ్యవహారం శిరోభారంగా పరిణమించిందట. అమరావతి నిర్మాణం కోసం వినియోగించాల్సిన వాటర్‌పైపులను, కాంట్రాక్టు సంస్థ అయిన మేఘా అనధికారికంగా ఆర్ధికమంత్రి రాజేంద్రనాధ్‌రెడ్డి డోన్ నియోజకవర్గానికి, గుట్టు చప్పుడు కాకుండా తరలించిన వైనం, ఫొటోలతో సహా మీడియాలో రావడం తలనొప్పిగా మారింది. 20 కోట్ల విలువైన సామాగ్రి ఎలాంటి అనుమతులు లేకుండా, కేవలం నోటిమాటతో డోన్‌లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం తరలించేసిందన్న కథనాలు గుత్తేదారును కలవరపరిచేవే. అయినా మీడియా పిచ్చిగానీ.. వడ్డించేవాడు చివర కూర్చున్నా అందాల్సిన వాయనాలు అందుతూనే ఉంటాయి. అయినా అదో తుత్తి!

LEAVE A RESPONSE