– సభలో మాట్లాడే నైతిక అర్హత ఆ పార్టీ సభ్యులకూ లేదు
– చంద్రబాబు హయాంలోనే తెరుచుకున్న బెల్టులు, పర్మిట్ రూములు
– అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటిని రద్దు చేసిన సీఎం జగన్
– చంద్రబాబు రెన్యువల్ చేయడం వల్లే రాష్ట్రంలో నేటికీ నడుస్తున్న బార్లు
– రామోజీరావుకు వయసొచ్చినా బుద్ధి మాత్రం రాలేదు
– సహజ మరణాలను మద్యం వల్ల జరిగినట్టుగా కథనాలు
– తెల్లారేసరికి సిగ్గులేకుండా జంగారెడ్డిగూడెం బయలుదేరిన చంద్రబాబు
– ఏదైనా మాట్లాడితే వెక్కి వెక్కి ఏడుస్తాడు
– ఎందుకు ఏడుస్తున్నాడో కూడా తెలియదు
– మద్యం వల్ల చనిపోయిన వాళ్ళ ఉసురు చంద్రబాబుకు తగులుతుంది
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)
అసెంబ్లీ, మార్చ్ 14: మహానుభావుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించి అమలు చేశారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారించారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. మద్యపాన నిషేధంపై సభలో మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు, ఆయన పార్టీ సభ్యులకు లేదని అన్నారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే చంద్రబాబు దానికి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో బెల్ట్ షాపులు, బార్లు, వైన్ షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూములు వచ్చాయన్నారు. మద్యాన్ని భయంకరంగా ఏరులై పారేలా చేశాడన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మద్యపానం అమలు చేయాలని, మద్యాన్ని ఏరులై పారించాలని, మద్యంపై వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకోకూడదని ఈనాడులో రామోజీరావు కథలుకథలుగా కథనాలు రాశాడన్నారు. టిడిపి అధికారం కోల్పోతే మద్య నిషేధంపై రామోజీరావు ఉద్యమాలను నడిపే పరిస్థితికి వచ్చాడన్నారు. రామోజీరావుకు వయసు వచ్చింది కానీ బుద్ధి మాత్రం రాలేదన్నారు.
జంగారెడ్డిగూడెంలో సహజంగా మరణాలు సంభవించాయని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ఎక్కడా ఆందోళన చేయలేదని, ఆసుపత్రులకు తీసుకు రాలేదని, కేసులు పెట్టలేదని, అక్రమ మద్యం లేదా నాటుసారా వల్ల చనిపోయారని చెప్పలేదన్నారు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన చంద్రబాబు మాత్రం జంగారెడ్డిగూడెం వెళ్తున్నానని, అసెంబ్లీకి వెళ్లి గొడవ చేసి వాయిదా వేయించుకుని రావాలని తన పార్టీ చెప్పాడన్నారు. దీంతో సభను నడవకుండా డ్రామా చేసే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. సిగ్గులేని నీచాతి నీచమైన ప్రతిపక్షనేత రాష్ట్రానికి దొరకడం దౌర్భాగ్యమని అన్నారు. రాష్ట్రంలో మద్యం వల్ల చనిపోయిన ప్రతి వ్యక్తి ఉసురు చంద్రబాబుకు తగులుతుందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నడుస్తున్న బెల్టుషాపులను, వైన్ షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూమ్ లను రద్దు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు దిగిపోయే ముందు ఐదేళ్లకు బార్లను రెన్యువల్ చేసినప్పటికీ వాటిని కూడా సీఎం జగన్ రద్దు చేశారని తెలిపారు. అయితే బార్ల యజమానులు కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నారన్నారు.
చంద్రబాబు వల్లే రాష్ట్రంలో నేటికీ బార్లు నడుస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు లాంటి వెధవల నాయకత్వంలో ఉన్న టిడిపి సభ్యులు సభలో సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి మద్యం అందుబాటులో ఉండకూడదని వాటి రేట్లను భారీగా పెంచారన్నారు. మద్యం ధరలు పేదలకు అందుబాటులో ఉండాలంటూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలు, ధర్నాలు కూడా చేశారన్నారు. చంద్రబాబు కూడా బహిరంగ సభలో మద్యం బ్రాండ్ల పేర్లు చెప్పి వాటిని ప్రోత్సహించారన్నారు. ఇప్పుడు సభలో డ్రామా ఆడడానికి ఈనాడు రామోజీరావు కారణమని అన్నారు. సహజ మరణాలను మద్యం వల్ల జరిగినట్టుగా కథనాలు రాయడం జరిగిందన్నారు.
చంద్రబాబు కూడా సిగ్గులేకుండా తెల్లారేసరికి జంగారెడ్డిగూడెం బయలుదేరి వెళ్లాడన్నారు. ఏదైనా మాట్లాడితే సిగ్గు, శరం లేకుండా వెక్కి వెక్కి ఏడుస్తాడన్నారు. చంద్రబాబు ఎందుకు ఏడుస్తున్నాడో కూడా తెలియదన్నారు. రాజకీయాల కోసం ఆడ వాళ్లను కూడా అడ్డం పెట్టుకోవడానికి, మద్యాన్ని ప్రోత్సహించడానికి చంద్రబాబు అలవాటు పడ్డాడని అన్నారు. సభ సజావుగా నడవాలంటే చంద్రబాబు డ్రామాలో భాగస్వాములైన వాళ్లందరినీ సస్పెండ్ చేసి బయటకు పంపాలని అసెంబ్లీ స్పీకర్ కు మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.