విశాఖలో పార్టనర్ షిప్ సదస్సుల పేరుతో చంద్రబాబు రూ.200 కోట్లు దుబారా

Spread the love

– ఈ నెల 28న విశాఖలో 1.43 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం
-పెట్టుబడులు, పరిశ్రమలకు కేంద్రంగా ఏపీ
-మే మాసాంతానికి అన్ని మున్సిపాలిటీల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ సిద్ధం
– గ్రేటర్ విశాఖ, విజయవాడ కార్పొరేషన్లకు 4-స్టార్ రేటింగ్
– ఇక కేంద్ర ప్రభుత్వ సర్వీసులూ గ్రామ వార్డు సచివాలయాల్లో లభ్యం
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖలో పార్టనర్ షిప్ సదస్సుల పేరుతో చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రూ.200 కోట్లు దుబారా చేసాడని, ఉత్తుత్తి ఎంఓయు లతో ప్రజలకు పిచ్చోళ్లను చేయాలని చూశాడని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వస్తాయని, ఏ ఒక్కరూ ఖాళీగా ఉండరని ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పాడని గుర్తుచేశారు.

చంద్రబాబు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి కూడా నిజం కాలేదని అన్నారు.
రాష్ట్రంలోని పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలన్నదే సిఎం జగన్ లక్ష్యమని అందులో బాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. కోర్టు కేసుల పరిష్కారంలో జాప్యమయ్యే చోట పేదలకు ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలను గుర్తించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని తెలిపారు. కోర్టు వివాదం తొలగిపోవడంతో ఈనెల 28న విశాఖలో 1.43 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారని, ఈ మేరకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారని అన్నారు.

రాష్ట్రం పెట్టుబడులు, పరిశ్రమలకు కేంద్రంగా మారుతోందని, తాజాగా బిర్లా గ్రూప్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో గ్రాసిమ్ కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటు చేసిందని అన్నారు. ఇందులో స్థానికులకు 75% ఉద్యోగాలిచ్చేందుకు కంపెనీ ఆమోదం తెలిపిందని. రూ.2,700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,450 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా భవనాలు సమకూర్చే పనులు చేపట్టిందని అన్నారు. నిర్మాణ పనులు పూర్తి చేసుకొని వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లు మే నెల చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. రూ.340 కోట్లతో 344 కొత్త భవనాల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇప్పటికే 184 భవనాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.

క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేంవర్క్ 2.o లో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్లు 4-స్టార్ రేటింగ్ సాధించినందుకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. గ్రీన్ హౌస్ వాయువు విడుదల తగ్గించడంలో క్లైమేట్ స్మార్ట్ సిటీల పాత్ర కీలకమని, ఈ మేరకు వారు చేసిన కృషి అభినందనీయమని అన్నారు.

సీఎం జగన్ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి పాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని. ప్రభుత్వ సేవలన్నీ సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే వచ్చాయని అన్నారు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాధారణ సేవల కేంద్రాల్లో (సీఎస్సీ) అందించే సేవలు కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి రావడంతో ప్రజల ముంగిటకు మరిన్ని సేవలు వచ్చాయని తెలిపారు..

కేంద్ర ప్రభుత్వ సేవలన్నీ ఇక పై సచివాలయాల్లో లభిస్తాయని, పాన్ కార్డు, రైల్వే టికెట్ రిజర్వేషన్, కరెంట్ బిల్లుల చెల్లింపులు, పీఎం – కిసాన్, ఆర్టీఏ, ఇన్సూరెన్స్ మెదలగు సేవలన్నీ సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15075 సచివాలయాల్లో ప్రజలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు.

Leave a Reply