– అందుకే, రాఖీలు తాయత్తులంటూ బాబు ప్రజల్ని భయపెడుతున్నాడు
– 2 ఎకరాల బాబు వేలకోట్లు ఎలా సంపాదించాడు..?
– ఆయన హయాంలో ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలెన్నో..
– జన్మభూమి కమిటీల పేరుతో పందికొక్కుల్లా దోచుకున్నారు
– ఇవన్నీ దత్తపుత్రుడైన సెలబ్రిటీకి నచ్చిన అంశాలా..?
– దమ్ముంటే వీటిపై చంద్రబాబును పవన్ నిలదీయాలి
– పవన్‌కళ్యాణ్‌కు ఏపీ కలెక్షన్ల సెంటర్
– మంత్రి బొత్స సత్యనారాయణ
అసత్యాల ఉద్యమంలో ఆ ముగ్గురుః
గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన కొడుకు చెరోవైపు తిరుగుతుంటే.. సెలబ్రిటీగా ఉన్న ఒకయాన ఇంకోవైపు తిరుగుతూ ఆవేశపడుతున్నారు. ప్రభుత్వంపై, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ వారు అక్కసు వెళ్లగక్కుతున్నారు. గతంలో చంద్రబాబు ఒక్కడే రోజుకు నాలుగు అబద్ధాలను జనం మీదకు వదిలేవాడు.
ఇప్పుడు ఆయన కొడుకు, దత్తపుత్రుడైన సెలబ్రిటీ కూడా ఆయనకు తోడయ్యారు. గతంలో రెండు పచ్చ పత్రికలు మాత్రమే ఉండేవి అబద్ధాలు చెప్పడానికి, వక్రీకరించి రాయడానికి ఉండేవి. ఇప్పుడు వారికి మరో అరడజన్ పచ్చ ఛానళ్లు కూడా తోడయ్యాయి. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ తాలూకూ ఉద్యమం అని చెప్పాలి.
సీనియార్టీ అంటే ఇదేనా బాబూ..?
పిట్టకొంచెం కూతఘనం అన్నట్లు నీ కొడుకు నీకంటే అబద్ధాల్లో మించి పోయాడు. మరోవైపు సెలబ్రిటీ కూడా చేతికందిన స్క్రిప్టును చదవడమే రాజకీయమనుకుంటున్నాడు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పట్టుకుని వ్యక్తిగతంగా దూషించడం.. లేనిపోని అసత్యా లతో బురదజల్లుతున్నారు. నువ్వేదో 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటావు కదా.. ఇదేనా నీ సీనియార్టీ.. చంద్రబాబూ..?. అసలు, నువ్వు చేస్తున్న రాజకీయానికి సిగ్గుందా.. లేదా.? అని అడుగుతున్నాను.
ప్రజాసొమ్మును పందికొక్కుల్లా తినింది మీరుః
బటన్ నొక్కి ప్రజలకు డబ్బులిస్తున్నారని.. అది ఎవరి సొమ్ము అంటూ ప్రశ్నిస్తున్నారు కదా..? నీ సొమ్మునో.. నీ తండ్రి కర్జూరనాయుడు సొమ్మును తెచ్చి మేం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ప్రజల నుంచి ప్రభుత్వ ఖజానాకు చేరిన సొమ్మునే పైసా వృథా చేయకుండా ప్రజల జీవన స్థితిగతుల్ని మార్చేందుకు.. వారిని మెరుగైన అభివృద్ధిలోకి తెచ్చేందుకు సంక్షేమ పథకాల కింద బటన్ నొక్కి డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నాం. మరి, గతంలో మీ ప్రభుత్వం ఆ విధానాన్ని పాటించిందా..? ప్రజాసొమ్మును జన్మభూమి కమిటీల పేరుతో దళారీ వ్యవస్థను పెంచిపోషించి పందికొక్కుల్లా తిన్నారు. కాబట్టే.. మిమ్మల్ని 2019 ఎన్నికల్లో ప్రజలు తరిమితరిమి కొట్టారు.
