– మంత్రి జూపల్లి కృష్ణారావు
– రవీంద్రభారతీలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు
హైదరాబాద్: భూమి, భుక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
గురువారం రవీంద్రభారతీలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ఆకాంక్షలకు అనుగుణంగానే సీయం రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టామని, తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను నియమించి గౌరవించుకున్నామని తెలిపారు. నిరాశ నిస్పృహల్లో చిన్న విషయాలకే బలిదానాలు చేసుకుంటున్న వారు చాకలి ఐలమ్మ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని, సమస్యలను ఎదిరించి ధైర్యంగా జీవించాలని సూచించారు. ఎక్కడ అన్యాయం జరిగిన పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రజలే కేంద్ర బిందువుగా ఆలోచించి పరిపాలన చేయాలని, కానీ గత పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, వేల కోట్ల రూపాయాలను లూటీ చేశారని మండిపడ్డారు. గత పాలకులు చేసిన తప్పిదాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, బస్వరాజు సారయ్య, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జీ. నిరంజన్, కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ కమీషనర్ బాల మాయాదేవి, మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేత ఐలమ్మ, తదితరులు పాల్గొన్నారు.