రాష్ట్రం ఏమైపోతుందోనని చంద్రబాబు ఆందోళన
ప్రజలు, కార్యకర్తల గురించే ఆయన ఆలోచిస్తున్నారు
రాష్ట్రాన్ని అడ్డంగా దోచినవాళ్లే ఆరోపణలు చేస్తున్నారు
ములాఖత్ అనంతరం టిడిపి సీనియర్ నేత యనమల
రాజమహేంద్రవరం : ఏమీ లేని స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టులో తప్పుడు కేసుపెట్టి చంద్రబాబునాయుడు అక్రమంగా జైల్లో పెట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నా రాష్ట్రం ఏమైపోతుందోనన్న బాధలోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, యనమల రామకృష్ణుడు మంగళవారం మధ్యాహ్నం ములాఖత్ అయ్యారు.
అనంతరం రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ ఏ తప్పూ చేయని నేతను తప్పు చేసినట్లు సృష్టించి తప్పుడు కేసులు బనాయించారు, రాష్ట్రాన్ని దోచిన వాళ్లే చంద్రబాబు తప్పు చేశారని చెబుతున్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. మచ్చలేని వ్యక్తిని జైల్లో పెడితే బాధపడకుండా ఉంటారా? ఈ ప్రభుత్వం చంద్రబాబును వేధించి, హింసిస్తోందని ప్రజలు గుర్తించారు. ప్రజలు, కార్యకర్తలు ఎలా ఉన్నారని చంద్రబాబు అడిగారు.
కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసులపై బాధపడ్డారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజిత ఏపీని అభివృద్ధి చేసింది చంద్రబాబే. ఆయన చేపట్టిన కార్యక్రమాలతోనే రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలచింది. రాష్ట్రాన్ని వైసిపి పాలకులు ధ్వంసం చేస్తుంటే చంద్రబాబు సంతోషంగా ఎలా ఉంటారు? పథకాల పేరుతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. గతంలో జగన్ ముఠా దోపిడీని సీబీఐ కూడా వాటిని రుజువు చేసింది. అయినా వారు దర్జాగా జనంలో తిరుగుతున్నారు. 2049 నాటికి దేశం, రాష్ట్రం ఎలా ఉండాలన్న దానిపై చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశారు. దానికి సన్నద్ధం అవుతున్న తరుణంలో కేసులు పెట్టి జైల్లో పెట్టారు.
తనకు సంఘీభావం తెలిపిన జాతీయ నేతలకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలపమన్నారు. రాష్ట్రభవిష్యత్తును నాశనం చేసే వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. జైలులో కనీస సదుపాయాలు లేవు. తన సౌకర్యాల గురించి చంద్రబాబు బాధపడటం లేదు…ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అక్రమ కేసుపై పార్లమెంట్ లో మా ఎంపీలు పోరాడతారు. ఇది జాతీయ స్థాయి అంశం. కోర్టు విషయాలు బయట మాట్లాడటం సమంజసం కాదు.
జాతీయస్థాయి నాయకుడిపైనే ఈ విధంగా అక్రమ కేసు బనాయిస్తే, మిగతా వారిపై కేసులు పెట్టడన్న గ్యారంటీ ఏంటి? ఎన్ని కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని యనమల స్పష్టంచేశారు.
శ్రీ సిద్ధి లక్ష్మీగణపతి ఆలయంలో భువనేశ్వరి పూజలు
అంతకుముందు రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో నారా భువనేశ్వరి, బాలకృష్ణ సతీమణి వసుంధర, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీనేతలు ఆదిరెడ్డి వాసు, మంతెన సత్యనారాయణరాజు, పెందుర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.