హోదా వద్దని ప్యాకేజీ ముద్దంది బాబేః
మాటకొస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేకహోదా గురించి మా ప్రభుత్వానికి, జగన్‌మోహన్‌రెడ్డి కి ఎందుకు ముడిపెడుతున్నారు..? ఇప్పటికీ.. మేము రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాలనే కట్టుబడి ఉన్నాం. ప్రత్యేకహోదా సాధనే మా పార్టీ విధానం అని మరోమారు స్పష్టం చేస్తున్నాను. అయితే,
అసలు ప్రత్యేకహోదాను ఎవరు తాకట్టుపెట్టారో చంద్రబాబు సమాధానం చెప్పు..? ప్రత్యేకహోదా కాదు ప్రత్యేకప్యాకేజీ చాలు అంటూ చంకలు కొట్టుకుని కేంద్ర పెద్దలతో స్వీట్లు పంచుకుని శాలువాల్ని కప్పించుకుంది నువ్వుకాదా..? మరి, ఆరోజు అదొక గొప్ప వేడుకలా ఈ సిగ్గులేని పచ్చమీడియా ఎందుకు రాసింది..? ఇప్పుడు అధికారంలో లేనందున మరలా ఎన్నికల సమయానికి ప్రత్యేకహోదా సాధనపై మేం మాట్లాడటం లేదని ఎందుకంటున్నావు..? ఇందుకు దమ్ముంటే చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఆయన దత్తపుత్రుడు సెలబ్రిటీ కూడా దీనిపై బాబును నిలదీయాలి.
బాబు హయాంలోనే ఆకలిచావులు, ఆత్మహత్యలు
చంద్రబాబు ముఖ్యమంత్రి అంటేనే ఈ రాష్ట్రంలో కరువు, కాటకాలు సంభవిస్తాయి. ఆయన హయాంలో పేదల ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలను అందరూ చూశారు. ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలంటే బాబు కొడుకు, సెలబ్రిటీ చరిత్రను తిరగేసి చదువుకుంటే మంచిది. వారి నాయకుడి పాలనలో ప్రజలెంతగా కష్టాలు, ఇబ్బందులు అనుభవించారో తెలుస్తుంది. అదే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేదలు ఆర్థికం, సామాజికంగా వృద్ధిని సాధించి మెరుగైన జీవనశైలితో సంతోషంగా ఉన్నారు.
ఆంధ్రపై ప్రేమ అంటూ సినిమాకబుర్లు
పక్కరాష్ట్రంలో నివసిస్తూ ఆంధ్ర మీద ప్రేమ లేకపోయినా.. ఎన్నికలప్పుడే ప్రేమను ఒలకబోసే చంద్రబాబు అండ్ కో వ్యక్తులకు ఇక్కడేం పని..? పరిపక్వత లేని రాజకీయపార్టీకి అధ్యక్షుడినంటూ ఈ సెలబ్రిటీ ఉత్తరాంధ్ర ప్రేమ అని మాట్లాడుతున్నాడు. నువ్వుండేది హైదరాబాద్‌లోనే కదా? ఈ రాష్ట్రంతో నీకున్న సంబంధం కేవలం టెంపరరీనే కదా?
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునో, జగన్‌నో సీఎంగా ఉన్నా.. ఏపీ అన్నది నీకు నీ సినిమా కలెక్షన్లు పట్టుకుపోయినట్లే ఒక పొలిటికల్ కలెక్షన్ సెంటరే కదా? మరి అలాంటి ఆంధ్ర గురించి, అందులో ఒక కొండ గురించి అంతగా ఎందుకు బాధ పడుతున్నావు..? రామోజీఫిల్మ్‌సిటీ కొండ మీద కాకుండా నేలమీద ఉందా.? వైజాగ్‌లోనే రామానాయుడు స్టూడియో కొండమీద లేదా..? ఇంకా అక్కడ అనేక నిర్మాణాలు కొండలపై లేవా..?
