తొందరపడి ముందే కూస్తున్న వైసీపీ కోయిల

-వైసీపీలో ఇంచార్జిల మార్పు ప్రకంపనలు
-మార్చాల్సిందేనంటున్న సర్వే సంస్థలు
-మార్పుల్లో ఇన్చార్జులు కూడా

ఏపీలో వైసీపీ తొందరపడి ముందే కూస్తోంది. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చాల్సిన అవసరాన్ని సర్వే సంస్థలు నాయకత్వానికి స్పష్టం చేస్తున్నారు. పీకే టీంతోపాటు, తన సొంత సర్వేల్లోనూ ఇలాంటి నివేదికలే వెలుగుచూడటంతో, రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఇక మార్పులు అనివార్యం కానున్నాయి.

వైసీపీలో అదనపు ఇన్చార్జుల నియామకం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈపాటికే గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదును నియమించడంతో ఎమ్మెల్యే శ్రీదేవి అగ్గిలంపై గుగ్గిలమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరికొన్ని నియోజకవర్గాల్లో అదనపు ఇన్చార్జులను నియమించడం, మార్పులు చేయడంపై వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. దీంతో ఎవరి సీటుకు ముప్పు వాటిల్లుతుందోనన్న ఆందోళన ఆయా నియోజకర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల్లో నెలకొంది.

సీఎం వైఎస్ జగన్ మొత్తం 175 నియోజకవర్గాల్లో అనేక సర్వేలు చేయించారు. ఐ ప్యాక్ టీంతోపాటు ఢిల్లీకి చెందిన మరో సంస్థతోనూ ఈ సర్వేలు నిర్వహించినట్లు సమాచారం. వాళ్లు ఇచ్చిన నివేదికలను బట్టి మొత్తం 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు ఉండొచ్చని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అలాగే 12 మంది ఎంపీలను కూడా మార్చే అవకాశముంది. కొందర్ని ఎమ్మెల్యేలుగా పోటీకి దింపడం.. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం అదనపు ఇన్చార్జులను నియమించే ప్రక్రియ కొనసాగుతోంది.

ఇంతకీ 58 నియోజకవర్గాలు ఏవంటే.. గుంటూరు జిల్లాలో తెనాలి, మంగళగిరి, పొన్నూరు, తాటికొండ ఉన్నాయి. బాపట్ల జిల్లాలో బాపట్లతోపాటు వేమూరు, సంతనూతలపాడు, పర్చూరు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి, చిలకలూరిపేట, ప్రకాశం జిల్లాలో కొండపి, మార్కాపురం, యర్రగొండపాలెం, నెల్లూరు జిల్లాలో కావలి, ఉదయగిరి, కోవూరు, కందుకూరు, తిరుపతి జిల్లాలో వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలున్నట్లు సమాచారం.

ఇంకా ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు చూస్తే ఎచ్చెర్ల, కురుపాం, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, బొబ్బిలి, ఎస్ కోట, గజపతినగరం, వైజాగ్ ఈస్ట్, వైజాగ్ సౌత్, పాయకరావుపేట, నర్సీపట్నం, అరకు, గాజువాక, పిఠాపురం, పాడేరు, జగ్గంపేట, ప్రత్తిపాడు, రాజమండ్రి అర్బన్, రూరల్, కాకినాడ రూరల్, రంపచోడవరం, పాలకొల్లు, ఉంగుటూరు, ఏలూరు, పెనమలూరు, విజయవాడ వెస్ట్; మైలవరం, కైకలూరు, అవనిగడ్డ ఉన్నాయి.

రాయలసీమలో పూతలపట్టు, పలమనేరు, శింగనమలై, పత్తికొండ, హిందూపురం, పుటపర్తి, అనంతపురం, కల్యాణదుర్గం, నందికొట్కూరు, మైదుకూరు నియోజకవర్గాలున్నాయి. 12 ఎంపీ నియోజవర్గాల్లోని పార్టీ ఎంపీలు, ఇన్చార్జులను కూడా మార్చనున్నట్లు తెలుస్తోంది. అందులో హిందూపురం, అనంతపురం, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, నర్సాపురం, అమలాపురం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి.

ఇప్పటిదాకా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో తలమునకలవుతున్న ఎమ్మెల్యేలు, ఇన్చార్జులను మార్చడం వల్ల ప్రయోజనం ఉంటుందని సీఎం జగన్ భావిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మార్పులతో కొంత ప్రయోజనం ఉండొచ్చు. అసలు ప్రభుత్వంపైనే వ్యతిరేకత ఉంటే ఈ మార్పులు మరింత నష్టానికి దారి తీసే అవకాశముంది. ఈపాటికే ఎన్నికల మూడ్లోకి వెళ్లిన వైసీపీ నేతల్లో మార్పులపై గుబులు రేగుతోంది. తాజా పరిణామాలు, నాయకత్వం అప్రమత్తత వంటి పరిణామాలు సిట్టింగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Leave a Reply