జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు టిడిపి అధినేత చంద్రబాబు ఫోన్

– పవన్ విశాఖ టూర్ పై పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వం వైఖరిపై పవన్ తో మాట్లాడిన చంద్రబాబు
– వందల మంది జనసేన నేతలపై అక్రమ కేసులను, అరెస్ట్ లను తప్పు పట్టిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ పై పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వం చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమం నిర్వహించుకుంటుంటే ఆంక్షలు విధించడాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా తప్పు పట్టారు.

విశాఖ పర్యటనపై తనకు నోటీసులు ఇవ్వడం, నేతలను అరెస్టు చేసిన అంశంపై పవన్…టిడిపి అధినేతకు వివరించారు. రాష్ట్రంలో అధికార పార్టీ పోలీసులతో రాజ్యం చెయ్యాలనుకుంటుందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు. ప్రతిపక్ష నేతల కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం, నేతలను వ్యక్తిగతంగా దూషించడం అనే అప్రజాస్వామిక విధానాలతో వైసిపి పని చేస్తుందని చంద్రబాబు అన్నారు.

జనసేన నేతలను వందల సంఖ్యలో అరెస్టులు చెయ్యడాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు తప్పు పట్టారు. ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చెయ్యాలని… వారిపై పెట్టిన కేసులు ఎత్తివెయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వారి వారి కార్యక్రమాలు చేసుకునే హక్కు ఉందని…దాన్ని వైసిపి ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే వారిపై మొదటి నుంచి ప్రభుత్వం విధానం ఇలాగే ఉంటుందని పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు వ్యాఖ్యానించారు. పవన్ కు నోటీలు ఇవ్వడం సరికాదన్న చంద్రబాబు…..ఆయన పర్యటనపై ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply