– 4న ఎన్టీఆర్ జిల్లా నుండి పర్యటనలకు శ్రీకారం
– నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో సభలు
– 2 నెలల పాటు ప్రజల మధ్యలోనే చంద్రబాబు
– ఇసుక, మద్యం, గనుల దోపిడీలను లేవనెత్తుతాం
– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
గుడివాడ, నవంబర్ 2: రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళేందుకు పార్టీ శ్రేణులను క్రియాశీలం చేయడం జరిగిందన్నారు.
ఈ ఏడాది మే నెల్లో విజయవంతంగా మహానాడును జరుపుకున్నామని తెలిపారు. మహానాడు తర్వాత ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మూడు రోజుల పాటు పర్యటించడం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సందర్శించేలా కార్యాచరణ ప్రణాళికను చంద్రబాబు రూపొందించుకున్నారని చెప్పారు. దీనిలో భాగంగా 117 నియోజకవర్గాల ఇన్ఛార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సమీక్షలను పూర్తిచేయడం జరిగిందన్నారు. ఈ నెల 4వ తేదీ నుండి చంద్రబాబు జిల్లాల పర్యటనలను ప్రారంభిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో రెండు సభలు జరుగుతాయన్నారు. ఆ తర్వాత ప్రతి వారం ఒక పర్యటన ఉంటుందని చెప్పారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రజల మధ్యలోనే చంద్రబాబు ఉంటారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే లక్ష్యంగా చంద్రబాబు జిల్లాల పర్యటనలు సాగుతాయన్నారు. ముఖ్యంగా ఇసుక, మద్యం, గనుల దోపిడీ వంటి అంశాలను బలంగా లేవనెత్తడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వంలో తారాస్థాయికి చేరిన అవినీతిని బలంగా చాటి చెబుతామన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్, ఇంటి పన్నులను కూడా పెంచారన్నారు. పెట్రోల్, డీజిల్ పై భారీగా పన్నులు విధించారన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావడం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్ట్ లు కూడా నిలిచిపోయాయన్నారు.
రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా తయారైందని, సామాన్యులకు ఎటువంటి పనులు జరగడం లేదన్నారు. ఈ నేపథ్యంలో జరిగే చంద్రబాబు పర్యటనలను పార్టీ శ్రేణులు, అన్నివర్గాల ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే 2023 జనవరి నెల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ఏడాది పాటు ఈ పాదయాత్ర జరగనుందని శిష్ట్లా లోహిత్ చెప్పారు.