చెన్నైలో డ్రగ్స్ తీగ లాగితే, ఒంగోలు డొంక తేలింది

-ఒంగోలులో నిషేధిత డ్రగ్స్ కలకలం
– తయారీ కేంద్రంపై దాడిచేసిన చెన్నై పోలీసులు

ఒంగోలులోని నిషేధిత మత్తు పదార్థాల తయారీ కేంద్రంపై చెన్నై పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. తీగలాగితే డొంక కదలినట్లు మత్తు పదార్థాలు సేవించే వారిని అదుపులోకి తీసుకుని విచారించిన చెన్నై పోలీసులకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తయారీ కేంద్రం ఉందని తెలిసింది.

అక్కడ గుట్టుగా మెథాంఫెటమైన్ అనే డ్రగ్ని తయారుచేసి ప్యాకెట్ల రూపంలో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. సోమ వారం రాత్రి చెన్నై నుంచి వచ్చిన పోలీసులు ప్రత్యేక బృందం నేరుగా పారిశ్రామిక వాడలో గల గోడౌన్ వద్దకు వెళ్లారు. తనిఖీ చేయగా అక్కడ మత్తు పదార్థాలు తయారుచేస్తున్నట్లు గుర్తించారు. ఆరు రోజుల క్రితం చెన్నైలో నలుగురు డ్రగ్స్ తీసుకునే వారిని నగర జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో విచారణ చేశారు.

ఈ మెథాంఫెటమైన్ ఎక్కడ నుంచి వస్తుంది. ఎవరు సరఫరా చేస్తున్నారు అనే కోణంలో విచారించిన పోలీసులకు ఒంగోలు తయారుకేంద్రం గుట్టు తెలిసింది. దీని మూలాలు హైదరాబాద్లో ఉన్నట్లు తేలింది. దీంతో అక్కడకు కూడా ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు సమాచారం. ఒంగోలు కేంద్రంగా ఈ మత్తు పదార్థం తయార వుతుందన్న విషయం వెలుగులోకి రావడంతో ఆ మేరకు ఎస్సై విజయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం వచ్చింది.

తయారీ కేంద్రంలో దొరికిన ముడి పదార్థాలు, మెథాంఫె టమైన్ తయారీకి వినియోగించే పరికరాలను చూసి వారు విస్మయం వ్యక్తం చేశారు. అయితే అక్కడ రెండేళ్ల క్రితం వరకు ఒంగోలుకు చెందిన పెంట్యాల బ్రహ్మయ్య విస్తరాకుల తయారీ కేంద్రం నిర్వహించేవాడు. అతని దగ్గర నుంచి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నామని చెబుతున్న విజయ్, వెంకటరెడ్డి అనే వ్యక్తులు అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారుచేసి చెన్నైతోపాటు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఈ మేరకు చెన్నై పోలీసులు మత్తు పదార్థాల తయారీకేంద్రాన్ని సీజ్ చేశారు.