రుషికొండపై నూరుశాతం ప్రభుత్వభవనాల నిర్మాణాలే
అవును.. రుషికొండ మీద ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ప్రభుత్వ భవనాల్నే కడుతున్నామని ఏడాదికిందట్నే చెప్పాం. ఇదేమీ ప్రయివేటు ఆస్తి కాదు కదా..? మీకొచ్చిన నొప్పి, ఇబ్బందేంటి..? అని సెలబ్రిటీ స్టార్‌ను నేను అడుగుతున్నాను. నీ దత్తతండ్రి చంద్రబాబు మాదిరిగా అనుమతుల్లేకుండా కట్టిన ప్రజావేదిక కాదు ఇది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో అన్ని అనుమతులతోనే నిర్మాణమవుతున్న ప్రభుత్వ కట్టడాలవి అని మరోమారు స్పష్టం చేస్తున్నాను.
బాబు పిచ్చిని అనుభవమని ప్రచారం చేస్తున్నారు..
పర్యటనల్లో చంద్రబాబు, ఆయన కొడుకు, సెలబ్రిటీ మాట్లాడుతున్న మాటలు చూస్తే నవ్వాలో ఏడ్వాలో కూడా ప్రజలకు అర్ధం కావడంలేదు. బాబేమో రాఖీలు, తాయత్తులంటాడు. సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు తానే కనిపెట్టానంటాడు. ఈ సెలబ్రిటేనేమో తనకు తాను భగవంతుని స్వరూపంలా, మునిపుంగవునిలా బోధ చేయాలని చూస్తాడు. అధికారం లేదని .. భవిష్యత్తులో కూడా ఇక అధికారంలోకి రాలేనని చంద్రబాబుకు పిచ్చెక్కింది. ఆ పిచ్చిలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియక ఆవేశపడుతుంటే.. ఆయన కొడుకు, సెలబ్రిటీ మాత్రం అదొక సీనియార్టీ అనుభవంగా చెప్పుకుంటున్నారు.
బాబు పాలనలో వంద తప్పుల్ని చెబుతాం
పచ్చకామెర్ల వ్యక్తికి అంతా పచ్చగానే కనిపిస్తుందంట. మరి, ఆ సెలబ్రిటీకి టీడీపీలో ఏం మంచి కనిపించిందో ప్రజలకు అర్ధంకాలేదు. జన్మభూమికమిటీల విచ్చలవిడితనం, పెత్తందారీ, దోపిడీదారీ వ్యవస్థను మెచ్చుకుంటున్నాడు. ఆయన టీడీపీ పాలనే బాగుంది అనడానికి కొలమానం ఏంటి..? అప్పటి ప్రభుత్వానికి ఇప్పటికీ వ్యత్యాసాన్ని విశ్లేషించి మాట్లాడాలి కదా..? ఆ ముగ్గురు అన్ని ప్రాంతాలకెళ్లారు. ఏ ఒక్కచోటైనా అప్పటి, ఇప్పటి ప్రభుత్వాల పాలనలో ఉన్నవాటి వ్యత్యాసాన్ని పోల్చి చూపారా..? 40 ఏళ్ల రాజMీ య అనుభవంలో 14 ఏళ్ల బాబు పాలనకు జగన్‌గారి నాలుగేళ్లకు ఉన్న తేడాను ఏమైనా చెప్పారా..? అదే మమ్మల్ని చెప్పమంటే 100 చెబుతాం.
చంద్రబాబు ఆస్తులపై సెలబ్రిటీ నిలదీస్తాడా..?
వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు వేలకోట్లు.. లక్షల కోట్లు దోచేస్తున్నారని
అసత్య ఆరోపణలు చేసి సమాధానం చెప్పమంటే.. ఏం చెప్పగలం..?
నేను మంత్రిని కాదా..? మాది ఉత్తరాంధ్ర ప్రాంతం కాదా..? 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణలో ఆస్తుల్ని సంపాదించుకుంది చంద్రబాబునా..? మేమా..? ఆయనకు అంత ఆస్తి ఎక్కడ్నుంచి వచ్చింది. కాలేజీకి సైకిల్ మీద వెళ్లినోడు చంద్రబాబు.. అదే నేను అప్పట్లోనే స్కూటర్ మీద కాలేజీకి వెళ్లాను. రెండెకరాలతో హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుకు అన్ని లక్షల కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయో ఈ దత్తపుత్రుడు సెలబ్రిటీ అడగొచ్చుకదా..?
జగన్ పట్టుదలను ఆదర్శంగా తీసుకొంటే పైకొస్తావు
గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వయసుకు చంద్రబాబు దత్తపుత్రుడు సెలబ్రిటీ వయసు ఇద్దరిది ఇంచుమించు దగ్గరగా ఉంటుంది. మరి, ప్రజల హృదయాల్లో జగన్ గారు ఎక్కడున్నారు..? ఈ సెలబ్రిటీ ఎక్కడున్నాడు..? ఏదో ప్యాకేజీ కోసం ఆశపడి రాజకీయ పార్టీ పెట్టి తాను తలుచుకుంటే అద్భుతాల్ని సృష్టిస్తానంటూ కలలు కంటే ఏమీ జరగదు. జగన్ కి మంచి వ్యక్తిత్వం ఉంది. ఆయనలో అనుకున్న లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉంది.
ఆ లక్ష్య సాధనలో కష్టాల్ని ఎదుర్కొనే దమ్ముంది. కాబట్టే… అతి చిన్నవయసులో రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా 151 స్థానాల్ని గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారు. మరి, ఈ సెలబ్రిటికీ అలాంటి లక్షణాలు ఏమీ లేవు కదా..? పరిపక్వత లేని రాజకీయపార్టీ ఆయనది. కనుక, ఇప్పటికైనా జగన్ విధానాల్ని ఆ సెలబ్రిటీ ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో పైకొస్తాడు.
భాష సరిచేసుకోకపోతే రాష్ట్రం నుంచే తరిమేస్తారు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులతో పాటు అన్నివర్గాలు జగన్ ప్రభుత్వ పాలనపై సంతోషంగా ఉన్నారు. సామాన్యుడి శ్రేయస్సే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామికం ఇలా అనేక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. దేశానికే ఆదర్శవంతంగా ఉన్న ప్రభుత్వ పాలనపై లేనిపోని ఆరోపణలతో బురదజల్లేందుకు ప్రయత్నించడం చంద్రబాబు, ఆయన కొడుకు, సెలబ్రిటీకి మంచిదికాదు.
ప్రజల్లో మెప్పును పొందలేకపోతున్నామని మీరు సహనం కోల్పోయి మాట్లాడటం తప్పు. ఇది మంచి పద్ధతికాదు. మేం బ్రాండ్ ఇమేజ్‌తో ముందుకెళ్తున్నాం కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. కనుక, ఇకనైనా మీ మాట్లాడే భాషను సరిచేసుకోకపోతే 2024 తర్వాత మిమ్మల్ని రాష్ట్రం నుంచి శాశ్వతంగా తరిమికొడతారని హెచ్చరిస్తున్నాను.
పేదల రక్తాన్ని పీల్చే జలగ రామోజీ
నేను మంత్రిగా ఉన్నపుడల్లా రామోజీరావు నామీద ఎన్నోసార్లు అసత్య కథనాలు రాశాడు. ఈనాడు పత్రిక ఆ రకంగా మాకు చాలా ప్రచారం చేస్తుంది. అందుకు ఆ పత్రిక యజమానిగా రామోజీకి ధన్యవాదాలు.
మాకు అడ్డగోలుగా ప్రభుత్వం భూముల్ని కేటాయించిందని ఆధారాలతో నిరూపిస్తే వాటిని రామోజీరావుకు రాసిస్తాను. దమ్ముంటే రామోజీ నా సవాల్‌ను స్వీకరించాలి. ఆయన 2006లో కూడా నామీద పరువు నష్టం దావా వేశాడు. ఆ తర్వాత తప్పైయిందని ఆయనే విత్‌డ్రా చేసుకున్నాడు. పేదవాడి రక్తాన్ని పీల్చే జలగలాంటోడు ఈ రామోజీరావు. ఆయనకు మాదిరిగా అందరూ కొండలు, గుట్టల్ని అన్యాక్రాంతం చేసి దోచుకుంటున్నట్లు అనుకుని అసత్య కథనాలు రాస్తుంటాడు. మా ప్రభుత్వం మీద నామీద కుక్కలెన్ని మొరిగినా మేం పట్టించుకునేదే లేదు. ప్రజల ఆశీస్సులుతోనే మేం ముందుకుపోతూ ఉంటాం.